టార్గెట్ దేవినేని ఉమ…త్వరలోనేనా?

జగన్ ప్రభుత్వం వరసగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో జైలుకెళ్లారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుల రిజిస్ట్రేషన్ల [more]

Update: 2020-08-28 03:30 GMT

జగన్ ప్రభుత్వం వరసగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో జైలుకెళ్లారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుల రిజిస్ట్రేషన్ల కుంభకోణ కేసులో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఇక తాజాగా మరో మంత్రి దేవినేని ఉమ పేరు బాగా వినపడుతుంది. ఆయన మెడపై కత్తి వేలాడుతుందని టీడీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. కృష్ణా పుష్కరాల ఘాట్ ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విజలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఈఎస్ఐ స్కామ్ లోనూ అంతే…..

తొలుత ఈఎస్ఐ స్కామ్ ను కూడా విజలెన్స్ విచారణ ఆదేశించింది. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ కు అప్పగించడంతో అన్ని ఆధారాలను సేకరించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్ తరహాలోనే పుష్కర్ ఘాట్ ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను వెలికి తీయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రమేయం ఈ అవినీతిలో ఉందని వైసీపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.

అనేక ఘాట్ ల నిర్మాణం…..

2016లో కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పుష్కర్ ఘాట్ లను కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 34 పుష్కర ఘాట్లను నిర్మించింది. 24 పుష్కర్ నగర్ లను ఏర్పాటు చేసింది. వీటిలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని, టెండర్లు లేకుండానే పనులు అప్పగించడంతో పెద్ద యెత్తున అవినీతికి ఆస్కారం ఏర్పడిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

విజిలెన్స్ విచారణ తర్వాత…..

రిటైర్ట్ ఎస్ఈ సుధాకర్ తో పాటు మరో ఇద్దరు ఎస్ఈలు, ఒక ఈఈపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులపై విజిలెన్స్ విచారణ కేవలం నామమాత్రమేనని, అసలు టార్గెట్ దేవినేని ఉమ మాత్రమేనని తెలుస్తోంది. తొలుత విజిలెన్స్ విచారణకు ఆదేశించినా తర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుందంటున్నారు. దేవినేని ఉమను ఈ కేసులో ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. 2016లో జరిగిన ఈ పనులపై విచారణ దేవినేని ఉమ కోసమేనన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. సో.. వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ దేవినేని ఉమ అన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News