ట్రంప్ కు టఫ్ టైమ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది నవంబరు లో జరగనున్న అమెరికా అధ్యక్ష్య ఎన్నికలపై దృష్టి సారించాల్సిన తరుణంలో ఎదురవుతున్న సరికొత్త [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది నవంబరు లో జరగనున్న అమెరికా అధ్యక్ష్య ఎన్నికలపై దృష్టి సారించాల్సిన తరుణంలో ఎదురవుతున్న సరికొత్త [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది నవంబరు లో జరగనున్న అమెరికా అధ్యక్ష్య ఎన్నికలపై దృష్టి సారించాల్సిన తరుణంలో ఎదురవుతున్న సరికొత్త సమస్యలు ఆయనకు చికాకులు సృష్టిస్తున్నాయి. తన సమయాన్ని అంతా ఎన్నికలకు బదులు వీటిని ఎదుర్కొనేందుకే వెచ్చించాల్సి వస్తోంది. ట్రంప్ కు ఎదురవుతున్న సమస్యల్లో ప్రధానమైనది అభిశంసన. లూసియానా గవర్నర్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓటమి అధ్యక్షుడు ట్రంప్ కు పెద్ద ఎదురుదెబ్బ. వలసదారుల హెల్త్ కేర్ నిబంధనలపైనా న్యాయస్థానం జారీ చేసిన నిలుపుదల ఉత్తర్వులు ఆయనను నిరుత్సాహానికి గురి చేశాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న చిక్కులు, చికాకులు సృష్టిస్తున్నాయి.
ఇబ్బంది కరమైనా….
అన్నింటికన్నా అభిశంసన అతి పెద్దది. ఇబ్బందికరమైనది. ఇందుకు విపక్ష డెమొక్రట్లు వేగంగా పావులు కదుపుతున్నారు. దీనిపై విచారణ ప్రారంభమైంది. ట్రంప్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించనున్నారు. అసలు సమస్యకు మూలకారణం డెమొక్రటిక్ పార్టీ నేత జో బిడెన్. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తరుణంలో ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఉక్రెయిన్ సహజవాయువు సంస్థలో కీలక పదవిలో నియమితులయ్యారు. ఉక్రెయిన్… ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగం. సోవియట్ యూనియన్ విడిపోయాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. దీని రాజధాని నగరం పేరు కీవ్. ప్రస్తుతం జో బిడెన్ డెమొక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో హంటర్ నియామకంపై దర్యాప్తు చేయించాలని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెవిన్ స్కీపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది అభియోగం. ఒకవేళ దర్యాప్తు చేయించకపోతే ఆ దేశానికి 40 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని నిలిపివేస్తానని బెదిరించడం ద్వారా ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశద్రోహం, ముడుపుల స్వీకరణ, ఇతర తీవ్ర నేరాలకు అధ్యక్షుడు పాల్పడినప్పుడు అధ్యక్షుడిని ప్రతినిధుల సభ అభిశంసించవచ్చు. అయితే వీటిని తీవ్ర నేరాలుగా పరిగణించాలన్న విషయమై రాజ్యాంగంలో స్పష్టత లేదు. అయితే ట్రంప్ అధికార దుర్వినియోగం తీవ్ర నేరంగా పరిగణించవచ్చని డెమొక్రాట్లు గట్టిగా వాదిస్తున్నారు.
ఆమోదం పొందడం కష్టమే….
ప్రతినిధుల సభ తీర్మానం అనంతరం దానిని సెనేట్ కు పంపిస్తారు. అక్కడ ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే మెజారిటీ. అందువల్ల తీర్మానం ఆమోదం పొందడం ఖాయం. అయితే సెనేట్ లో రిపబ్లికన్లదే ఆధిక్యం. అందువల్ల అక్కడ తీర్మానం ఆమోదం పొందడం కష్టం. సెనేట్ ఆమోదం లేనిదే అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. 1868లో ఆండ్రూ జాన్సన్, 1998లో ప్రతినిధుల సభ బిల్ క్లింటన్ ను అభిశంసించినప్పటికీ, సనేట్ లో ఆమోదం లేకపోవడంతో వారు గండం నుంచి గట్టెక్కారు. ఇప్పటివరకూ ఏ అధ్యక్షఉడు అభిశంసన కారణంగా పదవిని కోల్పోలేదు. ఇప్పుడు ట్రంప్ కు కూడా అటువంటి ప్రమాదం లేనట్లే. 1974లో రిచర్డ్స్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరుగుతుండగానే రాజీనామా చేశారు. అభిశంసన ప్రక్రియ, దానికి అంతర్జాతీయంగా లభించే ప్రచారం వల్ల ట్రంప్ ప్రతిష్టకు దెబ్బతగులుతుంది. సమయాన్నంతా అభిశంసనను ఎదుర్కొనేందుకే వెచ్చించాల్సి వస్తుంది. అయితే డెమొక్రాట్లు మాత్రం అభిశంసనపై గట్టి పట్టుదలతో ఉన్నారు. ట్రంప్ నకు వ్యతిరేకంగా కొందరు అధికారుల నుంచి రెండు నెలల పాటు రహస్యంగా శ్రమించి సాక్ష్యాలు సేకరించారు. అయితే మేనేజ్ మెంట్, బడ్జెట్ కార్యాలయాలకుచెందిన అధికారులు మాత్రం సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ నకు ఇబ్బందులు లేనట్లే.
ప్రతికూల పరిస్థితులు….
ిఇతర విషయాల్లోనూ ట్రంప్ నకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వలసదారుల హెల్త్ కేర్ నిబంధనలపై ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని బరెగాన్ లోని జిల్లా జడ్జి మైఖేల్ సైమన్ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీయుడు అమెరికాకు వచ్చిన 30 రోజుల్లో తనకు ఆరోగ్య బీమా ఉందని నిరూపించుకోవాలి. లేని పక్షంలో కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ఏడుగురు పౌరులు కోర్టును ఆశ్రయించారు. కీలకమైన లూసియానా గవర్నర్ ఎన్నికల్లోనూ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. డెమొక్రటిక్ అభ్యర్థి జాన్ బెల్ ఎడ్వర్డ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి ఇడీ రిస్వోన్ ను ఆయన 51 శాతం ఓట్లతో ఓడించారు. ఈ ఓటమి ట్రంప్ వ్యక్తిగత ఓటమిగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇంతకు ముందు కెంటకీ, వర్జీనియా గవర్నర్ల ఎన్నికల్లోనూ ట్రంప్ నకు చేదు అనుభవం ఎదురైంది. వచ్చే ఏడాది నవంబరు మొదటి వారంలో జరగనున్న అధ్యక్ష్య ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ ట్రంప్ నకు ప్రతికూల సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో తోసిపుచ్చడం కష్టమే.
-ఎడిటోరియల్ డెస్క్