గాలి ఫ్యామిలీ రాజ‌కీయాల‌కు శుభం కార్డే ?

దివంగ‌త మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు వ్యక్తిగ‌తంగా పార్టీల‌తో సంబంధం లేని ఇమేజ్ ఉంది. పార్టీలు మారినా.. నియోజ‌క‌వ‌ర్గాలు మారినా కూడా ఆయ‌న చిత్తూరు జిల్లాలో [more]

Update: 2021-03-03 08:00 GMT

దివంగ‌త మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు వ్యక్తిగ‌తంగా పార్టీల‌తో సంబంధం లేని ఇమేజ్ ఉంది. పార్టీలు మారినా.. నియోజ‌క‌వ‌ర్గాలు మారినా కూడా ఆయ‌న చిత్తూరు జిల్లాలో గెలిచి నిలిచారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఆయ‌న ఎప్పుడూ పోరాడేందుకు మొగ్గు చూపేవారు. గాలి పోరాట ప‌టిమ ఎప్పుడూ పార్టీ కేడ‌ర్‌కు ఆద‌ర్శంగా ఉండేది. క్లీన్ ఇమేజ్ గాలి సొంతం. అలాంటి నేత వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గాలి భాను ప్రకాష్ నాయుడు తండ్రి స్థాయిలో అంద‌రిని స‌మ‌న్వయం చేయ‌లేక‌పోతున్నారు.. ఇటు దూకుడుగాను ముందుకు వెళ్లలేక‌పోతున్నారు. వ్యక్తిగ‌తంగా భానుకు మంచి పేరే ఉన్నా.. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న రోజా దూకుడును నియోజ‌క‌వ‌ర్గంలో నిలువ‌రించలేని ప‌రిస్థితి.

సానుభూతి కూడా పనిచేయక….

గ‌త ఎన్నిక‌ల్లో తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందిన సానుభూతి కూడా భానుకు ప‌నిచేయ‌లేదు. గ‌ట్టి పోటీ ఇచ్చినా రోజా చేతిలో 2500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నిక‌ల త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో పార్డీ కేడ‌ర్‌కు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉండ‌డంతో కేడ‌ర్‌లో సైతం నిరుత్సాహం నెల‌కొంది. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రోజా రోడ్డెక్కి త‌మ పార్టీ అభ్యర్థుల‌ను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం చేయ‌డంతో పాటు చ‌మ‌టోడ్చారు. మ‌రో వైపు భాను ప్రచారం చేయ‌క‌పోయినా 22 పంచాయ‌తీలు టీడీపీ సానుభూతిప‌రులు గెలుచుకున్నారు.

కనీసం మున్సిపల్ ఎన్నికల్లో అయినా….

ఈ ఫ‌లితాలు టీడీపీకే కాకుండా… అటు వైసీపీకి కూడా షాక్ ఇచ్చాయి. టీడీపీ పూర్తిగా చేతులు ఎత్తేసింది.. భాను ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు రోజా కేబినెట్ ఆశ‌ల‌తో గ‌ట్టిగా క‌ష్టప‌డ్డారు. టీడీపీ ముందే కాడి కింద ప‌డేసినా 22 పంచాయ‌తీలు ద‌క్కించుకుంది. దీంతో నగరిలో గ్రామ స్ధాయిలో టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలంటోంది వైసీపీ కేడర్‌. త్వర‌లో జ‌రిగే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో న‌గ‌రి, పుత్తూరు మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పట‌కయినా గాలి భాను ప్రకాష్ స్తబ్దత వీడి జ‌నాల్లోకి వ‌చ్చి కేడ‌ర్‌కు అండ‌గా ఉంటే న‌గ‌రిలో టీడీపీకి మంచి ఫ‌లితాలు సాధించే ఛాన్సులు ఉన్నాయి.

ఇప్పటికీ బయటకు రాకుంటే…?

గాలి ముద్దుకృష్ణమ నాయుడు మ‌ర‌ణాంత‌రం ఫ్యామిలీలో చీలిక వ‌చ్చి గాలి వార‌సుల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చినా న‌గ‌రి టీడీపీ కేడ‌ర్‌తో పాటు పార్టీ అధిష్టానం సైతం భానుకే అండ‌గా నిలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్రబాబు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న‌కు సీటు ఇచ్చారు. ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడినా భాను బ‌య‌ట‌కు రాక‌పోవ‌డమే పార్టీ కేడ‌ర్‌ను నిరుత్సాహ ప‌రుస్తోంది. భాను వ‌దిలేసినా కూడా స్థానిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఇప్పట‌కీ అయినా భాను బ‌య‌ట‌కు వ‌చ్చి తండ్రిలా జ‌నాల్లో ఉండ‌క‌పోతే ఇప్పటికే రెండు సార్లు న‌గ‌రిలో ఓడిన గాలి ఫ్యామిలీ రాజ‌కీయాల‌కు కాలం చెల్లిపోయే రోజులు ద‌గ్గర్లోనే ఉన్నాయి.

Tags:    

Similar News