దేవినేనికి మద్దెల దరువు అందుకేనా?

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు పొలిటిక‌ల్ జ‌ర్నీలో ఇప్పుడు ఎదుర్కొంటోన్న క‌ష్టాలు ఎప్పుడూ ఎదుర్కోలేద‌నే చెప్పాలి. దేవినేని ఉమ నందిగామ‌లో ఉన్నా.. మైల‌వ‌రంలో [more]

Update: 2021-07-29 13:30 GMT

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు పొలిటిక‌ల్ జ‌ర్నీలో ఇప్పుడు ఎదుర్కొంటోన్న క‌ష్టాలు ఎప్పుడూ ఎదుర్కోలేద‌నే చెప్పాలి. దేవినేని ఉమ నందిగామ‌లో ఉన్నా.. మైల‌వ‌రంలో ఉన్నా.. పార్టీ అధికార‌పక్షంలో ఉన్నా… ప్రతిప‌క్షంలో ఉన్నా ఎప్పుడూ వ‌న్ మ్యాన్ షో చేసేవారు. అందుకే ఆయ‌న ప్రతిప‌క్ష పార్టీ నేత‌ల‌కే కాకుండా.. ఇటు సొంత పార్టీలోని అంద‌రు నేత‌ల‌కు ఎప్పటిక‌ప్పుడు టార్గెట్ అవుతూ వ‌చ్చారు. అయితే ఆయ‌న సొంత పార్టీలో నేత‌ల‌ను కూడా తొక్కేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ర‌న్న విమ‌ర్శలు ఉండ‌నే ఉన్నాయి. అయితే చంద్రబాబుకు అత్యంత ఇష్టుడు కావ‌డంతో జిల్లాలో ఆయ‌న క‌న్నా సీనియ‌ర్లు. ఆయ‌న్ను మించిన నేత‌లు కూడా దేవినేని ఉమను ఏం అనే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. అయితే గియితే కొడాలి నాని, వంశీ లాంటి వాళ్లు బ‌య‌ట‌కు వెళ్లాక దేవినేని ఉమను తిట్టడ‌మే ఒకే పార్టీలో ఉన్నప్పుడు క‌క్కలేక మింగ‌లేక రాజ‌కీయం చేసిన వారే.

ఓడిన నాటి నుంచి…?

తాజాగా దేవినేని ఉమ కేంద్రంగా కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ గా పేరున్న కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య క‌ర‌వ‌మంటే క‌ప్పకుకోపం…. విడ‌మంటే పాముకు కోపం అన్న చందంగా మాట‌ల యుద్ధం న‌డుస్తుంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోవ‌డ‌మే కాదు.. ఇటు నాలుగుసార్లగా వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తోన్న దేవినేని ఉమ సైతం మైల‌వ‌రంలో ఓడిపోయారు. దేవినేని ఉమ ఓడిపోవ‌డం వేరు.. ఆయ‌న కుటుంబానికి చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువుగా ఉన్న వ‌సంత ఫ్యామిలీకి చెందిన వ‌సంత నాగేశ్వర‌రావు త‌న‌యుడు వ‌సంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోవ‌డం వేరు. ఓడిపోయిన‌ప్పటి నుంచి ఆయ‌న అధికార ప‌క్షానికి గ‌ట్టిగానే టార్గెట్ అవుతున్నారు.

మాట నెగ్గించుకోవాలని….

విచిత్రం ఏంటంటే దేవినేని ఉమ 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచినా అప్పుడు కూడా ప్రతిప‌క్షంలోనే ఉన్నారు. అయితే అప్పుడు ప్రతిప‌క్షంలోనూ అనేక పోరాటాలు చేసి త‌న మాట నెగ్గించుకునే వారు. అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎక్కడిక‌క్కడ న‌ట్లు బిగించేస్తున్నారు. క‌నీసం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద ఐదు పంచాయ‌తీలు కూడా గెలిపించుకోలేని దుస్థితి. తాజాగా అక్రమ మైనింగ్ జ‌రుగుతోంద‌ని ప‌రిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమపై వైసీపీ కార్యక‌ర్తలు దాడిచేశార‌ని ఆయ‌న ఆరోపించ‌డం.. ఇటు వైసీపీ కౌంట‌ర్లతో మ‌రోసారి దేవినేని ఉమ రాజ‌కీయంగా వార్తల్లో నిలిచారు.

కాలం కలసి రావడంతో…?

ఇక దేవినేని ఉమకు ఇప్పుడున్న స‌వాళ్లు గ‌తంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. 1999లో అన్న దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ మ‌ర‌ణంతో వ‌చ్చిన సానుభూతితో గెలిచారు. 2004లో వ‌సంత నాగేశ్వర‌రావు కుమారుడు కేపీని ప‌క్కన పెట్టి పోటీ చేయ‌డం క‌లిసొచ్చింది. 2009లో ఆయ‌న‌పై పోటీ చేసిన వ్యక్తి పేరు కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఇక 2014లో అప్పటి వ‌ర‌కు పెడ‌న‌లో ఉన్న జోగి ర‌మేష్ ఇక్కడ పోటీ చేయ‌డం మ‌రోసారి దేవినేని ఉమకు క‌లిసి వ‌చ్చింది. ఇలా ప్రతిసారి ఆయ‌న‌కు కాలం క‌లిసి రావ‌డం గెల‌వ‌డం జ‌రుగుతూ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగాను.. ఆర్థికంగాను కేపీ పోటీలో ఉండ‌డం దేవినేని ఉమకు తొలిసారి ఓట‌మిని రుచి చూపించింది.

ఏదో ఒక రకంగా…?

ఇక కేపీతో పాటు జ‌గ‌న్ సైతం ఇక్కడ ప్రత్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో దేవినేని ఉమ ఆట‌లు సాగ‌డం లేదు. పైగా జ‌గ‌న్ రూట్ మ్యాప్ చూసే త‌ల‌శిల ర‌ఘు కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ్యక్తి కావ‌డంతో దేవినేని ఉమకు మ‌ద్దెల దరువు మోగుతోంది. ఇక ఉమా చేస్తోన్న పోరాటాల‌కు ప్రజ‌ల్లోనూ సింప‌తీ రావ‌డం లేదు. దీంతో ఏదోలా అల‌జ‌డి రేపి కాస్త జ‌నాల్లో ఉండాల‌న్నదే ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

Similar News