ఎంత చేసినా ఏం లాభంలే

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మంత్రిగా మూడు సార్లు కీలకమైన ఎన్నో శాఖలను నిర్వహించి నాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, [more]

Update: 2019-08-21 11:00 GMT

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మంత్రిగా మూడు సార్లు కీలకమైన ఎన్నో శాఖలను నిర్వహించి నాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి మన్ననలు అందుకున్నారు. మంచి వక్తగా ధర్మానకు పేరుంది. శాసన‌సభలో ఎటువంటి అంశాన్ని అయినా చక్కగా వివరించడంలో ధర్మాన ప్రసాదరావు సిధ్ధహస్తుడు. ఆయన ప్రతీ ముఖ్యమంత్రికి ఎంతో రక్షణగా ఉంటూ ప్రతిపక్షాన్ని దునుమాడేవారు. ఇక ధర్మానకు 2014 తరువాత అధికార వియోగం సంప్రాప్తించింది. ఆయన చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరడం వల్ల గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అయితే అయిదేళ్ళలోనే పుంజుకుని తన సత్తా చాటారు. గెలిచిన వెంటనే మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ జగన్ వేసుకున్న అంచనాల్లో ఆయనకు కాకుండా అన్న గారైన క్రిష్ణ దాస్ కి మంత్రి పదవి దక్కింది. ఈ పరిణామంతోనే ధర్మాన ప్రసాదరావు శిబిరం డీలాపడిపోయింది.

ఉనికి కోసమేనా…?

ఇదిలా ఉండగా ధర్మాన ప్రసాదరావు పూర్వంలా అంత ఉత్సాహంగా కనిపించడంలేదని ప్రచారం కూడా సాగుతోంది. ఆయన కుమారుడు మనోహరనాయుడుకు బాధ్యతలు అప్పగించి సైలెంట్ అయ్యారని అంటారు. కొడుకు మాత్రం తండ్రి వారసత్వాన్ని తీసుకుని అధికార పార్టీ డి ఫ్యాక్టో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో హవా చలాయిస్తున్నారు. ఈ మధ్యనే తన పుట్టిన రోజును కూడా ఘనంగా జరుపుకున్న మనోహర్ నాయుడు వైసీపీ యూత్ వింగ్ చూస్తున్నారు. కొడుకును ముందు పెట్టి రాజకీయం చేస్తున్న ధర్మాన ప్రసాదరావు ఎక్కడా తన పట్టు తగ్గకుండా మాత్రం చూసుకుంటున్నారు. బదిలీల విషయంతో పాటు, ఇతర అంశాల్లో కూడా మంత్రి అయినా వేలు పెట్టకుండా కట్టడి చేస్తున్నారు. తన అనుచరుల విషయంలోనూ ధర్మాన ప్రసాదరావు అదే వైఖరి తో ఉంటున్నారు. వారికి ఏ ఇబ్బంది కలగకుండా రాజకీయం చేస్తున్నారు. చేతిలో అధికారం లేకపోయినా టీడీపీని మాత్రం మళ్ళీ ఎదగనీయకుండా చేయడంలో ధర్మాన ప్రసాదరావు గట్టిగానే ఉంటూ పావులు కదుపుతున్నారు. ఇవన్నీ చేయడం ద్వారా రాజకీయాల్లో తన ఉనికి కోసం ధర్మాన ప్రసాదరావు పెద్ద పోరాటమే చేస్తున్నారనుకోవాలి.

క్యాడర్లో ఊపు కోసమట….

ధర్మాన ప్రసాదరావు గెలిచినా మంత్రి కాలేకపోవడంతో క్యాడర్ స్తబ్దుగా ఉంది. దాంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్న ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఇపుడు గెలుపు సంబరాలు పేరుతో తాజాగా కార్యక్రమం నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలిచి మూడు నెలలు అయింది. ఇపుడు గెలుపు సంబరాలేంటి అని అంతా విస్తుబోతున్నా కూడా క్యాడర్ కోసమని చెబుతున్నారు. జోష్ తేవాలనే ఇలా చేస్తున్నామని అంటున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం విశేషం. అలాగే ధర్మాన ప్రసాదరావు పేరు మీద ప్రత్యేక సంచికను కూడా విడుదల చేశారు. ధర్మాన ప్రసాదరావు మళ్ళీ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటున్న వారంతా గెలుపు సంబరాల్లో పాలుపంచుకున్నారు. అన్న మంత్రి అయినా సరే తమ్ముడికే దమ్ముందని, మరో రెండేళ్లకైనా జగన్ ధర్మాన ప్రసాదరావుకు న్యాయం చేస్తారని కూడా క్యాడర్ నమ్ముతోంది. ఈ లోగా తమ నేతకు కీలకమైన నామినేటెడ్ పదవి అయినా ఇస్తారన్న ఆశ ఉందని కూడా అంటున్నారు. ఇలా జగన్ దృష్టిలో పడేందుకా అన్నట్లుగా సంబరాల మీద సంబరాలు ధర్మాన బ్యాచ్ చేస్తోంది. మరి ఎన్ని చేసినా కూడా జగన్ మనసులో చోటు లేకపోతే అందలం దక్కుతుందా అన్నదే అసలైన ప్రశ్న.

Tags:    

Similar News