తండ్రి చట్టంతోనే తంటా
ఫరూక్ అబ్దుల్లా….. ఆయన పేరుకే ఓ ప్రాంతాయ పార్టీ నాయకుడు. కానీ జాతీయస్థాయిలో ఆయనకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇంకా ఆ మాటకొస్తే ఆయన అంతర్జాతీయ స్థాయి [more]
ఫరూక్ అబ్దుల్లా….. ఆయన పేరుకే ఓ ప్రాంతాయ పార్టీ నాయకుడు. కానీ జాతీయస్థాయిలో ఆయనకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇంకా ఆ మాటకొస్తే ఆయన అంతర్జాతీయ స్థాయి [more]
ఫరూక్ అబ్దుల్లా….. ఆయన పేరుకే ఓ ప్రాంతాయ పార్టీ నాయకుడు. కానీ జాతీయస్థాయిలో ఆయనకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇంకా ఆ మాటకొస్తే ఆయన అంతర్జాతీయ స్థాయి నాయకుడని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పేరు ప్రఖ్యాతులు, ప్రపంచ స్థాయి గుర్తింపునకు కారణం ఆయన కశ్మీర్ నాయకుడు కావడం. నిన్న మొన్నటి వరకు మెహబూబాముఫ్తీ, గులాంనబీ ఆజాద్ తప్ప కశ్మీర్ అంటే ఢిల్లీ పాలకులకు, అంతర్జాతీయ సమాజానికి అబ్దుల్లాల కుంటుంబం గుర్తుకు వచ్చేది కాదు. ఫరూక్ అబ్దుల్లా తో పాటు ఆయన తండ్రి షేక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రులుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర షోషించారు. రాష్టరాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. దశాబ్ధాల క్రితం తండ్రి షేక్ అబ్దుల్లా తీసుకువచ్చిన చట్టం ఇప్పుడు తనయుడు ఫరూక్ అబ్దుల్లా తలకు చుట్టుకుంది. ఆ చట్టం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చివరికి కటకటాల పాల్జేసింది.
ఆయన తెచ్చిన చట్టం….
1978లో నాటి ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ప్రజా భద్రతా చట్టం అమల్లోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కలప స్మగ్లర్ల, ఉగ్రవాదులు ఆటకట్టించేందుకు అబ్దుల్లా ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్లపాటు జైల్లో ఉంచేందుకు అవకాశం ఉంది. కలప స్మగ్లర్లు ,ఉగ్రవాదులు తక్కువ శిక్షతో బయట పడుతున్నారని, వారిని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశ్యంతో షేక్ అబ్ధుల్లా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు ఈ చట్టమే ఆయన తనయుడైన ఫరూక్ అబ్దుల్లా పాలిట పెను శాపమైంది. ఒక్క జమ్ము కశ్మీర్ లోనే ప్రజా భద్రతా చట్టం అమలవుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ భద్రతా చట్టం అమలవుతోంది.
ముప్పు కింద…..
ప్రజా భద్రతా చట్టంలో రాష్ట్ర భద్రతకు ముప్పు నిబంధన కింద మూడు నుంచి ఆరు నెలలపాటు జైలులో నిర్భంధించవచ్చు. రాష్ట్ర భద్రతకు ముప్పు నిబంధన కింద రెండేళ్ల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైలులో నిర్భంధించవచ్చు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లాను ఈ నిబంధన కింద అరెస్టు చేశారు. ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లానే కావడం గమనార్హం. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ నిరంకుశ చట్టాన్ని రద్దు చేస్తామని ఫరూక్ తనయుడు ఒమర్ అబ్దుల్లా మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయడం విశేషం. ఇప్పుడు అదే చట్టం కింద ఆయన తండ్రి అరెస్టు కావడం కాకతాళీయం. 81 సంవత్సరాల ఫరూక్ అబ్దుల్లా ను అరెస్టు చేసిన వెంటనే శ్రీనగర్ లోని గుపార్క్ రోడ్డులోని ఆయన నివాసాన్ని అధికారులు జైలుగా ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఫరూక్ ఇంటి చుట్టూ ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మించారు. పోలీసులు భద్రతను మరింత పెంచారు.
తీవ్ర అనారోగ్యంతో….
వృద్ధుడైన ఫరూక్ అబ్దుల్లా కొన్నేళ్ల క్రితం మూత్ర పిండాల మార్పిడి చేయించుకున్నారు. ఆయన గుండెకు పేస్ మేకర్ ను అమర్చారు. ఫరూక్ అబ్దుల్లా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. ఫరూక్ అబ్దుల్లా అరెస్టును అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఒక పక్కన చెబుతూ మరోవైపు ఫరూక్ అబ్దుల్లా ను ఎందుకు అరెస్టు చేశారని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడైన గులాంనబీ ఆజాద్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. సీపీఎం, సీపీఐ, ప్రధాన కార్యదర్శులు సీతారామ్ ఏచూరి, డి.రాజా, ఎం.ఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. మరోవైపు తమిళనాడుకు చెందిన రాజ్యసభసభ్యుడు , ఎం.డి.ఎం.కే . నేత వైగో న్యాయపోరాటం చేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా అరెస్టుపై ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడైన మహ్మద్ అక్బర్ కూడా ఈ విషయమై కోర్టు తలుపు తట్టనున్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఆషామాషీ నాయకుడు కాదు….
కశ్మీర్ కు చెందిన కురువృద్ధుడైన ఫరూక్ అబ్దుల్లా ఆషామాషీ నాయకుడు కాదు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పదవులను నిర్వహించిన అనుభవజ్జుడు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ సభ్యుడు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని నగరమైన శ్రీనగర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1937 అక్టోబర్ 21న జన్మించిన ఫరూక్ అబ్దుల్లా 1982లో తొలిసారి సీఎం అయ్యారు. మళ్లీ 1996 నుంచి 2002 వరకు ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో యూపీఏ 2 హయాంలో కేంద్ర సంప్రదాయేతర ఇందన వనరుల మంత్రిగా పనిచేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ 2017 లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. స్వయంగా డాక్టర్ అయిన ఫరూక్ అబ్దుల్లా ఎనిమిది పదుల వయసులో తన ఆరోగ్యం గురించి ఎంత ఆందోళన చెందుతున్నారో రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా అదే మాదిరిగా ఆందోళన చెందుతున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్