వైసీపీలో ఏదో జరుగుతుంది.. వాస్తవమేనా?
వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అక్కడ అధినాయకుడే సర్వం సహా అన్నట్లుగా ఉంటుంది. జాతీయ పార్టీల మాదిరిగా నాలుగైదు కిటికీలు ఉండవు. దాంతో ఉక్క బోత యమ [more]
వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అక్కడ అధినాయకుడే సర్వం సహా అన్నట్లుగా ఉంటుంది. జాతీయ పార్టీల మాదిరిగా నాలుగైదు కిటికీలు ఉండవు. దాంతో ఉక్క బోత యమ [more]
వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అక్కడ అధినాయకుడే సర్వం సహా అన్నట్లుగా ఉంటుంది. జాతీయ పార్టీల మాదిరిగా నాలుగైదు కిటికీలు ఉండవు. దాంతో ఉక్క బోత యమ రేంజిలో ఉంటుంది. తరచూ అధినాయకుడితో టచ్ లో ఉన్నా కూడా అక్కడ ఉన్న రిజర్వేషన్లు వేరేగా ఉంటాయి. అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. చంద్రబాబు లాంటి ఘనాపాటి కూడా టీడీపీలో అసమ్మతిని ఊహించలేక 2019లో బొక్క బోర్లా పడ్డారు. ఆయనతో పోల్చుకుంటే స్వాభావికంగా, రాజకీయంగా కూడా చాలా తేడా ఉన్న జగన్ వైసీపీని నిభాయించడం అంటే కొంత కష్టమైన విషయమే. పైగా భారమైన మెజారిటీతో పాటు, పార్టీలో అందరూ ఆశావహులే ఉన్న చోట వారి ఆకాంక్షలకు వాస్తవాలకు మధ్య పెద్ద అంతరమే కనిపిస్తున్న వేళ అసంత్రుప్తి ఉండడం సహజమే.
అంత రేంజిలోనా..?
ఇదిలా ఉండగా విశాఖ ఆక్టోపస్ గా స్వయంగా ప్రకటించుకున మాజీ ఎంపీ సబ్బం హరి లాంటి వారు ఈ మధ్య రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తి మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన గారి అభిప్రాయంలో అయితే వైసీపీలో ముసలం మొదలైపోయిందట. నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు రూపేణా అలా ఒకటి బయటపడిందని, ఇంకా ఆ రకమైన నిరసన గళాలు వైసీపీలో కనీసంగా ముప్పయికి తక్కువ కాకుండా ఉంటాయని లెక్క వేస్తున్నారు. అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు బోలేడు మంది వైసీపీలో అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారని బాంబు లాంటి వార్తనే సబ్బం చెబుతున్నారు.
గంట కట్టేదెవరో …?
ఇక్కడితో సబ్బం హరి ఊరుకోవడంలేదు. వారంతా పిల్లి మెడలో ఎవరు గంట కడతారోనని ఎదురుచూస్తున్నారుట. అంటే ఎవరైనా ముందుకు వచ్చి గట్టి భరోస ఇస్తే ఫ్యాన్ నీడ నుంచి వారంతా జంప్ చేతారని సబ్బం హరి జోస్యం చెప్పారన్నమాట. సరే సబ్బం హరి జోస్యాలు ఎపుడూ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన జగన్ ని గట్టిగా ద్వేషిస్తారు. పైగా టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నాయకుడు. సబ్బం మాటలను కాసేపు పక్కన పెట్టినా వైసీపీలో ఏదో జరుగుతోందన్న డౌట్ మాత్రం అందరిలోనూ గట్టిగానే కొడుతోంది. పైకి అంతా బాగుందనిపిస్తున్నా ఇంతటి ఘన విజయం తరువాత కూడా వైసీపీ శ్రేణుల్లో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కానీ ఎక్కడా గతంలొలా ఉత్సాహం లేదు, హుషారు కూడా లేదు.
ఏమో ఏదైనా…?
రాజకీయాల్లో నైతిక విలువలు పతనం అయి అర్ధ శతాబ్దం దాటుతోంది. అయారాం, గయారం కల్చరు కి అంతటి చరిత్ర ఉంది. అందువల్ల ధీమా ఎపుడూ రాజకీయల్లో పనికిరాదు. ఎన్టీయార్ లాంటి లెజెండరీ పర్సనాలిటీనే పక్కన పెట్టేసిన రాజకీయాలను తెలుగు జనమంతా చూశారు. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం కూడా ఎందుకైనా మంచిది ఒకటికి పదిమార్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీలోని హితులే సూచిస్తున్నారుట. జగన్ మాత్రం జనాన్ని నమ్ముకుంటున్నారు. ఆయన చూపు 2024 మీదనే ఉంది. కానీ మరో నాలుగేళ్ళు పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి లుకలుకలూ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ నాలుగేళ్ళు సాఫీగా గడిస్తే కదా ఎన్నికలను ఎదుర్కొనేది. మరి కేంద్రం జోక్యం అని తరచూ సబ్బం లాంటి వారు, టీడీపీ నేతలు అంటున్న మాటలతోనైనా వైసీపీ అగ్ర నాయకత్వం అప్రమత్తం కాకపోతే తరువాత వగచి వాపోయినా చేసేది ఏమీ లేకపోవచ్చు.