గ్యాంగ్ లీడర్ గంటాయేనా..?

ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏడారిలో మంచి నీళ్ళు పుట్టించే గండరగండ నాయకత్వం పై స్థాయిలో బీజేపీకి ఉన్న నేపధ్యంలో ఏపీ అసెంబ్లీలో సైతం కమలం [more]

Update: 2019-11-14 05:00 GMT

ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏడారిలో మంచి నీళ్ళు పుట్టించే గండరగండ నాయకత్వం పై స్థాయిలో బీజేపీకి ఉన్న నేపధ్యంలో ఏపీ అసెంబ్లీలో సైతం కమలం కండువాలు కళకళలాడే రోజులు దగ్గరలో ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఏపీ అసెంబ్లీలో మా పార్టీ ప్రాతినిధ్యం తొందరలోనే ఉంటుంది చూడండి అంటూ బీజేపీ వరిష్ట నేత సోము వీర్రాజు గట్టిగా చెబుతున్నారంటేనే తెర వెనక ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఫిరాయింపుల చట్టాన్ని ఇంపుగా ఉంచుతూనే కాగల కార్యం నెరవేర్చగల గంధర్వులు బీజేపీలో చాలా మంది ఉన్నారు. ఇందుకు ఉదాహారణ గోవా పరిణామాలే. అక్కడా ఒక్కలెక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరిపోయారు. సీన్ కట్ చేస్తే బీజేపీ అసెంబ్లీలో బలపడిపోయింది.

సోము వ్యాఖ్యల వెనక…?

ఏపీ అసెంబ్లీలో చూడబోతే బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం అక్కడ ఉన్నది మూడే మూడు పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన. మరి బీజేపీకి చోటు ఎలా వస్తుంది. అంటే కావాలనుకుంటే వస్తుంది. మా ఎమ్మెల్యేలు వచ్చే శాసన సభా సమావేశాల నాటికి అసెంబ్లీలో కనిపిస్తారని సోము వీర్రాజు లాంటి గట్టి నాయకులు చెప్పిన మీదట ఇక నమ్మాల్సిందే కదా. పోనీ నమ్మకూడదు అనుకున్నా జరుగుతున్న పరిణామాలు కూడా ఏవో కొత్త సంకేతాలు ఇస్తున్నాయి. కదా ఏపీ అసెంబ్లీలో మాకు అదనంగా ఒక్క‌ ఎమ్మెల్యే కూడా అవసరం లేదని నిండు సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే గీత దాటినా వేటు వేయండని స్పీకర్ కి ఆయన తగిన విన్నపాలు కూడా చేశారు. ఈ నేపధ్యంలో ఫిరాయింపుల కత్తెర నుంచి బయటపడేందుకే ఎమ్మెల్యేలు ఇంతకాలం ఆగార‌న్న మాట వినిపిస్తోంది.

అలా అయితే ఓకేనా..?

ఇక ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కనుక వేరే పార్టీలోకి వెళ్ళిపోతే వారిని చీలిక వర్గంగా గుర్తిస్తారు తప్ప వేటు వేయరని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను సమీకరించాల్సివుంటుంది. దానికి గానూ ఏపీలో కూడా గట్టి నాయకుడే అవస‌రమని అంటున్నారు. మరి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుకు ఎటూ గ్యాంగ్ లీడర్ అని పేరుంది. ఆయన కనుక తలచుకుంటే ఈ కూడిక పెద్ద కష్టమేమీ కదని అంటున్నారు. అయితే ఆపరేషన్ సజావుగా సాగాలంటే పై వారి దీవెలను ఉండాలి. ఇపుడు బీజేపీ హై కమాండ్ పెద్దలతో గంటా శ్రీనివాసరావు టచ్ లోకి వెళ్లారని అని అంటున్న వేళ ఆయన కనుక పూనుకుని కధ నడిపిస్తే మాత్రం ఏపీ అసెంబ్లీలో కొత్త సీన్ చూస్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నరు. టీడీపీ నిట్ట నిలువుగా చీలిపోతే మాత్రం కొత్త గ్రూప్ కి అసెంబ్లీలో గంటా శ్రీనివాసరావు నాయకుడు అవుతారని కూడా అంటున్నారు.

Tags:    

Similar News