గంటా బ్యాచ్ ఇక రెడీ అవుతుందా?

జనసేన, బీజేపీతో పొత్తుతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో సందిగ్దంగా ఉన్న నేతలు ఇక పార్టీని వీడే అవకాశాలున్నాయన్న టాక్ [more]

Update: 2020-01-17 05:00 GMT

జనసేన, బీజేపీతో పొత్తుతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో సందిగ్దంగా ఉన్న నేతలు ఇక పార్టీని వీడే అవకాశాలున్నాయన్న టాక్ బలంగా విన్పిస్తుంది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత నాయకత్వ సమస్య ఏర్పడటం, వైసీపీ బలంగా ఉండటంతో ఇప్పటి వరకూ వేచిచూసే ధోరణిలో ఉన్న టీడీపీ నేతలు కొందరు జనసేన, బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇందులో గంటా శ్రీనివాసరావు పేరు బలంగా విన్పిస్తుంది.

అటు ఇటు గానే…..

గంటా శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలిచినా ఆయన అటు ఇటుగానే ఉంటూ వస్తున్నారు. అధికార వైసీపీలో చేరాలని గంటా శ్రీనివాసరావు ప్రయత్నించినా ఆయనకు వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆయన బీజేపీ వైైపు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగింది. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. అలాగే లోకల్ బీజేపీ లీడర్లతోనూ తరచూ గంటా శ్రీనివాసరావు సమావేశం అవుతున్నారు. అయితే తాను పార్టీ మారనని పదే పదే చెబుతున్నప్పటికీ గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడే అవకాశమే ఉందన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు.

పొత్తు కుదరడంతో….

తాజాగా బీజేపీ, జనసేన పొత్తు కుదరడంతో టీడీపీ నేతల్లో ఆశలు పెరిగాయనే చెప్పాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు పవన్ కల్యాణ్ కు బలమైన సామాజిక వర్గంతో పాటు అభిమానులు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ కూటమి వైపు గంటా శ్రీనివాసరావు మొగ్గు చూపుతారని ఆయన సన్నిహితులు సయితం బలంగా చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ, వర్సెస్ జనసే, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్న అంచనాకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఈ మేరకు పెట్టేబేడా సర్దేందుకు రెడీ అయిపోయారు.

పవన్ తో సంబంధాలు….

గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. అయితే పవన్ కల్యాణ్ తో పెద్దగా సంబంధాలు లేవు. దీంతో ఆయన బీజేపీలో చేరి జనసేన మద్దతుతో మరోసారి రాజకీయ భవిష్యత్తును సానుకూలంగా మలచుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకోకపోయినా త్వరలోనే ఆయన బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసి టీడీపీని ఇబ్బంది పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అదే బాట పడతారన్న టాక్ విన్పిస్తుంది. మొత్తం మీద గంటా బ్యాచ్ పార్టీని వీడేందుకు రెడీ అయిందంటున్నారు.

Tags:    

Similar News