ఏపీ బీజేపీలో టిక్కెట్ కోసం పోటీయా.. నిజ‌మే

విశాఖ సిటీలో ఏ అసెంబ్లీ సీటు చూసుకున్నా హాట్ ఫేవరేట్ గానే ఉంటుంది. తిప్పి తిప్పి చూస్తే పరిధి అంతా సిటీలోనే ఉంటుంది. పెద్దగా శ్రమ పడి [more]

;

Update: 2021-09-12 00:30 GMT

విశాఖ సిటీలో ఏ అసెంబ్లీ సీటు చూసుకున్నా హాట్ ఫేవరేట్ గానే ఉంటుంది. తిప్పి తిప్పి చూస్తే పరిధి అంతా సిటీలోనే ఉంటుంది. పెద్దగా శ్రమ పడి తిరగాల్సింది లేదు. ఇక కార్పోరేషన్ పరిధిలో అసెంబ్లీ సీటు ఉంటుంది కాబట్టి అభివృద్ధి విషయంలో పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. దర్జాకు దర్జా హోదాకు హోదా అన్నీ దక్కుతాయి.అందుకే విశాఖ సిటీ సీట్ల మీద అన్ని పార్టీల పెద్దల కళ్ళూ ఉంటాయి. ఇదిలా ఉంటే బీజేపీలో ఆ ఇద్దరు కీలక నేతల చూపు ఒకే సీటు మీద ఉందన్న వార్తలు ఇప్పుడు విశాఖ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నాయి. మామూలుగానే ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు త‌ల‌పండిన నేత‌లు కూడా సీటు అడిగే ప‌రిస్థితి లేదు. కానీ విశాఖ‌లో ఒకే సీటుకు బీజేపీ నుంచి ఇద్ద‌రు నేత‌లు పోటీ అంటే ఆశ్చర్యమే మ‌రి.

ఇద్దరు నేతల మధ్య…?

ఆ సీటే విశాఖ నార్త్. దీని కోసం 2014 నుంచి బీజేపీలో ఇద్దరు నేతల మధ్య అంతర్గత యుద్ధమే జరుగుతోంది. ఈసారి కూడా అలాంటి ఫైట్ జరగడం ఖాయమని అంటున్నారు. విశాఖ సీటుని 2014 ఎన్నికల్లో అనూహ్యంగా విష్ణు కుమార్ రాజు దక్కించుకున్నారు. ఆ సీటు మీద మక్కువతో అనేక కార్యక్రమాలు చేపట్టి పోటీకి రెడీ అని చెప్పినా కూడా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ ని చివరి నిముషంలో తప్పించారు. దానికి బీజేపీలో తెర వెనక పెద్ద లాబీయింగే నడిచింది. అప్పట్లో బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సిఫార్సుతో విష్ణు కుమార్ రాజు ఆ సీటు కొట్టేశారు అంటారు. ఇక ఆ తరువాత అలిగిన మాధవ్ ని బుజ్జగించారు.

బీసీ కార్డుతో….?

ఇక దానికి పరిహారంగా అన్నట్లుగా 2017లో ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. దాంతో 2019 ఎన్నికల్లో మరోమారు రాజుకు టికెట్ దక్కింది. అయితే టీడీపీతో పొత్తు లేకపోవడంతో ఆయన ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి కూడా తానే విశాఖ నార్త నుంచి పోటీ చేస్తాను అని రాజు అంటున్నారు. అయితే 2023 నాటికి పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీ సభ్యత్వం పూర్తి అవుతుంది. దాంతో ఈసారి ఆయన అసలు ఊరుకోరు అంటున్నారు. కచ్చితంగా ఆయన విశాఖ నార్త్ సీటు కోరుకుంటారు అని చెబుతున్నారు. పైగా ఆయన సామాజిక వర్గం ఓట్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ వున్నాయని, బీసీ నినాదంతో ఆ సీటుని దక్కించుకుంటారు అని ఆయన అనుచరులు చెబుతున్నారు.

జనసేనతో పొత్తుతో…?

ఇక 2024 ఎన్నికలు అంటే బీజేపీకి జనసేనతో పాటు టీడీపీతో కూడా పొత్తు ఉంటుంద‌న్న ప్రచారం ముమ్మరంగా ఉంది. దాంతో విశాఖ నార్త్ లో గెలిచేందుకు అవకాశాలు కొంచం ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. దాంతో ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ ఎన్నికల కంటే ముందే మొదలైపోయింది. మరి విశాఖ బీజేపీకే కీలక నాయకులు అయిన ఈ ఇద్దరినీ బుజ్జగించి ఒకరికి టికెట్ ఇవ్వడం అంటే బీజేపీ పెద్దల వల్ల అవుతుందా అన్నదే చూడాలి.

Tags:    

Similar News