పిచ్చెక్కి పోతుంది.. ఒక్కొక్కరూ ఒక్కో రూలా?

కేంద్రం లాక్ డౌన్ ఆకస్మికంగా విధించిన నాటి నుంచి సడలిస్తున్న వరకు అంతా గందరగోళమే. స్ఫష్టంగా ఏ అడుగులు వేయకపోవడంతో లేని పోని సమస్యలు దేశవ్యాప్తంగా ప్రజలు [more]

Update: 2020-05-26 17:30 GMT

కేంద్రం లాక్ డౌన్ ఆకస్మికంగా విధించిన నాటి నుంచి సడలిస్తున్న వరకు అంతా గందరగోళమే. స్ఫష్టంగా ఏ అడుగులు వేయకపోవడంతో లేని పోని సమస్యలు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కి కొంత సమయం ప్రకటించి వలస కూలీలను స్వస్థలాలకు వెళ్ళే ఏర్పాటు చేయడం లో సర్కార్ విఫలం అయ్యింది. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారు సొంత గూటికి చేరే సమయం ఇవ్వకపోవడంతో వారు ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్నీ కావు. ఇక విదేశీ ప్రయాణికుల అంశంలోనూ లోపాలు స్పష్టంగా కనిపించాయి. వారిని క్వారంటైన్ చేయడంలో అలసత్వం తొలుత కొంప ముంచగా ఆ తరువాత తబ్లీగి జమాతే కార్యక్రమాలను అడ్డుకోవడంలోనూ యంత్రాంగాలు ఫెయిల్ అయ్యాయి.

రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడంతో …

లాక్ డౌన్ 4. 0 లో కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అక్కడి పరిస్థితుల మేరకు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టింది. ఇది కొన్ని విషయాల్లో మంచి ఫలితాలే ఇచ్చినప్పటికి కొన్ని అంశాల్లో ఒక్కో రాష్ట్రం ఒక్కో నిబంధనలు అమలు చేస్తూ మొత్తం గందరగోళానికి తెరతీశాయి. ముఖ్యంగా విమానాయానానికి సంబంధించి కేంద్రం పచ్చజండా ఊపినా కొన్ని రాష్ట్రాలు మోకాలు అడ్డాయి. దాంతో టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా విమానాలు రాకపోవడం, ఆ సమాచారాన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు సక్రమంగా ప్రకటించకపోవడంతో అంతా అయోమయం అయ్యింది.

ఎయిర్ పోర్టుకు చేరుకున్నా……

అంతే కాదు విమానాలు ఎక్కేందుకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఎయిర్ పోర్ట్ లకు చేరుకున్న ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూశారు. వెనక్కి వెళ్లలేక ముందుకు వెళ్లలేక వారంతా త్రిశంకు స్వర్గంలో ఉండాలిసి వచ్చింది. మహమ్మారి విజృంభిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు విమాన ప్రయాణాలు పరిమిత సంఖ్యలోనే నడపాలని కోరడంతో మెగా సిటీస్ కి అతి తక్కువమంది మాత్రమే అనుమతించారు. ఇక ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మంగళవారం నుంచి మాత్రమే విమానాలకు అనుమతి ఇచ్చాయి.

క్వారంటైన్ నిబంధనలు అంతే …

విమాన ప్రయాణికుల క్వారంటైన్ చేసే విధానంలో కూడా ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా రూల్స్ అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు వారం పాటు పెయిడ్ క్వారంటైన్ ఆ తరువాత హోమ్ క్వారంటైన్ అమలు చేస్తుంటే మరికొన్ని వారం రోజులు మాత్రమే నిబంధనగా పెట్టాయి. మరికొన్ని రాష్ట్రాలు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశాయి. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు నిబంధనలు ఫ్రేమ్ చేయడంతో ప్రయాణికులకు మాత్రం పిచ్చెక్కిపోతుంది. కేంద్రమే దీనిపై స్పష్టమైన విధానం రాష్ట్రాలకు జారీ చేసి ఉంటే ఈ తిప్పలు తప్పేవని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే జరగాలిసిన నష్టం అయితే జరిగిపోయింది కనుక ఇకపై అయినా దేశమంతా ఒకే విధానం అమలు అయ్యే చర్యలను విమాన ప్రయాణాలకు జారీ చేయాలనీ అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News