ఆమె లేకుండా తొలిసారి?

న్యూ ఢిల్లీ…. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజధాని నగరం. ఇది అంతర్జాతీయంగా అందరికీ అత్యంత సుపరిచత నగరం. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ప్రపంచ వ్యాప్తంగా [more]

Update: 2020-02-06 16:30 GMT

న్యూ ఢిల్లీ…. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజధాని నగరం. ఇది అంతర్జాతీయంగా అందరికీ అత్యంత సుపరిచత నగరం. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తాయి. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఈ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి దానిమీద కేంద్రీకృతమైంది. కేజ్రీవాల్ గెలుపు ఖాయమే అయినప్పటికీ విపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు ఆయనకు ఏ మేరకు పోటీ ఇవ్వగలవన్నది ప్రశ్నార్థకం.

త్రిముఖ పోటీ అంటున్నా….

కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ సబర్వాల్, భారతీయ జనతా పార్టీ నుంచి సునీల్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా రామ్ గులామ్ లను కేజ్రీవాల్ ను ఎదుర్కొంటున్నారు. మొత్తం 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 668 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఒక్క న్యూఢిల్లీలోనే 28 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎంతమంది బరిలో ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి మధ్యనే పోటీ కేంద్రీకృతమైంది. కాంగ్రెస్, బీఎస్పీ ప్రభావం నామమాత్రమేనని చెప్పవచ్చు. కేజ్రీవాల్ నామినేషన్ ప్రక్రియ పెద్ద ప్రహసనాన్ని తలపించింది. చివరి రోజున నామినేషన్ల దాఖలకు వచ్చిన ఆయనకు మధ్యాహ్నం 3గంటలకు టోకెన్ లభించింది. సాయంత్రం ఐదున్నర లోపు నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అందించాలి. కానీ అప్పటికే 20 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి టోకెన్లు పొందారు. నిబంధనల ప్రకారం ఒకసారి టోకెన్ పొందితే సమయం దాటిన తర్వాత కూడా నామినేషన్లను అధికారులు తీసుకోక తప్పదు. దీంతో కేజ్రీవాల్ రాత్రి పదిగంటల తర్వాత నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు కేజ్రీవాల్ ఆరుగంటలు వేచి ఉన్నారు. తమ నేతను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకే విపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా అదేరోజు పలువురు అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించారన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ. అలాంటిదేమీ లేదని ప్రజల సానుభూతిని పొందేందుకు, ప్రచారం పొందేందుకు కేజ్రీవాల్ ఈ హడావిడి చేశారన్నది విపక్షాల ఆరోపణ.

షీలా దీక్షిత్ విజయంతో…..

ఈ వాదనలను పక్కన పెడితే న్యూఢిల్లీ నుంచి రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయిన కేజ్రీవాల్ మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కన్పిస్తుంది. మొత్తం 1,24,165 మంది ఓటర్లున్నారు. వీరిలో 69,175 మంది పురుషులు, 54,981 మంది మహిళలు ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం న్యూఢిల్లీ లోక్ సభ స్థానం పరిధిలోనిది. నియోకవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో ఇది ఏర్పాటయింది. 2013 నుంచే నియోజకవర్గంలో ఈవీఎంలు వాడుతున్నారు. అదే సమయంలో దొంగ ఓట్లను అడ్డుకునేందుకు వీవీ ప్యాట్ లను వాడుతున్నారు. 2015 ఎన్నికల్లోనూ ఈ రెండు విధానాలు ఇక్కడ అమలు జరిగాయి. తొలిసారి 2008లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజం, దివంగత నేత షీలా దీక్షిత్ ఇక్కడ విజయం సాధించారు. 1998 నుంచి 2013 వరకూ వరసగా మూడుసార్లు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కు నియోజకవర్గంపై గట్టి పట్టుంది. వాస్తవానికి ఢిల్లీ అభివృద్ధికి పాటుపడిన నేతల్లో ఆమె ప్రధమురాలని చెప్పుకోవచ్చు. హస్తం పార్టీ మూడుసార్ల విజయం వెనక షీలా దీక్షిత్ పాత్ర అత్యంత కీలకం.

కేజ్రీవాల్ ను నిలువరించడం….

2013 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేరుగా అప్పటి సీఎం షీలా దీక్షిత్ పైనే పోటీ చేస్తానని ప్రకటించారు. అందరి నాయకుల మాదిరిగా తన ప్రాంతం, సొంత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట కాకుండా కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలన్న ఉద్దేశ్యంతో షీలా దీక్షిత్ పైనే కేజ్రీవాల్ పోట ీచేయడం విశేషం. 2015 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఘన విజయం సాధించారు. ఆయనకు 57,213 ఓట్లు (64.34 శాతం) రాగా, బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మ 25,630 ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.27 వేలకు పైగా మెజారిటీతో కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. తొలిసారి బరిలోకి దిగిన 2013 ఎన్నికల్లో ఆయనకు 44,269 ఓట్లు రాగా(53.46), షీలా దీక్షిత్ కు కేవలం 18,405 (22.23) శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 26 వేలకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. 2008లో ఇదే నియోజకవర్గం నుంచి షీలా దీక్షిత్ బీజేపీ అభ్యర్థి విజయ్ జోలీపై 14 వేల మెజారిటీతో విజయం సాధించారు. షీలా దీక్షిత్ లేకుండా కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కొనడం ఇదే తొలిసారి. ఆమె ప్రభావం ఢిల్లీ పైన, ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గంపైన అధికం. నియోజకవర్గంలో మొత్తం 153 పోలింగ్ కేంద్రాలున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ కేజ్రీవాల్ ను నిలువరించడం అంత తేలిక కాదన్నది విశ్లేషకుల వాదన.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News