ఆ వైసీపీ వార‌సుడికి రెండు జిల్లాల్లోనూ ఛాన్స్ లేదా ?

గాదె వెంక‌ట‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంతో పేరెన్నికగ‌న్న నేత‌. ప్రజాస్వామ్య విలువ‌లు పాటిస్తూ పెద్దాయ‌న‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న రాజ‌కీయ అడుగులు చివ‌ర్లో కాస్త ఒడిదుడుకులుగా [more]

Update: 2021-04-02 09:30 GMT

గాదె వెంక‌ట‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంతో పేరెన్నికగ‌న్న నేత‌. ప్రజాస్వామ్య విలువ‌లు పాటిస్తూ పెద్దాయ‌న‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న రాజ‌కీయ అడుగులు చివ‌ర్లో కాస్త ఒడిదుడుకులుగా మారాయ‌నే చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చెందిన గాదె వెంక‌ట‌రెడ్డి ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో 1967లోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా ఆయ‌న రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం గొప్ప విష‌య‌మే. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత ఆ పార్టీకి కంచుకోట‌గా ఉన్న పరుచూరులోనే ఆయ‌న కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేసి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. 2004 ఎన్నిక‌ల వేళ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు కోసం ప‌రుచూరు సీటు త్యాగం చేసిన ఆయ‌న వైఎస్ కోరిక మేర‌కు గుంటూరు జిల్లా బాప‌ట్లకు మారారు. బాప‌ట్లలో కూడా 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచే వ‌రుస విజ‌యాలు సాధించారు.

కుమారుడి భవిష్యత్ కోసం…..

ఆ త‌ర్వాత మంత్రిగా కూడా కొన‌సాగిన ఆయ‌న త‌న వియ్యంకుడు అయిన క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప‌రెడ్డి కోసం త‌న సీటు త్యాగం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ ఫినిష్ కావ‌డంతో స్తబ్దుగా ఉన్న గాదె వెంక‌ట‌రెడ్డి త‌ర్వాత త‌న వియ్యంకుడు ఏరాసు టీడీపీలో ఉండ‌డంతో అనేక లాబీయింగ్‌ల త‌ర్వాత కుమారుడు మ‌ధుసూద‌న్ రెడ్డి రాజ‌కీయ భ‌విష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కుమారుడు మ‌ధుసూద‌న్ రెడ్డికి బాప‌ట్ల సీటు కోసం చంద్రబాబు చుట్టూరా చెప్పుల‌రిగేలా తిరిగినా బాబు మొఖం చాటేశారు. అప్పటికే బాప‌ట్లలో అన్న సతీష్‌, న‌రేంద్ర వ‌ర్మ వ‌ర్గాలు ఉండ‌డంతో బాబు గాదె వెంకటరెడ్డిని లైట్ తీస్కొన్నారు.

వైసీపీ కండువా క‌ప్పుకున్నా ?

ఆ త‌ర్వాత గాదె వెంకటరెడ్డి త‌న త‌న‌యుడు మ‌ధుసూద‌న్ రెడ్డి రాజ‌కీయ భ‌విష్యత్తు కోస‌మే వైసీపీలోకి వ‌స్తున్నాన‌ని చెప్పి మ‌రీ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ మారారు. గాదె ఫ్యామిలీకి కండువా క‌ప్పేట‌ప్పుడే జ‌గ‌న్ వారి కుటుంబ భ‌విష్యత్తును తాను చూసుకుంటాన‌ని చెప్పారు. క‌ట్ చేస్తే ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఇర‌వై నెల‌లు అవుతోంది. జ‌గ‌న్ మర్చిపోయిన వారి లిస్టులో గాదె వెంకటరెడ్డి ఫ్యామిలీ కూడా చేరిపోయింది. చిన్నా చిత‌కా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా తీసుకునేందుకు గాదె ఫ్యామిలీ ఇష్టంగా లేదు. ఖ‌చ్చితంగా త‌న వార‌సుడికి ఏదో ఒక అసెంబ్లీ సీటే కావాల‌ని గాదె వెంకటరెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు.

కోన కంట్లో నలుసులా…..

గాదె వెంకటరెడ్డికి ప‌ట్టున్న బాప‌ట్ల, ప‌రుచూరు మాత్రమే వీరికి ఆప్షన్లుగా ఉన్నాయి. టీడీపీలో ఉండ‌గా ప‌రుచూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండ‌డంతో బాప‌ట్ల కోసం విశ్వప్రయ‌త్నాలు చేశారు. ఇప్పుడు వైసీపీలో కూడా ప‌రుచూరు సీటుపై మ‌మ‌కారం ఉన్నా అక్కడ కుల స‌మీక‌ర‌ణ‌లు అడ్డు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో బాప‌ట్లలో చాప‌కింద నీరులా రాజ‌కీయం చేస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న కోన ర‌ఘుప‌తిని నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న రెడ్లు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు. పైగా ఇది మా సీటు ( రెడ్లు) .. ఇక్కడ మా వాడే పోటీ చేయాల‌ని కూడా వాళ్లు రాద్దాంతం చేస్తూ ర‌ఘుప‌తికి కంట్లో న‌లుసులా మారారు.

చాప కింద నీరులా….?

ఈ అస‌మ్మతిని వీరు చాప‌కింద నీరులా ఎంకరేజ్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వ‌రుస‌గా రెండు సార్లు గెల‌వ‌డంతో పాటు డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉండ‌డంతో బ‌య‌ట ప‌డ‌క‌పోయినా.. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వ‌ర్గాన్ని ర‌ఘుప‌తిపై ఎగ‌దోస్తోన‌న్న ప‌రిస్థితి ఉంది. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోన ర‌ఘుప‌తిని ప‌క్కన పెడితేనే గాదె మ‌ధుసూద‌న్‌కు ఛాన్స్ ఉంటుంది. అయితే జ‌గ‌న్ అంత రిస్క్ చేస్తాడా ? అన్నది కూడా డౌటే ? లేక‌పోతే మ‌రోసారి గాదె వెంకటరెడ్డి ఫ్యామిలీకి రాజ‌కీయంగా నిరాశ త‌ప్పదు.

Tags:    

Similar News