ధర్మానకు మరో లక్కీ ఛాన్స్

ధర్మాన కృష్ణదాస్ కు మరో ఛాన్స్ దక్కబోతోంది. త్వరలోనే ఆయన ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం పార్టీలో జోరుగా ఉంది. త్వరలోనే దీనిపై జగన్ నిర్ణయం తీసుకుంటారని [more]

Update: 2020-06-30 06:30 GMT

ధర్మాన కృష్ణదాస్ కు మరో ఛాన్స్ దక్కబోతోంది. త్వరలోనే ఆయన ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం పార్టీలో జోరుగా ఉంది. త్వరలోనే దీనిపై జగన్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. జగన్ కేబినెట్ లో ఇద్దరు మంత్రులు వైదొలిగినట్లే. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల స్థానంలో కొత్త వారిని జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే జగన్ కసరత్తు ప్రారంభించారు.

రెండు మంత్రివర్గ స్థానాల్లో…..

అయితే ఈ రెండు స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు సామాజికవర్గాల వారీగా జగన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల నుంచి కేబినెట్ లో స్థానం దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులతో పాటు, సుదీర్ఘకాలం ఆయన వెన్నంటి నడచిన వారు కూడా ఇందులో ఉన్నారు. అందుకే జగన్ ఈ రెండింటిలో వేరే సామాజికవర్గాల వారిని నియమిస్తే పార్టీలో అసంతృప్తి తలెత్తే అవకాశముందని భావిస్తున్నారట.

కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా…..

అందుకోసమే అదే సామాజికవర్గం నేతలతో రెండు స్థానాలను భర్తీ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఈ మేరకు సీనియర్ నేతలతో జగన్ చర్చించినట్లు చెబుతున్నారు. అయితే ఈ రెండు మంత్రి పదవులతో పాటు మరో కీలక పదవిని కూడా జగన్ భర్తీ చేయాల్సి ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఆ పదవి కూడా ఖాళీ కానుండటంతో ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది.

ధర్మానకే ఎక్కువ అవకాశాలు…..

ఈ నేపథ్యంలో బీసీ మంత్రులను ఎవరిని ఉపముఖ్యమంత్రిగా జగన్ చేస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. జగన్ మంత్రివర్గంలో శంకర నారాయణ, అనిల్ కుమార్, ధర్మాన కృష్ణ దాస్, జయరాం లు బీసీ మంత్రులుగా ఉన్నారు. వీరిలో ధర్మాన కృష్ణదాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఒకరు డిప్యూటీ సీఎంగా ఉండటంతో ధర్మానకు ఇస్తారా? లేదా? అన్న సందేహం కూడా ఉంది. ప్రాంతాలతో సంబంధం లేకుండా ధర్మాన కృష్ణదాస్ కే జగన్ టిక్ పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు.

Tags:    

Similar News