తమ్ముళ్ళు నలుగురు ఇద్దరయ్యారా ?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇంకా గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. అపుడే ఆందోళన అంటే జనం నవ్విపోతారని అయిన లేదు. అది కూడా [more]

Update: 2019-06-17 16:30 GMT

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇంకా గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. అపుడే ఆందోళన అంటే జనం నవ్విపోతారని అయిన లేదు. అది కూడా ప్రజా సమస్యల మీద కాదు, చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో తనిఖీల పేరు మీద అవమానం జరిగిందని అట. దీని కోసం అర్ధనగ్న వేషాలు, చిందులు తొక్కడాలు, రోడ్ల మీదకు ఎక్కడాలు. సరే ఎవరేమనుకున్నా పూనకం వచ్చిన తమ్ముళ్ళు ఆగరుగా. విశాఖలో భారీ నిరసన అంటూ తమ్ముళ్ళు చేపడితే దానికి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విశాఖ దక్షిణం, తూర్పు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామక్రిష్ణబాబు. ఈ ఇద్దరు కూడా చొక్కాలు విప్పుకుని కొంతసేపు స్టేజ్ షో చేశారు. సరే కానీ విశాఖలో గెలిచిన నలుగురులో మరో ఇద్దరు ఏమయ్యారో

గంటా, గణబాబు డుమ్మా :

ఇక చంద్రబాబుకు అవమానం జరిగిపోయింది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. భద్రత సరిగ్గా లేదు అంటూ తమ్ముళ్ళు వీధిన పడితే విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ వైపుగా తొంగి చూడలేదు, వంగి వాలలేదు. మరి వీరి కధేంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. గంటా విషయానికి వస్తే పార్టీ ఓడిన తరువాత ఆయన సిటీలోని టీడీపీ ఆఫీస్ వైపు చూడడమే మానుకున్నారు. పార్టీ సమీక్షలకు కూడా డుమ్మా కొట్టారు. గణబాబు కూడా గంటా శిష్యుడన్న పేరుంది. ఆయన టీడీపీలో ఉంటే టీడీపీ, ప్రజారాజ్యంలో ఉంటే అక్కడ. అలా కాంగ్రెస్, మళ్ళీ ఇపుడు టీడీపీ. అంటే గణబాబు కూడా గంటా బాటలో ఇకపై కూడా నడుస్తారా అన్నదే తమ్ముళ్లకు కలవరపరుస్తోంది.

అనుమానమేనట :

ఇకపోతే గంటా విషయంలో టీడీపీ తమ్ముళ్ళు ఎవరికీ సందేహాలు పెద్దగా లేవు. ఆయన పూర్తి కాలం పార్టీలో కొనసాగుతారన్న ఆశ కూడా లేదు. గణబాబు కూడా వెళ్లిపోతే విశాఖ పశ్చిమలో బలమైన సామాజికవర్గం నేతను పార్టీ కోల్పోతుంది అన్నది పసుపు నేతల వేదనగా ఉంది. ఇక గంటా ఎక్కడికి వెళ్ళినా ఒక్కరే వెళ్లరు, అందువల్ల తనతో పాటు కనీసంగా అరడజన్ మందిని తీసుకెళ్తారు, మరి ఈ జాబితాలో పొరుగు జిల్లాల వారు ఎవరు ఉన్నారా అన్నదే అసలైన బాధ ఇపుడు టీడీపీ హై కమాండ్ కూడా దాని మీదే ద్రుష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News