గప్ చుప్… గత్తర

నిజమో, కాదో తెలియని ఎన్నికల కమిషనర్ ఉత్తరం ఇప్పుడు పార్టీలను పట్టి కుదిపేస్తోంది. అధికారిక సంస్థలనుంచి స్పష్టత లేదు. సంఘర్షణ మాత్రం పతాక స్థాయికి చేరింది. రెండు [more]

Update: 2020-03-19 15:30 GMT

నిజమో, కాదో తెలియని ఎన్నికల కమిషనర్ ఉత్తరం ఇప్పుడు పార్టీలను పట్టి కుదిపేస్తోంది. అధికారిక సంస్థలనుంచి స్పష్టత లేదు. సంఘర్షణ మాత్రం పతాక స్థాయికి చేరింది. రెండు రాజ్యాంగ వ్యవస్థలు ముఖాలు చూసుకోలేని పరిస్థితి ఊహించలేం. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది అదే. ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ. ప్రజల సామాజిక స్థితిగతులు, సంక్షేమం, ప్రగతికి పూచీకత్తునివ్వాల్సింది ప్రభుత్వమే. కేవలం స్థానిక ఎన్నికల నిర్వహణతో తన పని ముగించుకుని నిద్రాణమైపోయే వ్యవస్థ రాష్ట్ర ఎన్నికల సంఘం. సాధారణ పరిస్థితుల్లో రెంటినీ పోల్చి చూడలేం. ప్రభుత్వ బాధ్యత ప్రజాజీవితంతో ముడిపడి ఉంటుంది. సర్కారీ ఏర్పాట్ల మేరకు నిర్దిష్ట సమయంలో ఎన్నికల తంతు ను పూర్తి చేయాల్సిన కర్తవ్యం కమిషన్ పై ఉంటుంది. ఈ రెండు పరస్పరం తలపడాల్సిన వ్యవస్థలు కాదు. సహరించుకోవాల్సిన సంస్థలు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులే భిన్నం. ప్రతి విషయంలో రాజకీయాలు రంగప్రవేశం చేస్తాయి. పార్టీలు భుజాన వేసుకుంటాయి. దాంతో రచ్చ సాగుతుంది. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ఇదంతా గడచిన కొంతకాలంగా చూస్తున్న తతంగమే. దీనివల్ల వివాదాలు, సందిగ్ధత, సమస్యలు ముసురుకుంటున్నాయి. ముదురుపాకాన పడుతున్నాయి.

ముందరికాళ్లకు బంధం…

తాజాగా ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ పక్కదారి పడుతోంది. రాజకీయ పార్టీలు దీని నుంచి తమ వంతు ప్రయోజనాలు నొల్లుకునేందుకు పూర్తిగా రంగంలోకి దిగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేంతవరకూ పరిస్థితులన్నీ సాఫీగానే ఉన్నాయి. ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్లపై యాగీ చేసుకున్నాయి. అయితే ఎన్నికల కమిషన్, సర్కారు కలిసికట్టుగానే నడుస్తున్నట్లు కనిపించింది. ప్రతిపక్షాలు వివిధ అంశాలపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషనర్ పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. దాంతో హైకోర్టులోనూ కేసులు పడ్డాయి. ఒక్కసారిగా కమిషనర్ జూలు విదిల్చి తీవ్రమైన చర్యలకు దిగడం, అసలు ఎన్నికలనే వాయిదా వేయడంతోనే ప్రభుత్వానికి సెగ తగిలింది. అధికార పక్షం తమకు పట్టున్న జిల్లాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి ఏకగ్రీవాలకు ఒత్తిడి చేస్తున్న వైనంపై ఎన్నికల కమిషన్ ముందుగా స్పందించి ఉంటే తీవ్రత పెరిగేది కాదు. చేతులు కాలాక అన్నట్లుగా మొత్తం పరిస్థితులు అదుపు తప్పిన తర్వాతనే కమిషన్ అసహాయతను ప్రకటించింది. ఆగ్రహావేశాలతో నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల వాయిదాను సుప్రీం కోర్టు సమర్థించి ఉండవచ్చు. కానీ కనీస ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడమే కమిషన్ పై రాజకీయ ముద్ర పడేందుకు కారణమైంది.

టీడీపీ యాగీ…

తీవ్రంగా దెబ్బతిని ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక రాజకీయాస్త్రం దొరికింది. కమిషన్ కు , ప్రభుత్వానికి మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని ఆ పార్టీ చక్కగా వినియోగించుకుంటోంది. ఎన్నికల కమిషన్ తరఫున వకాల్తా పుచ్చుకుని పోరు సాగిస్తోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కేందుకు అయాచితంగా అందివచ్చిన ఒక అవకాశంగా ఈ వివాదాన్ని తెలుగుదేశం భావిస్తోంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషనర్ లేఖ రాశారన్న ఉదంతం వైరల్ గా మారింది. ఇది నిజమేనని అటు వైసీపీ, ప్రతిపక్షాలు సైతం భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఏకగ్రీవాలు జరిగిన తీరుకు సంబంధించి కమిషనర్ లేవనెత్తినట్టుగా భావిస్తున్న అంశాలు గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదులనే పోలి ఉన్నాయి. అందుకే లేఖ రాజకీయ రంగుని పులుముకుంది. ప్రస్తుతం రాజకీయ గందరగోళానికి దారి తీస్తోంది. నిజంగానే కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అధికారిక హోదాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి నివేదిక కోరుతుంది.రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ నుంచి వచ్చిన ఫిర్యాదుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈవిషయంలో అటు ఎన్నికల కమిషనర్, ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేయడం లేదు. మొత్తమ్మీద రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న వాతావరణం ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే విధంగానే కనిపిస్తోంది.

వైసీపీ బాధ్యత…

అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షాలు ఏదో రకంగా సర్కారును బదనాం చేయాలనే చూస్తాయి. అది సహజం. అందులోనూ ఎన్నికల వంటి సందర్బాల్లో తమ బలహీనతలు బయటపడకుండా ప్రభుత్వ పక్షంపై ఆరోపణలు గుప్పిస్తుంటాయి. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ పక్షానికి ఆధిక్యం రావడం కొత్త కాదు. టీడీపీ నుంచి వివిధ కారణాలతో వైసీపీ కి నేతలు క్యూ కడుతున్నారు. పదవీ లాలసత, చిన్నాచితక పనులు వారిని అధికారపక్షం వైపు మొగ్గేలా చేస్తున్నాయి. మరోవైపు మద్యం, మనీ ప్రవాహాన్ని నియంత్రించేందుకు కఠిన శిక్షలతో కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ సైతం కొంతమేరకు ప్రతిపక్షాలను నిరోధిస్తోంది. దీనివల్ల చాలా జిల్లాల్లో బలమైన పోటీనిచ్చేవాతావరణం కరవైంది. ఇవన్నీ ఒప్పుకుని తీరాల్సిన నిజాలు. సార్వత్రిక ఎన్నికల్లో లభించిన ఆధిక్యం, స్థానికంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల కారణంగా వైసీపీకి ప్రస్తుత ఎన్నికలలో మంచి మెజార్టీ యే వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అందువల్ల అధికారపార్టీ సంయమనం పాటించడం ద్వారానే ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకోవాలి. ఎన్నికల కమిషనర్ వర్సస్ రాష్ట్రప్రభుత్వం మధ్య సాగుతున్నగొడవ ప్రతిపక్షాలకే అడ్వాంటేజ్. ప్రజాజీవితంతో ఎన్నికల కమిషనర్ కు సంబంధం ఉండదు. కానీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజా రాజకీయాలను భవిష్యత్తులోనూ నడపాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల వ్యూహంలో చిక్కుకోకుండా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. లేఖకు సంబంధించి నిజానిజాల నిగ్గు తేల్చే బాధ్యతను యంత్రాంగానికి వదిలేసి ప్రభుత్వ పెద్దలు పాలన, కార్యనిర్వహణపై దృష్టి పెడితే మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News