స్లో‘‘గన్’’ పేలిందా..??
రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల్లో నినాదానికి ఉండే ప్రధాన్యత అంతా ఇంతా కాదు. ఒక నినాదం పార్టీలు, నేతల తలరాతలు మారుస్తుంది. ప్రజలను ఆకట్టుకునేలా, నమ్మకం కలిగించేలా నినాదం [more]
రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల్లో నినాదానికి ఉండే ప్రధాన్యత అంతా ఇంతా కాదు. ఒక నినాదం పార్టీలు, నేతల తలరాతలు మారుస్తుంది. ప్రజలను ఆకట్టుకునేలా, నమ్మకం కలిగించేలా నినాదం [more]
రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల్లో నినాదానికి ఉండే ప్రధాన్యత అంతా ఇంతా కాదు. ఒక నినాదం పార్టీలు, నేతల తలరాతలు మారుస్తుంది. ప్రజలను ఆకట్టుకునేలా, నమ్మకం కలిగించేలా నినాదం ఉంటే ఆ నినాదమే ఎన్నికల్లో పార్టీల గెలుపునకు రాచబాట వేస్తోంది. దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎన్నికల నినాదాలు బాగా ప్రభావం చూపిస్తాయి. పదునైన నినాదం వెయ్యి మాటల కంటే ఎక్కువగా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అందుకే అన్ని పార్టీలూ ఎన్నికల నాటికి ప్రత్యేకంగా కొన్ని నినాదాలు ఇస్తుంటాయి. ఈ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. గత ఎన్నికల సమయంలో ‘ఆబ్కీ బార్ మోడీ సర్కార్’ అని బీజేపీ ఇచ్చిన ప్రచారం ఎంతగా ప్రభావం చూపిందో చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ ఈసారి ఇటువంటి నినాదాలను బీజేపీ ఇస్తోంది. ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్’, ‘నమో అగైన్’, ‘చౌకీదార్’ అంటూ కొత్త నినాదాలు బీజేపీ ఇస్తోంది. కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో ‘ప్రతి చేతికి శక్తి.. ప్రతి చేతికి ప్రగతి’ అనే ఎన్నికల నినాదాన్ని ఇచ్చినా పెద్దగా ఫలించలేదు. ఈసారి మోడీ చౌకీదార్ నినాదాన్ని ఎత్తుకోవడంతో దానికి కౌంటర్ గా ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కొత్త నినాదాన్ని రాహుల్ గాంధీ ఇస్తున్నారు.
‘మీ భవిష్యత్ – నా బాధ్యత’ అంటూ…
ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికల నినాదాలు బాగానే పనిచేస్తాయి. గత ఎన్నికల్లో ‘ఆయన రావాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదాలు హోరెత్తాయి. ‘జాబు కావాలంటే బాబు రావాలి’, ‘బ్రింగ్ బ్యాక్ బాబు’ వంటి అనేక నినాదాలను చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చారు. ఈ నినాదాలు బాగానే పనిచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక, ఈ ఎన్నికల్లో ఆయన ఒకే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అనే నినాదాన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. ఈసారి తనను చూసి ఓట్లేయాలని చంద్రబాబు పదేపదే కోరారు. అందుకే తాను అనుభవజ్ఞుడినైనందున ప్రజల భవిష్యత్ కు తాను బాధ్యుడిగా ఉంటానని, అందుకే తనకు ఓట్లేయాలని కోరుతూ చంద్రబాబు ఈ నినాదం ఇచ్చారు. ఎన్నికలకు ముందు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు లబ్ధిదారులతో ‘థాంక్యూ సీఎం సార్’ అని పెద్ద ఎత్తునే అనిపించారు. అయితే, ఇది ప్రజల్లోకి పెద్దగా వెళ్లినట్లు కనిపించలేదు.
ప్రజల్లోకి వెళ్లిన జగన్ నినాదాలు…
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి వినూత్న నినాదాలు ఇచ్చింది. ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ జగన్ నినాదం సోషల్ మీడియాలో, క్షేత్రస్థాయిలో హోరెత్తింది. ఈ నినాదంతో రూపొందించిన పాట సోషల్ మీడియాలో రికార్డులే సృష్టించింది. జగన్ సోదరి వైఎస్ షర్మిల వినూత్న నినాదం ఇచ్చారు. ‘బై బై బాబు’ అంటూ ఆమె ఇచ్చిన నినాదం ప్రజల్లోకి, ముఖ్యంగా సోషల్ మీడియా బాగా వినిపించింది. జగన్ ఎన్నికల ప్రచారానికి తన తండ్రి జీవితచరిత్ర ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ సినిమాలోని ఓ డైలాగ్ ను వాడుకున్నారు. ‘నేను విన్నాను – నేను ఉన్నాను’ అంటూ జగన్ ప్రచారం చేశారు. ఇక, గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ‘జాబు కావాలంటే బాబు రావాలి’ నినాదానికి ఈ ఎన్నికల్లో జగన్ కౌంటర్ ఇస్తూ ‘జాబు రావాలంటే బాబు పోవాలి’ అనే నినాదం ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికల నినాదాలు, పాటలు, ప్రకటనల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. అయితే ఈసారి మాత్రం నినాదాలు, పాటల్లో ఆ పార్టీ వెనుకబడింది. ప్రకటనలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఇక, జగన్ ప్రకటనలు పెద్దగా ఆకట్టుకోకున్నా ఆయన ఇచ్చినా నినాదాలు, పాటలు మాత్రం విపరీతంగా ప్రజల్లోకి వెళ్లాయి. మరి, ఈ ఎన్నికల్లో ఎవరి స్లోగన్ పేలుతుందో చూడాలి.