విద్యుత్‌ బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి….?

విద్యుత్‌ బిల్లులు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. అసలే ప్రతి పైసా లెక్క పెట్టుకుని ఖర్చుపెట్టే మధ్యతరగతి జనం మీద ఉరుములేని పిడుగులా బిల్లుల భారం పడుతోంది. ఓ పక్క [more]

Update: 2020-06-11 09:30 GMT

విద్యుత్‌ బిల్లులు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. అసలే ప్రతి పైసా లెక్క పెట్టుకుని ఖర్చుపెట్టే మధ్యతరగతి జనం మీద ఉరుములేని పిడుగులా బిల్లుల భారం పడుతోంది. ఓ పక్క ప్రభుత్వం టారిఫ్‌ పెంచలేదని చెబుతోంది. మరోవైపు బిల్లులు మాత్రం భారీగా వస్తున్నాయి. నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. #రూ.3844 బిల్లు వచ్చింది. ఏప్రిల్‌లో రూ.523, మేలో రూ.600 అడ్వాన్స్‌ పేమెంట్‌ చేయగా రూ.3844కు బిల్లు వచ్చింది. ఏప్రిల్‌., మేలలో రీడింగ్‌ తీయలేదు. దీనిపై మూడు రోజుల పాటు విద్యుత్‌ బిల్లుల కేంద్రం వద్ద పరిశీలన జరిపిన తర్వాత కొన్ని లోపాలు బయటపడ్డాయి. బిల్లు వచ్చిన మర్నాడు సంబంధిత ఏఇ కార్యాలయానికి వెళితే అక్కడి సిబ్బంది నుంచి మొదట దురుసు సమాధానం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు, ముగ్గరు అంతా పక్కాగానే ఉందని తేల్చారు. అంత బిల్లు రావడానికి అవకాశం లేదంటే ఈఆర్ఓ కార్యాలయానికి., ఏఈఈ ఆఫీసుకు రెండు సార్లు తిప్పారు. మూడోసారి వెళ్లేసరికి ఏఈఈ వచ్చాడు. ఆయనకు ఫిర్యాదు చేసేలోపే అంతెత్తున లేచాడు. మూడు నెలలు వినియోగం అంత ఉండకుండా ఎలా ఉంటుందని రెచ్చిపోయాడు. అప్పటిదాకా ముఖానికి ఉన్న ముసుగు తీసి నిజరూపంతో నిలబడగానే ఏఈఆ దారికి వచ్చాడు. కసురుకున్న నోటితోనే మర్యాదగా మసలుకోవడం ప్రారంభించాడు. ఇన్నేళ్లుగా విజయవాడ నగరంలో ఒకే సెక్షన్‌లో ఎలా పనిచేస్తున్నాడో నాకు అవగాహన ఉంది కాబట్టి అతని మర్యాదలేవి నన్ను కదిలించలేదు. విద్యుత్‌ బిల్లులపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున జనంలో వ్యతిరేకత రావడానికి ఇలాంటి సిబ్బందే కారణం. నిత్యం వందలమంది ఈఆర్వో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వాన్ని తిట్టడానికి వీరి పనితీరే కారణం.

పదో తేదీ లోపు….

ప్రతి నెల 10వ తేదీ లోపు విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌ తీసి 15రోజుల గడువుతో బిల్లు చెల్లించాల్సిందిగా స్పాట్‌ బిల్లింగ్‌ జారీ అవుతుంటుంది. మార్చి నెల వరకు బిల్లుల పంపిణీ సక్రమంగానే జరిగింది. మార్చిలో జారీ అయిన బిల్లులు 25వ తేదీలోపు వినియోగదారులు చెల్లిచారు. మొదటి విడత లాక్‌డౌన్‌ మొదలయ్యేనాటికి చాలా మంది వినియోగదారులు బిల్లులు చెల్లించారు. మార్చి నెలాఖరుకు చాలా వరకు బిల్లులు కట్టేశారు. ఏప్రిల్‌ నెలలో కోవిడ్‌ భయంతో స్పాట్‌ బిల్లులు ఆపేశారు. మార్చి నెల వినియోగం ఆధారంగా అంతే మొత్తానికి బిల్లు చెల్లించాలని ప్రకటించారు. అయితే పేద., మధ్య తరగతి, వేతన జీవులు., అద్దె ఇళ్లలో ఉండేవారు., నగదు అందుబాటులో లేని వారు బిల్లులు చెల్లించలేకపోయారు. ఆ తర్వాత మే నెలలో విద్యుత్‌ బిల్లుల స్పాట్‌ బిల్లింగ్‌ ప్రారంభించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈఆర్సీ అమోదించిన కొత్త టారిఫ్‌తో బిల్లింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

రెండు నెలల కాలంలో…..

“మార్చి 10వ తేదీ నుంచి మే10వ తేదీ మధ్య కాలానికి స్పాట్‌ బిల్లింగ్‌ లెక్కించారు. విద్యుత్‌ శాఖ అధికారిక నిర్ణయం ప్రకారం మార్చి 11 లేదా మార్చిలో రీడింగ్ తీసిని తేదీ నుంచి మార్చి 31 వరకు పాత టారిఫ్‌ లెక్కిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త టారిఫ్‌లో లెక్కిస్తారు. ఈఆర్వో కార్యాలయాల్లో చేయాల్సింది కూడా ఇదే. మార్చి – మే మధ్య రెండు నెలల కాలానికి రెండు బిల్లులు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో సాధారణ విద్యుత్‌ వినియోగం ఉన్న వారికి బిల్లింగ్‌ మొత్తంలో పెద్ద తేడా కూడా రాదు.

మూడు నెలల వినియోగం….

జూన్‌ 6వ తేదీన రీడింగ్‌ తీసే సమయానికి మూడు నెలల వినియోగం 757 యూనిట్లు ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో మీటర్ రీడింగ్ నమోదు చేయలేదు. బిల్లు ఇవ్వలేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో నేను జరిపిన చెల్లింపులు పోను రూ.3844 కట్టాలని లెక్కేశారు. ఏప్రిల్‌, మేలలో రీడింగ్‌ తీయలేదని గట్టిగా పట్టుబట్టడంతో మేలో రీడింగ్ నమోదు చేసినట్లు స్టేటస్‌లో చూపించి., మార్చి- మే మధ్య రెండు నెలల్లో 100యూనిట్లు వినియోగంగా మిగిలిన 657 యూనిట్లు ఒక్క నెలలో వినియోగించినట్లు లెక్కించడం బయటపడింది. ఫలితంగా రూ.4854 అసలు బిల్లు., నేను జరిపిన చెల్లింపులు మినహాయించి రూ.3884 కట్టాల్సిన మొత్తంగా తేల్చారు.

నా వినియోగం- రావాల్సిన బిల్లు…..

మూడు ట్యూబ్‌లైట్లు., రెండు ఫ్యాన్లు., ఓ ఇన్వర్టర్‌ ఏసీ., 165లీటర్ల రిఫ్రిజిరేటర్‌., రెండు 20వాట్ల ఎల‌్‌ఇడి బల్బులు, హాఫ్‌ హెచ్‌పి మోటర్., 750వాట్ల మిక్సర్‌ గ్రైండర్‌ ఇది నా వినియోగం. సాధారణ పరిస్థితులలో విద్యుత్‌ వినియోగం నెలకు 200 యూనిట్లకు మించదు. మూడు నెలల సగటున 252 వినియోగం అయ్యిందని తేల్చారు…. ఈ వినియోగానికి మొదటి యాభై యూనిట్లకు రూ.2.68పైసల చొప్పున 134రుపాయలు., తర్వాత యాభై యూనిట్లకు రూ.3.35 చొప్పున 167.50పైసలు, ఆ తర్వాత 100 యూనిట్లకు రూ.5.42 చొప్పున రూ. 542, తర్వాత 52 యూనిట్లకు రూ.7.11పైసలు చొప్పున రూ.369.72 మొత్తం రూ.1213అవుతుంది. దీనికి కస్టమర్‌ ఛార్జీలు., విద్యుత్‌ సుంకం ఉంటుంది. మూడు నెలలకు కలిపి రూ.3639 అవుతుంది. ఏప్రిల్., మే నెలల్లో నేను చెల్లించిన మొత్తం మినహాయిస్తే రూ.2516 మాత్రమే నేను చెల్లించాల్సి ఉంటుంది. చివరకు వాళ్ల లెక్కల్లో కూడా అదే తేల్చారు. నేను ప్రశ్నించకపోతే 1328 రుపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. మార్చి నెలలో 20రోజుల వినియోగాన్ని విడిగా., తర్వాత ఏప్రిల్‌ నెలలో పది రోజుల వినియోగాన్ని విడిగా లెక్కిస్తే ఇంకాస్త తేడా ఉంటుంది.

ఈ తరహా ఫిర్యాదులే?

ఈ మూడు రోజుల్లో విద్యుత్‌ బిల్లులపై అభ్యంతరాలు చెబుతున్న వారిలో ఎక్కువ మంది ఈ తరహా ఫిర్యాదులే ఉన్నాయి. నేరుగా విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రాల్లో జమ చేసిన నగదు వారి ఖాతాలలో కనిపించడం లేదు. ఇది చాలా సాధారణం అన్నట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నారు. గ్రూప్‌ హౌస్‌లలో ఉండే వారికి ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి.మే నెలలో రీడింగ్‌ తీయకపోయినా తీసినట్టు స్పాట్ బిల్లింగ్‌ మెషిన్‌లో ఎంటర్‌ చూసి బిల్లింగ్ చేస్తున్నారు. దీంతో మూడు నెలల వినియోగానికి స్లాబ్‌లు గణనీయంగా మారిపోతున్నాయి. 225యూనిట్ల లోపు వినియోగం ఉంటే స్లాబ్ మారకుండా వినియోగదారుడిపై ఎలాంటి భారం ఉండదు. నెల వారీగా రీడింగ్ నమోదు చేయకపోవడం వల్ల భారం మొత్తం వినియోగదారుల మీద పడుతోంది. ఉదాహరణకు మే నెలలో నా విద్యుత్ వినియోగం తక్కువే అయినా మూడు నెలల సగటు లెక్కించడంతో బి క్యాటగరీ నుంచి సి లోకి స్లాబ్ మారింది. ఫలితంగా అదనంగా రూ.1200 అదనంగా భారం పడినట్లు అయ్యింది. వినియోగం పెరిగే కొద్ది యూనిట్ ధర పెరుగుతుండటంతో ఈ సమస్య వస్తోంది. బిల్లింగ్ చేయలేని పరిస్థితుల్లో వినియగదారుడు నేరుగా తన మీటర్ రీడింగ్ నమోదు చేయడం ద్వారా బిల్ చేసే అవకాశం కల్పించడమో, క్యూ ఆర్ రీడర్ ల సాయంతో మొబైల్ ద్వారా నేరుగా బిల్ పొందే అవకాశం కల్పించి ఉంటే బాగుండేది. మొత్తం మీద విద్యుత్ బిల్లుల భారం జనం మీద పడకుండా చూడాలని చేసిన ప్రభుత్వాల ప్రయత్నం వాళ్ళకి ఉపయోగ పడకుండా పోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ సరైన వివరణ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం తమను మోసం చేస్తోందనే భావన జనంలో పెరుగుతోంది.

Tags:    

Similar News