అందరూ వీరికి హ్యాండిచ్చారుగా?

రాజధాని రైతులు ఆందోళన ఆగలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రాజధాని అమరావతి రైతుల ఆందోళనలను మాత్రం ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. పైగా మూడు రాజధానులు ఖాయమంటూ [more]

Update: 2021-06-13 09:30 GMT

రాజధాని రైతులు ఆందోళన ఆగలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రాజధాని అమరావతి రైతుల ఆందోళనలను మాత్రం ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. పైగా మూడు రాజధానులు ఖాయమంటూ ప్రకటనలు చేయడం రాజధాని రైతుల్లో మరింత ఆందోళన పెంచేదిగా ఉంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాంటూ రైతులు చేస్తున్న ఉద్యమం దాదాపు 600 రోజులకు చేరుకుంది. అయినా ప్రభుత్వం మాత్రం వీరిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

పూర్తిగా వదిలేశారా?

ఇక రాజధాని రైతులను అన్ని పార్టీలూ పూర్తిగా వదిలేశాయనే చెప్పాలి. రాజధాని అమరావతి రైతులు ఆందోళన ప్రారంభించిన తొలినాళ్లలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ప్రధానంగా అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. చంద్రబాబు రైతుల ఆందోళన కోసం జోలె కూడా పట్టారు. బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చెపట్టాలనుకున్నా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత?

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా రాజధాని రైతుల ఆందోళనలను పట్టించుకోవడం లేదు. గతంలో చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి వంటి వారు ఆందోళనకు మద్దతు తెలుపుతూ తరచూ ఇక్కడ పర్యటించేవారు. కానీ గత కొన్నాళ్లుగా రాజధాని రైతుల మద్దతుగా వారు ఇక్కడకు రాలేదు. ఆందోళన 500 రోజులకు చేరిన సందర్భంగా చంద్రబాబు జూమ్ యాప్ లో మాట్లాడటం తప్ప తర్వాత వారికి మద్దతుగా నిలవలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

బీజేపీ, జనసేన కూడా…?

ఇక తొలినాళ్లలో బీజేపీ, జనసేన కూడా రాజధాని రైతులకు మద్దతు ప్రకటించాయి. కానీ కాలక్రమేణా ఆ పార్టీలు కూడా ఈ ఆందోళనకు దూరమయినట్లే కన్పిస్తుంది. దీంతో రాజధాని రైతులు పార్టీల వ్యవహారశైలిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీల వైఖరిలో మార్పు వచ్చిందని రాజధాని రైతులు చెబుతున్నారు. అనుకూల మీడియా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తాము పార్టీల మీద కాకుండా న్యాయస్థానాలపైనే ఆశపెట్టుకున్నామని వారంటున్నారు. మొత్తం మీద రాజధాని రైతులకు దాదాపు అన్ని పార్టీలు హ్యాండ్ ఇచ్చాయనే చెప్పాలి.

Tags:    

Similar News