బాధపడని రోజే లేదటగా

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా కలత చెందారు. అలా ఇలా కాదు, ఆయన మధనపడిపోతూ ఇదేనా రాజకీయం అంటే అనుకుంటున్నారు. విలువలు [more]

Update: 2019-08-25 15:30 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా కలత చెందారు. అలా ఇలా కాదు, ఆయన మధనపడిపోతూ ఇదేనా రాజకీయం అంటే అనుకుంటున్నారు. విలువలు ఉండవా, నైతికత ఉండదా, అందరినీ ఒకే గాటకు కట్టేయడమేనా అని ఈ సీనియర్ నేత ఒకటే కలత చెందుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే ధర్మాన ప్రసాదరావు వద్దకు ఈమధ్య కొంతమంది వచ్చి లంచం ఇవ్వచూపారట. తమ పిల్లలకు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తే చాలు, ఏమైనా ఇస్తామని ప్రతిపాదించారట. దాంతో పెద్దాయనకు ధర్మాగ్రహమే కలిగింది. నాలుగు దశాబ్దాలుగా విలువలతో పండించుకున్న రాజకీయ జీవితంలో ఇంకా ఇలాగే తనను కూడా చూస్తున్నారంటే ఇది అవమానమని పెద్దాయన తెగ బాధపడిపోతున్నారు. ఈ విషయాలపై తాజాగా జరిగిన పార్టీ మీటింగులోనే ఆయన తన ఆవేదనను వ్యక్తం చేయడం విశేషం.

అవినీతి ముద్ర….

ధర్మాన ప్రసాదరావు తనకు తానుగా చెప్పుకున్నట్లుగా కొంత విలువలతోనే రాజకీయం చేశారు. అయితే ఆయనపైన కాంగ్రెస్ మంత్రిగా ఉన్నపుడు కన్నెధార కొండల తవ్వకాల వ్యవహారంలో మచ్చ పడింది. ఆ కొండలను తవ్వేసి అక్రమ మైనింగ్ కి వూతమిచ్చారన్న విమర్శలూ వచ్చాయి. దాని మీద వామ‌పక్షాలు, టీడీపీ సైతం ధర్మాన ప్రసాదరావు విధానాలపై పోరాటం చేశాయి కూడా. ఇక ఆయన మీద మరేమీ పెద్దగా ఆరోపణలు లేవు కానీ ఆయన కుమారుడు మనోహర్ నాయుడు దూకుడు వల్ల కూడా విమర్శల పాలు అయ్యారు. అయితే జగన్ ఆయనను మంత్రిగా తీసుకోకపోవడం వల్ల ధర్మాన ప్రసాదరావు బాగా కలత చెందిన మాట వాస్తవం. దాంతో తరచూ ఆయన తన ఆవేదనను సన్నిహితులతో పంచుకుంటున్నారు. తానేం తప్పు చేశానని యువ నేత దూరం పెట్టారని ధర్మాన బాధపడని రోజు అంటూ లేదంటారు. ఇక తాజాగా గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ విషయంలో తనకే లంచం ఇవ్వజూపారని ధర్మాన ప్రసాదరావు అనడం, వ్యవస్థల‌పై విమర్శలు చేయడం పెద్దగా చర్చనీయాంశమయ్యాయి. నలభయ్యేళ్ళ తన రాజకీయ జీవితాన్ని, విలువలను ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారని ధర్మాన ప్రశ్నించిన విధానం చూస్తూంటే ఆయన ఏకంగా వైసీపీ హై కమాండ్ కే తన ప్రశ్నలను సంధించారా అనిపించకమానదు. జగన్ తనను పక్కన పెట్టడం వెనక అవినీతి ముద్ర లేదని చెప్పుకోవ‌డానికి ధర్మాన ప్రసాదరావు తాపత్రయ పడుతున్నట్లుగా కూడా అనిపిస్తోంది.

తట్టుకోలేకనేనా…?

ఇక ధర్మాన ప్రసాదరావు సొంత అన్న గారు మంత్రి అయ్యారు. ధర్మాన క్రిష్ణదాస్ నిజంగా సౌమ్యుడు. ఆయన మీద ఎటువంటి అవినీతి మరక లేదు, నిజాయతితో పాటు, నమ్మిన వారి వెంట ఉండడం ఆయన లక్షణం. దాన్ని గుర్తించే జగన్ ఆయన్ని మంత్రిగా తీసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత అయినా విలువలు, నిజాయతి వంటి వాటి విషయంలో క్రిష్ణదాస్ తమ్ముడికి అన్నగారేనని అంతా అంటారు. అందువల్లనే జగన్ సరైన ఎంపిక చేశారని కూడా చెబుతారు. మరి దీన్ని అవమానంగా భావించి ధర్మాన ప్రసాదరావు తరచూ పరోక్షంగా విమర్శలు చేస్తూ వీధిన పడడం ఎంతవరకూ సబబు అన్న మాట కూడా ఉంది. ఇక ధర్మాన తాను గెలవడం కోసం ఎంపీగా నిలబడిన వారి ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కన్నెధార భూముల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఇలా ఉంటే ఆయన తాను విలువలు… రాజకీయం అంటూ ఇండైరెక్ట్ గా తన సీనియారిటీని గుర్తు చేస్తూ హైకమాండ్ ని ఆకర్షించేలా మాట్లాడడంలో ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలి అంటున్నారు. జిల్లా రాజకీయ పరిశీలకులు.

Tags:    

Similar News