గండం గట్టెక్కినా?

ఇటీవల అభిశంసన గండం నుంచి గట్టెక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదృష్టవంతుడనే చెప్పాలి. రమారమి రెండున్నర శతాబ్దాల అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ముగ్గురు అధ్యక్షులు [more]

Update: 2020-02-19 17:30 GMT

ఇటీవల అభిశంసన గండం నుంచి గట్టెక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదృష్టవంతుడనే చెప్పాలి. రమారమి రెండున్నర శతాబ్దాల అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ముగ్గురు అధ్యక్షులు మాత్రమే అభిశంసన ఎదుర్కొన్నారు. వారిలో ఏ ఒక్కరికీ మళ్లీ అధ్యక్ష్య పదవికి పోట ీచేసే అవకాశం రాలేదు. అభిశంసనలతో వారి రాజకీయ జీవితాలు అర్థాంతరంగా ముగిశాయి. కానీ అందుకు భిన్నంగా అలాంటి అరుదైన అవకాశం ట్రంప్ కు లభించింది. అభిశంసనను విజయవంతంగా ఎదుర్కొనడంతో పాటు, రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కూడా ట్రంప్ నకు దక్కడం విశేషం. కానీ విపక్ష డెమొక్రటిక్ పార్టీలో ఇంకా అభ్యర్థిత్వమే ఖరారు కాకపోవడం గమనార్హం. అభిశంసన నుంచి గట్టెక్కడం, పార్టీ ఏకతాటిపై నిలబడటం, మళ్లీ పోటీ చేసే అవకాశం లభించడం కచ్చితంగా ట్రంప్ కు సానుకూల అంశాలే. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆయనకు మంచి అవకాశం లభించింది.

అధ్యక్ష ఎన్నికలు…..

నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనున్నాయి. మొదటి వారంలో ఎన్నికలు జరిగినప్పటికీ వచ్చే ఏడాది జనవరి 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారుర. అమెరికా ఎన్నికలలో గెలవడం ఎంత కష్టమో? దానికంటే ముందు పార్టీ అభ్యర్థిత్వం లభించడం అంతకన్నా కష్టం. అంతర్గతంగా అభ్యర్థిత్వం కోసం పార్టీలో గట్టి పోటీ ఉంటుంది. ఈ పోటీని అధిగమించడం అంత తేలికైన విషయం కాదు.

హుందాతనంగా లేదు…..

2017లో అధ్యక్ష్య పదవిని చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఎంతమాత్రం హుందాతనంగా లేదు. ఫక్తు వ్యాపారి అయిన ఆయన ఎప్పుడూ విలువలకు కట్టబడిన నాయకుడు కాదు. మహిళల పట్ల చులకన భావంతో వ్యవహరించేవారు. ఆఖరుకు సొంత పార్టీలోని మహిళ ప్రతినిధుల పట్ల కూడా అదే ధోరణితో ఉండేవారు. అరిజోనా ప్రతినిధి డెబీ లెస్కో , న్యూయార్క్ ప్రతినిధి ఎలైస్ స్టెఫానిక్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 2016 అధ్యక్ష్య ఎన్నికలకు ముందు మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి ఆయన పాత్రను వాషింగ్టన్ పోస్ట్ వెలుగులోకి తీసుకు వచ్చినప్పుడు అనుచితంగా స్పందించారు. ఇది తన జీవితంలో చెడ్డ రోజు అని, తన అధ్యక్ష అవకాశాలను ఇది దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. అంతేతప్ప కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. గతంలో అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షులు నిస్సహాయ స్థితిలో పడ్డారు. ఆచితూచి మాట్లాడే వారు. ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉండటం విశేషం.

వియత్నాం యుద్ధం తర్వాత…..

అభిశంసన సందర్భంగా అమెరికా సమాజం రెండు వర్గాలుగా, పార్టీల వారీగా చీలిపోయింది. వియత్నాం యుద్ధం తర్వాత ఇలా జరగడం ఇదే ప్రధమం. అప్పట్లో వియత్నాంలో అమెరికా జోక్యంపై వ్యతిరేకత వ్యక్తమయింది. యుద్ధాన్ని సమర్థించిన వారిలో జాత్యహంకారులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాక ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పుడు ట్రంప్ కూడా ప్రజల్లో అలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ట్రంప్ అనుసరించిన విధానాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది.

వ్యతిరేకత వస్తున్నా…..

మెక్సికో నుంచి వలసలను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో రక్షణ గోడ నిర్మించాలన్న విషయమై ఏకాభిప్రాయం కొరవడింది. మెక్సికో సరిహద్దుల్లోనే టెక్సాస్ రాష్ట్రం ఉంటుంది. మేధో వలసలను అడ్డు కోవడం ద్వారా అమెరికా సమాజం కొంత నష్టపోతుంది. స్థానికులు ఉద్యోగ అవకాశాలను విదేశీయులు కొల్లగొడుతున్నారన్న ఉద్దేశ్యంతో ట్రంప్ ఈ నిబంధనను తీసుకొచ్చారు. తాత్కాలికంగా బాగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో దీనివల్ల నష్టం తప్పదన్నది మేధావుల అభిప్రాయం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న బ్రిటన్ ఇప్పుడు మేధావులకు, వృత్తి నిపుణులకు ఆహ్వానం పలుకుతోంది. అంతర్జాతీయంగా సిరియా, ఇరాన్, ఆప్ఫనిస్తాన్, ఇరాక్ విషయాల్లో సమర్థంగా వ్యవహరించ లేకపోయారన్న అభిప్రాయం ఉంది. ఇరాక్, ఆప్ఫనిస్తాన్ లలో ఇప్పటికీ అమెరికా సైనికులు బలవుతూనే ఉన్నారు. అయినప్పటికీ అక్కడి పరిస్థితులు ఒక కొలిక్కి రాలేదు. ఇటీవల ఇరాన్ విషయంలోనూ ట్రంప్ తొందరపడ్డారన్న వాదన లేకపోలేదు. తమకు ధీటుగా ఎదుగుతున్న చైనాను నిలువరించడంలో వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. మున్ముందు బీజింగ్ అగ్రరాజ్యానికి గట్టి సవాల్ విసరనుంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష్య ఎన్నికలను ట్రంప్ ఎదుర్కొనడం అంత సులువు కాదు. తేలికా కాదు. అయితే విపక్ష డెమొక్రట్ల బలహీనతలు, నాయకత్వ లేమి డొనాల్డ్ ట్రంప్ నకు కలసి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News