ఇంత బేలగా అయిపోయారే..?

అరరే ఎంత బేలగా మాట్లాడుతున్నారు…. ఆ గొంతులో ఏది అప్పటి అహంకారం….! సినిమా వ్యాపారం., దాతృత్వం కాదన్న కరకుదనం ఏది…. వినోదం కోరుకునే వాళ్లు డబ్బు ఖర్చు [more]

Update: 2021-07-25 11:00 GMT

అరరే ఎంత బేలగా మాట్లాడుతున్నారు…. ఆ గొంతులో ఏది అప్పటి అహంకారం….! సినిమా వ్యాపారం., దాతృత్వం కాదన్న కరకుదనం ఏది…. వినోదం కోరుకునే వాళ్లు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అని ఖరాఖండిగా చెప్పిన యాపారి ఎక్కడున్నాడు. కుటుంబం సంపాదనలో సినిమా చూడటానికి భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం అనివార్యం అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏమయ్యాడు….?

పోలికే లేదే…?

దగ్గుబాటి సురేష్ బాబు….. పరిచయం అక్కర్లేని పేరు… నాలుగైదేళ్ల క్రితం ఆయనలోని మనిషికి ఇప్పుడున్న మనిషికి పోలికే లేదు. చంద్రబాబు ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో విజయవాడ బెంజి సర్కిల్లో మూతబడిన బెంజి కంపెనీ స్థలంలో ఓ మల్టీ ప్లెక్స్ వెలిసింది. దాని ప్రారంభం సందర్భంగా ఇదే సురేష్ బాబు గారు సినిమా టికెట్ల ధర గురించి ఏమన్నారో తెలుసా…. టికెట్ల ధర మా ఇష్టం…. వచ్చేవాడు వస్తాడు…. మేము చేసేది వ్యాపారం.., క్వాలిటీ కావాలి అనుకుంటే ధర పెట్టాల్సిందే….! మల్టీ ప్లెక్స్ లో పార్కింగ్, మైంటైనెన్స్, ఫీలింగ్ ఇవన్నీ కావాలంటే ఆ మాత్రం ఖరీదు ఉండాల్సిందే అన్నది ఆయన సూత్రం.

ఎవరు రమ్మన్నారంటూ…?

ఓ కుటుంబం మొత్తం థియేటర్ కి రావాలి అంటే టికెట్లకు, పాప్ కార్న్ , కూల్ డ్రింక్స్ కి 2వేలు పైనే వదులుతాయి అంటే, రాకండి ఎవరు రమ్మన్నారు అన్నది ఆయన వాదన….! ఆంధ్రప్రదేశ్ రాజధాని, చంద్రబాబు ప్రభుత్వంలో, తమదిగా భావించే ఊళ్ళో జనాన్ని పిండుకోవడం హక్కుగా భావించే రోజులు అవి. కరోనా రాక ముందు వరకు ఆయన వాదన , ఆలోచన అలాగే ఉండేది. కరోనా, OTT దెబ్బకి ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరలను నియంత్రించిన తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో B, C సెంటర్ లలో 20, 30 రూపాయలకు థియేటర్ లకు నడపలేము అన్నది ఆయన వాదన. విద్యుత్ ఛార్జీలు విజయవాడలో ఎంత ఉంటాయో, అమలాపురంలో కూడా అంతే ఉంటుంది అన్నది ఆయన వాదన. సింగల్ స్క్రీన్ థియేటర్ లలో ఈ భారం ఎక్కువగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ కారణంగా ఇచ్చిన రాయితీలు అమలు కాలేదని బాధ పడ్డారు.

కట్టడి చేసే సరికి…?

ఇవన్నీ సరే కానీ, జనానికి వినోదం ఇవ్వడం వ్యాపారంగా భావించిన సురేష్ బాబు గారు ప్రభుత్వం కట్టడి చేసే సరికి భవిష్యత్తు మొత్తం OTTదే థియేటర్లు నడపలేమని బెదిరింపులకు దిగుతున్నారు. చెరువు మీద అలిగితే ఏమైద్ది…., ఇప్పుడు కూడా అంతే….. సినిమాల్లో సంపాదించిన సొమ్మును రాజకీయాల్లోకి మళ్లించి అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాలను ప్రభావితం చేసి ఆడింది ఆటగా సాగించుకోవడం కుదరకపోతే ఇలా చేస్తారన్నమాట…. జనం ఎటూ OTT లు బెటర్ అని ఫిక్స్ అయిపోతున్నారు. అవసరం అయితే ఇంట్లోనే కాస్త పెద్ద స్క్రీన్ కొనుక్కుని ప్రశాంతంగా, జేబులకు చిల్లు పడకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనను కరోనా నేర్పింది. మన వాడు ముఖ్యమంత్రి కాలేదని ఏడాది వరకు అభినందించడానికే నోరు పెగలని పరిశ్రమ కదా…, ఆ అక్కసు అలాగే ఉంటుందని జనానికి కూడా తెలుసు.

నోట్…. వినోదం ఉచితంగా రాదు కొనుక్కోవాలి…. అది వ్యాపారం. #ట్రెండ్_సెట్ #మాల్ సూక్తి..

 

-శరత్ ,సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News