వైఎస్ విజయరహస్యమదే

అలాగే కానిద్దాం…వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పరిపాలనలో ఎక్కువగా వినియోగించిన వాక్యం ఇది. వినిపించిన మాట ఇది. తన ఆలోచనలకు భిన్నంగా ఎవరైనా ఏదైనా, సలహా, సూచన [more]

Update: 2019-08-19 15:30 GMT

అలాగే కానిద్దాం…వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పరిపాలనలో ఎక్కువగా వినియోగించిన వాక్యం ఇది. వినిపించిన మాట ఇది. తన ఆలోచనలకు భిన్నంగా ఎవరైనా ఏదైనా, సలహా, సూచన ఇచ్చిన సందర్భంలో తన నిర్ణయంపై పునరాలోచన చేసి వారితో ఏకీభవించినప్పుడు ఈ రెండు పదాలను వాడేవారాయన. సంక్షిప్తంగా, స్పష్టంగా తేల్చేసేవారు . ఇక దానికి తిరుగులేదు. అమలయి పోవాల్సిందే. రాజకీయాల్లో ఎగుడు దిగుళ్లు ఎన్నిటినో చవిచూసి ఎదురీది నిలిచిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముప్ఫైరెండేళ్ల రాజకీయ ప్రస్థానంలో 25 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష పాత్రనే పోషించారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న సందర్భాల్లోనూ రెబల్ నాయకుడే. 2004లో ఒంటిచేతిపై కాంగ్రెసును అధికారంలోకి తెచ్చేవరకూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి పాత్రనే పోషించారు. ప్రజలతో మమైకమై తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఆ వారసత్వం, మాస్ ఇమేజ్ తో నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టారు జగన్. తండ్రి సీఎంగా చేశాడు కాబట్టి ఉత్తి పుణ్యానే వచ్చి వాలిపోలేదు పదవి. రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర, ఏడేళ్ల కష్టాలు, అవమానాలు, వెంటాడిన కేసులు.. ఒక వ్యక్తి తన జీవితంలో చూడాల్సిన ఈతిబాధలన్నిటినీ భరించారు జగన్. కానీ అదే పట్టుదల ..తండ్రిలో కనిపించే కిల్లర్ ఇన్ స్టింక్ట్ ..మడమ తిప్పని రాజకీయ పోరాటంతో పవర్ పగ్గాలు చేపట్టారు. అప్రతిహత విజయం నమోదు చేశారు. ఎదురులేని ఆధిక్యత. కనీసం అయిదారు నెలల వరకూ ప్రతిపక్షాలు నోరు విప్పే అవకాశమే ఉండకూడదు. అంతటి ఘన విజయాన్ని అందించి పెట్టారు ప్రజలు.

అవసరం లేని రాద్ధాంతం…

కానీ అప్పుడే విపక్షాలు రోడ్డెక్కుతున్నాయి. తమ ఆందోళనలకు తగిన ఆధారాలనూ చూపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వర్గాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రజలిచ్చిన అధికారం, దానినెవరూ తోసిపుచ్చలేరు. అందుకే అవకాశం కోసం ఎదురుచూస్తూ ప్రతి విషయాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు ప్రత్యర్థులు. తీవ్రమైన రంధ్రాన్వేషణే రాష్ట్రంలో సాగుతోంది. అటువంటి స్థితిలో అత్యంత అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన రాష్ట్రప్రభుత్వం కొన్ని సందర్బాల్లో దూకుడు ప్రదర్శించడంతో విపక్షాలకు ఆయుధాలు అందుతున్నాయి. రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ముందుకు కదులుతోంది. తమ పార్టీ కొంత నష్టపోయినా ఫర్వాలేదు. కమలం పార్టీకి సహకరించైనా వైసీపీ అంతు చూడాలనేది ప్రతిపక్ష టీడీపీ అగ్రనాయకుల్లోనే కొందరి ఆలోచన. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సమస్యలకు తోడు రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డిని చుట్టుముట్టి ఉన్న సమస్యలు ఇవన్నీ. పరిపాలనలో ఎక్కడ లొసుగు దొరికినా అదే ప్రధానాస్త్రం అవుతుంది. రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలిక అంశాల్లో దూరాలోచన చేయాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. అదే ప్రభుత్వానికి శ్రీరామరక్ష. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇటువంటి విషయాల్లో చాలా లోతుగా యోచించేవారు. ఎన్టీయార్ తర్వాత సంక్షేమానికి పెద్ద పీట వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సంస్కరణలనూ కొనసాగించారు. 1998-2004 మధ్య చంద్రబాబు నాయుడు దూకుడు కనబరచిన అంశాలను పూర్తిగా పక్కనపెట్టడకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్యాలెన్స్ చేసుకున్నారు. రాజకీయానికి, పరిపాలనకు మధ్య వారధి నిర్మించుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, సైబర్ నగరం అభివృద్ధి, హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాల వంటి ప్రాజెక్టుల్లో తన పాత్రనూ కీలకం చేసుకున్నారు.

అనుభవ రాహిత్యంతో…

రాజకీయాల్లో కక్ష సాధింపు అన్న పదం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకున్నా, కేసులు నమోదు చేసినా కక్ష సాధింపు అంటూ ప్రతిపక్షనాయకులు విమర్శలు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఎంత పెద్ద నాయకులైనా పరిహారం చెల్లించకతప్పదు. చర్య రాజకీయ కోణంలో తీసుకున్నప్పటికీ శిక్ష న్యాయపరంగానే పడుతుంది. అయితే పరిపాలనలో కక్ష సాధింపు అన్నభావన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. ప్రజల్లో చర్చకు దారి తీస్తుంది. అనుభవ రాహిత్యం, అత్యుత్సాహం కారణంగా అమాత్యుల్లోనే కొందరు అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరిపాలనలో కక్ష సాధింపు అన్న పదం ఇలా పుట్టిందే. దీనిని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద డ్రోన్ ఎగరడమనే ఒకానొక అంశం రాష్ట్రంలో అధికారవిపక్షాల సిగపట్లకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెసు, జనసేన సైతం ఈ విషయంలో విపక్ష వాదనకే సాంకేతికంగా మద్దతు పలుకుతున్నాయి. వరద బాధితులను వదిలేసి, కట్టను పట్టుకున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నాయి. ఈ పరిణామం విపక్షాలు సర్కారుకు వ్యతిరేకంగా సంఘటితమవుతున్నాయనేందుకు సూచన.

సమర్థ సలహాదారులేరీ?…

ప్రభుత్వాధినేతలకు తలలో నాలుకలా వ్యవహరించే సమర్థ సలహాదారులు ఎంతైనా అవసరం. చాణుక్యుడు లేకుండా చంద్రగుప్తుని వైభవం లేదు. తిమ్మరుసు లేకుండా కృష్ణదేవరాయలను ఊహించలేం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నే తీసుకుంటే తన ఆత్మగా పేర్కొనే కేవీపీ రామచంద్రరావు కీలక నిర్ణయాలకు దిక్సూచిగా నిలిచేవారు. కెప్టన్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రేమగా పిలుచుకునే కేవీపీ ..రాజకీయ విధానాలు, పాలనపరమైన అంశాల్లో లోతైన సలహాలనిచ్చేవారు. నేరుగా అధినేతతో సమావేశం కాలేని వారంతా కేవీపీ ద్వారా సమాచారం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అందచేసేవారు. ఆర్థిక విషయాల నియంత్రణలో రోశయ్య, సోమయాజులు వంటి వారి సలహాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గురి ఉండేది. ఇక ఫీల్డు లెవెల్ లో ప్రజలతో ఉండే ఉండవల్లి, సబ్బం హరి, కరుణాకరరెడ్డి వంటివారు ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారనే విషయాలను నిత్యం చేరవేసేవారు. ఒకరకంగా చెప్పాలంటే వీరంతా రాజకీయ గూఢచారులుగా వ్యవహరించేవారు. ప్రభుత్వానికి కళ్లు చెవులుగా పనిచేసేవారు. అంతటి పకడ్బందీ దిద్దుబాటు వ్యవస్థ ఉండబట్టే 2009 లో మహాకూటమి గా విపక్షాలు జట్టుకట్టినా, తెలంగాణ సెంటిమెంట్ వెంటాడినా ఎదురొడ్డి గెలవగలిగారువైఎస్ రాజశేఖర్ రెడ్డి.

ఆంతరింగక బృందం….

తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో పొరపాట్లు ఉన్నట్లుగా పై ఆంతరంగికుల్లో ఎవరైనా తన దృష్టికి తెస్తే … అలాగే కానిద్దాం..అంటూ వారి మాటకే ఓటేసేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే అతని విజయరహస్యం. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును బట్టి చూస్తే జగన్ తన తండ్రికంటే బలమైన నాయకుడు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కున్న దిద్దుబాటు ఏర్పాట్లు, విశ్వాస పాత్రమైన రాజకీయ ఆంతరంగిక బృందం కొరత వెన్నాడుతోంది. పరిపాలనకు సంబంధించి విప్లవాత్మక చర్యలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు వాటిని ముందుగా బయటపెట్టకూడదు. సాధ్యాసాధ్యాలు, సాంకేతిక సమస్యలపై రాజకీయ కోణంలో ఆంతరంగిక నాయకులతో మాట్లాడుకోవాలి. తదుపరి ప్రభుత్వపాలనలో కీలకంగా వ్యవహరించే అధికారుల నుంచి పాలన కోణంలో ఆచరణాత్మకతను చర్చించాలి. కేంద్రప్రభుత్వం, అంతర్జాతీయ వ్యవహారాలతో ముడిపడిన విషయాలపై కేంద్రప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులతో ముందుగానే సంప్రతింపులు జరపాలి. ఫైనల్ గా నిర్ణయాన్ని మంత్రివర్గం ముందు పెట్టి ఓకే చేయాలి. దీనివల్ల పరిపాలన పరమైన ఒడిదుడుకులు కనిపించవు. అభ్యంతరాలు, ఆటంకాలకు తావుండదు. పైపెచ్చు అంతా సాఫీగా సాగిపోతుంది. కేంద్రంతో ముడిపడిన పోలవరం ప్రాజెక్టు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో రాష్ట్రప్రభుత్వ సలహా యంత్రాంగం సరైన సూచనలు చేయలేదనే భావించాలి. ప్రభుత్వాధినేతకు ఆంతరంగికంగా ఉండాల్సిన రాజకీయ మంత్రాంగమూ మౌనం వహించిందనే చెప్పాలి. అవే ఇప్పుడు విపక్షాల ఆందోళనలకు ఉప్పందిస్తున్నఅంశాలు.. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన ప్రచార అస్త్రాలు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News