‘ఈనాడు’కు చివరి గీత

తెలుగులో అత్యంత ఆదరణ కలిగిన ఈనాడు పత్రికాధిపతి, వ్యవస్థాపకుడు రామోజీరావు మీడియా నిర్వహణలో తన పాత్రను క్రమేపీ కుదించుకుంటున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎడిటర్ అనే [more]

Update: 2021-08-31 03:30 GMT

తెలుగులో అత్యంత ఆదరణ కలిగిన ఈనాడు పత్రికాధిపతి, వ్యవస్థాపకుడు రామోజీరావు మీడియా నిర్వహణలో తన పాత్రను క్రమేపీ కుదించుకుంటున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎడిటర్ అనే పదాన్ని వేరే వాళ్లకు ఇవ్వడానికి ఇష్టపడని రామోజీ ఆంద్రా, తెలంగాణ ఎడిషన్లకు అధికారిక హోదాలో ఇద్దరు ఎడిటర్లను నియమించారు. మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్న కుమారుడు కిరణ్ కు నిర్ణయాత్మక, నియామక, సంపాదకీయ స్వేచ్చను కల్పించారు. దీంతో తన పాత్ర నామమాత్రంగానే ఉండబోతోందనే చెప్పాలి. ఈ విషయాన్ని బలపరిచే తాజా పరిణామం కార్టూనిస్టు శ్రీధర్ నిష్క్రమణ. నిశ్శబ్దంగా శ్రీధర్ వెళ్లిపోవడం వెనక రామోజీ నిస్సహాయత కూడా దాగి ఉందనే చెప్పాలి. ఈనాడుకు తన చివరి గీత రాసి గుడ్ బై చెప్పిన ఈ వ్యంగ్య చిత్రకారునికి, రామోజీకి, సంస్థకు మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. శ్రీధర్ వ్యక్తిగత, వృత్తి జీవితానికి తెర తీస్తే ఈనాడు గతము, వర్తమానము, భవిష్యత్ ప్రస్థానమూ తేటతెల్లమవుతుంది.

శ్రీధర్… చిరునామా..

ఈనాడు పేరు చెబితే రామోజీరావుతో పాటు సామాన్యపాఠకుడికి గుర్తుకు వచ్చే ఏకైక పేరు కార్టూనిస్టు శ్రీధర్. రాజకీయ నాయకులకు చెమటలు పట్టించే వ్యంగ్య చిత్రకారుడు. ఆలోచన, సృజనాత్మకత, వ్యంగ్యం, హాస్యం కలగలిసిన మేధావి. గడచిన నాలుగు దశాబ్దాల రాజకీయ పరిణామాలకు అద్దంపట్టింది అతని గీత . ఈనాడును శ్రీధర్ ను విడదీసి చూడలేం. తెలుగు మీడియాలో అత్యధిక ఆదరణ కలిగిన సంస్థ నుంచి అత్యంత సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించిన ఆయన నిష్క్రమిస్తున్నారంటే నిజంగానే అదొక సంచలనం. ఎందరెందరో ఈనాడులో పొడిగింపులు పొందుతుంటే శ్రీధర్ మాత్రం నిశ్శబ్దంగా అడుగులు బయటకు వేశారంటే ఏదో దాగి ఉందనే చర్చ మీడియాలో నడుస్తోంది. ఒక వ్యక్తిగా తన పదవి నుంచి తప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ తెలుగు రాజకీయ, మీడియా రంగాల్లో అతనొక వ్యవస్థగా గుర్తింపు పొందారు. 1980ల నుంచి నేటి వరకూ అనేకానేక సంఘటనలకు, పరిణామాలకు బాష్యం చెప్పాయి అతని వ్యంగ్య చిత్రాలు.

రామోజీ రాజకీయ ఆయుధం…

తెలుగుదేశం పార్టీతో ఈనాడుకు ఉన్న అనుబంధం జగమెరిగినదే. ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడుల హయాంలో కొన్ని సార్లు తీవ్రంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు రామోజీని సున్నితత్వం వెన్నాడుతుండేది. అటువంటి సమయాల్లో శ్రీధర్ ఆ పాత్రను పోషించేవారు. కార్టూన్ రూపంలో తప్పును తప్పుగా ఎత్తి చూపేవాడు. దానిని రామోజీరావు ప్రోత్సహించేవారు. నిజానికి ఒక వ్యాసం, వార్త రాసినదానికంటే పదునైన రీతిలో నాయకుల తప్పులను ఎత్తి చూపేందుకు ఈ కార్టూన్లు ఆయుధంగా ఉపయోగపడుతుండేవి. రామోజీ వార్తల్లో చెప్పడానికి సంశయించిన వాటిని కార్టూన్ల ద్వారా మరింత తీవ్రంగా ప్రకటించేవారు. తద్వారా నాయకులకు కనువిప్పు కలిగించేందుకు రామోజీ కి మంచి ఆయుధంగా శ్రీధర్ ఉపయోగపడుతుండేవారు. ఆ రకంగా సామాన్యుల అభిమానాన్ని ఈనాడు పత్రిక పొందడానికి వీలయ్యేది. ఈనాడు టీడీపీ పక్షపాతంతో ఉంటుందన్న విమర్శకు కొంతమేరకు జవాబుగా శ్రీధర్ కార్టూన్లు తోడ్పడుతుండేవి. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం కార్టూన్ల ద్వారా ఎత్తిచూపడం వల్ల ఏమీ అనలేని నిస్పృహతో ఉండేవారు. ఈరకంగా రామోజీ అటు పాఠకుల పట్ల బాధ్యత, ఇటు టీడీపీ నేతలపై విమర్శ చేయిస్తూ ఉభయత్రా ప్రయోజనం పొందేవారు.

తీరిన అనుబంధం…

మీడియా మొఘల్ రామోజీరావు పని చేయించుకోవడం తెలిసిన వ్యాపారవేత్త. నిజానికి శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం అందుకోగలిగారు. హిందూ, టైమ్స్, డెక్కన్ క్రానికల్ వంటి అనేక సంస్థలు ఆయన గీతకు, ఆలోచనకు ముచ్చటపడి లక్షల రూపాయల్లో వేతనాలు ఆఫర్ చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ రామోజీ ఆత్మీయతతో శ్రీధర్ ను కట్టిపడేశాడు. యూఆర్ లైక్ మై సన్ అంటూ కొన్ని వందల సందర్భాల్లో తన కుమారులతో సమానమైనవాడు అంటూ ప్రశంసలు కురిపించేవారు. సాధారణంగా ఈనాడు ఉద్యోగులందర్నీ కుటుంబం అంటూ ఒక చట్రంలో బిగించడం సంస్థకు అలవాటు. దీనిని ఒక అనుబంధ లక్షణంగా రామోజీ తీర్చిదిద్దారు. శ్రీధర్ వంటి ప్రతిభావంతుల విషయంలో మరో అడుగు ముందుకు వేసి, బయటకు వెళ్లకుండా కొడుకుతో సమానమైన ఆత్మీయత కనబరిచేవారు. అటువంటి శ్రీధర్ ఈనాడు నుంచి నిష్క్రమిస్తారని ఎవరూ ఊహించరు. కానీ ఛైర్మన్ గా రామోజీ తన పాత్రను నిర్వహణ బాధ్యత నుంచి తగ్గించుకోవడం వల్లనే ఈ పరిణామం చోటు చేసుకుందనేది ఈనాడు వర్గాల సమాచారం.

ఈనాడు కొత్త నడక…

పెద్ద సంస్థగా గుర్తింపు ఉన్న ఈనాడు ఆర్థిక భారం పడకుండా పనిచేయించుకునే నూతన విదానానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తోంది. జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల వేతన సంఘాల సిఫార్సుల మేరకు జీతాలు పెంచాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఈనాడు డిజిటల్ పేరిట వేతన సంఘాల సిఫార్సుల పరిధిలోకి రాని నూతన నియాకమ ప్రక్రియను ఎప్పుడో మొదలు పెట్టింది. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడింది. వారికి లక్షల్లో జీతాలు చెల్లించాల్సి వస్తోంది. అందుకే వారికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేసే ప్రక్రియనూ పట్టాలపైకి ఎక్కించనున్నట్లు సమాచారం. అందుకే ఇటీవలి కాలంలో పాత ఇంక్రిమెంట్లు, బకాయిల వంటివి చెల్లించి పథకం అమలుకు అవసరమైన సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ వంటి ప్రతిభావంతుల సేవలనూ ఈ కోవలోనే ముగించేస్తోంది. అనేకమంది కి గతంలో వయసు మీరిన తర్వాత ఉద్యోగ పొడిగింపులు చేసిన అనేక సందర్భాలున్నాయి. అందులోనూ రామోజీరావుకు నచ్చిన తీరులో పనిచేసేవారికి శాశ్వత ఉద్యోగం అన్నట్లుగా సంస్థ నడిచింది. ఇక ఆ శకానికి కాలం చెల్లింది. దైనందిన సంస్థ నిర్వహణలో రామోజీ తన బాధ్యత లేకుండా చేసుకుని వారసులకే అప్పగించేయడంతోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా ఒక కార్టూనిస్టుగా మహా మహా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించి సామాన్యుడి ఆవేదనకు అద్దం పడుతూ, హాస్య, వ్యంగ్య ఆగ్రహాన్ని ప్రతిబింబించిన శ్రీధర్ నిష్క్రమణ వ్యాపారాత్మక ఈనాడు కంటే పాఠకులకు తీరని లోటు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News