గ‌ద్దె దంప‌తులు ఏమ‌య్యారు ? చ‌డీ చ‌ప్పుడు లేని రాజ‌కీయం

అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో దూకుడ‌గా వ్యవ‌హ‌రిస్తార‌ని అంద‌రూ భావించిన ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, ఆయ‌న స‌తీమ‌ణి అనురాధ దంప‌తులు ఏమ‌య్యారు ? ఎక్కడ ఉన్నారు… [more]

Update: 2021-03-07 13:30 GMT

అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో దూకుడ‌గా వ్యవ‌హ‌రిస్తార‌ని అంద‌రూ భావించిన ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, ఆయ‌న స‌తీమ‌ణి అనురాధ దంప‌తులు ఏమ‌య్యారు ? ఎక్కడ ఉన్నారు… అనే ప్రశ్న విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం న‌గ‌రంలో ఎక్కడ చూసినా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేడే ఎక్కువుగా ఉంది. అధికార వైసీపీ దూకుడు ముందు టీడీపీ జోరు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ప‌శ్చిమ‌లో మాత్రం బుద్ధా వెంక‌న్న త‌న ప‌రివారంతో ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ దూకుడు క‌నిపిస్తోంది త‌ప్ప.. టీడీపీ ప‌రిస్థితి ఎక్కడ వేసిన గొంగ‌లి అక్కడే అన్న చందంగా ఉంది.

మేయర్ సీటుపై…..

మ‌రీ ముఖ్యంగా తూర్పులో గెలుపు గుర్రం ఎక్కి..ఒకే ఒక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రువును నిల‌బెట్టిన సీనియ‌ర్ నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ‌న్ ఎక్కడా క‌నిపించ‌డం లేదు. గ‌త ఏడాది కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ స‌మ‌యంలో మంచి ఉత్సాహం చూపించిన గ‌ద్దె దంప‌తులు.. మేయ‌ర్ పీఠాన్ని త‌మ‌కు ఇవ్వాల‌ని ఆశించారు. ఈ క్రమంలో మాజీ జ‌డ్పీ చైర్మన్‌గా ఉన్న గ‌ద్దె అనురాధ త‌న ఓటు హ‌క్కును సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌న్నవ‌రం నుంచి విజ‌య‌వాడ‌కు మార్చుకున్నారు. ఆ త‌ర్వాత‌ ఈ సీటును ఎంపీ నాని కుమార్తెకు క‌న్ఫర్మ్ చేసిన‌ట్టు పార్టీ అధిష్టానం ప‌రోక్ష సంకేతాలు ఇవ్వడంతో గ‌ద్దె దంప‌తులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

పంతానికి పోతూ…..

తాను రెండు సార్లు ఎంపీగా గెలిచాను… జిల్లాలో మ‌హామ‌హులు మ‌ట్టి క‌రిచినా ఓన్ ఇమేజ్‌తో గెలిచానంటూ త‌న‌కు తానే చెప్పుకుంటూ కేశినేని నాని త‌న కుమార్తెను మేయ‌ర్ అభ్యర్థిగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇటు గ‌ద్దె రామ్మోహన్ కూడా అదే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. జిల్లాలో అంద‌రూ ఓడినా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో తాను ఒక‌డినని.. మ‌రో ఎమ్మెల్యే పార్టీకి దూర‌మైనా ఇప్పుడు కీల‌క జిల్లాలో పార్టీకి చెప్పుకునేందుకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను… త‌న‌కూ మేయ‌ర్ ప‌ద‌వి అడిగే హ‌క్కు ఉంది క‌దా ? అని వాదిస్తున్నారు. స‌రే మేయ‌ర్ సంగతి ఎలా ఉన్నా తూర్పు త‌న కంచుకోట అని ఫ్రూవ్ చేసుకోవాలంటే ముందు త‌న‌ ని‌యోజ‌క‌ర‌వ్గంలో కార్పొరేట‌ర్లను అయినా ఎక్కువ మందిని గెలిపించుకోవాలి. కానీ గ‌ద్దె ఆ విష‌యంలో యాక్టివ్‌గా ఉన్న‌ట్టే లేరు.

వైసీపీ దూకుడుగా…

మ‌రోవైపు తూర్పులో.. వైసీపీ యువ నాయ‌కుడు అవినాష్ దూకుడుగా ఉన్నారు. ప్రచారం చేస్తున్నారు. ఈయ‌న‌తో పోల్చుకుంటే..క‌నీస మాత్రంగా కూడా గ‌ద్దె రామ్మోహ‌న్ అనుచ‌రులు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అవినాష్ తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్‌గా వ‌చ్చిన‌ప్పటి నుంచే ప్రతి రోజు పాద‌యాత్రల‌తో జ‌నాల్లో ఉంటే గ‌ద్దె మాత్రం సొంత పార్టీ లుక‌లుక‌ల నేప‌థ్యంలో సైలెంట్ అయిపోయారు. చివ‌ర‌కు తూర్పులోనూ ఎంపీ కేశినేని ఒంట‌రిగా తిరిగేస్తున్నారు. మాకు మేయ‌ర్ పీఠం ద‌క్కన‌ప్పుడు మేం ఎందుకు ప్రచారం చేయాల‌ని గ‌ద్దె దంప‌తులు భావిస్తున్నారా ? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక వాస్తవ‌మైతే.. ఖ‌చ్చితంగా తూర్పులో టీడీపీ దెబ్బతిన‌డం ఖాయం. ఎందుకంటే.. ఇక్కడ ప‌ట్టున్న గ‌ద్దె రామ్మోహ‌న్ త‌న వ‌ర్గాన్ని, కేడ‌ర్‌ను కాపాడుకోక‌పోతే చాలా మంది అవినాష్ వైపు వెళ్లిపోవ‌డం ఖాయం.

Tags:    

Similar News