మనసు లాగేస్తోందా?

ఓ వైపు బీజేపీ నేతలతో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తరచుగా భేటీ అవుతున్నారు. హస్తిన టూర్ కూడా పెట్టుకుని వెళ్ళి అక్కడ పెద్ద [more]

Update: 2019-11-23 03:30 GMT

ఓ వైపు బీజేపీ నేతలతో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తరచుగా భేటీ అవుతున్నారు. హస్తిన టూర్ కూడా పెట్టుకుని వెళ్ళి అక్కడ పెద్ద నాయకులను కలసి వచ్చారు. మరో వైపు ఏపీలో బీజేపీ ఫైర్ బ్రాండ్, సొంత సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుతో కూడా ఏకాంత భేటే వేశారు. ఆ వివరాలు గంటా శ్రీనివాసరావు ఎక్కడా చెప్పకపోయినా సోము వీర్రాజు మాత్రం వెల్లడించారు. ఇద్దరు నాయకులు కలిస్తే రాజకీయమే మాట్లాడుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని కూడా సోము అప్పట్లోనే బాంబు పేల్చారు. సరే ఈ ముచ్చట్లు అన్నీ కూడా జరిగి వారం పది రోజులు గడుస్తున్నా కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా కమలం నీడకు చేరలేదు. అంతెందుకు గంటా శ్రీనివాసరావు కూడా అడుగు ముందుకు వేయడంలేదు.

మనసు అటువైపేనా…?

నిజానికి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకే రావాలనుకున్నారు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలు ఇష్టం. పైగా జగన్ బలమైన నేతగా ఏపీలో ఉన్నారు. అవునన్నా కాదన్నా ఆయన నాలుగున్నరేళ్ళ పాటు అధికారంలో ఉంటారు. అందువల్ల వైసీపీలో చేరి మంత్రి కావాలన్నది గంటా శ్రీనివాసరావు మొదట్లో అనుకున్న ఆలోచన. అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా గంటా శ్రీనివాసరావు రెడీ అయ్యారు. అయితే మధ్యలో జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడడంతోనే ఆ వ్యూహం బెడిసికొట్టిందని ప్రచారం జరిగింది. ఈ లావాదేవీలు ఇలా ఉండగానే బీజేపీ నేతలు కూడా గంటా శ్రీనివాసరావును సంప్రదించడంతో గంటా శ్రీనివాసరావు వారితో కూడా చర్చలు జరిపారు. అయితే గంటాను బీజేపీలోకి రమ్మంటున్న కమలనాధులు ఆయనతో పాటు పెద్ద గ్రూప్ తీసుకువస్తే ఉప ఎన్నికలు లేకుండా చూస్తామని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ జరిగినా కూడా గంటా శ్రీనివాసరావుకు ఒరిగిందేంటి. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరి మళ్ళీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఉండాలి తప్ప అక్కడ అధికారం అయితే దక్కదన్నదే ఆలోచనగా ఉందని అంటున్నారు.

కలసిరావడంలేదా…?

ఇక టీడీపీలోని ఎమ్మెల్యేలు జగన్ పిలిస్తే వైసీపీలోకే వెళ్ళిపోవడానికే రెడీగా ఉన్నారు తప్ప బీజేపీ వైపు చూడడంలేని టాక్ ఉంది. పదే పదే బీజేపీ నేతలు తమ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పినా కూడా ఆచరణలో ఆ అలికిడి ఎక్కడా లేదని అంటున్నారు. గట్టిగా చెప్పాలంటే ఏపీలో బీజేపీ ఎక్కడా లేదు. ఆ పార్టీలో చేరి విపక్షంలో ఉండే కంటే ఉన్న టీడీపీలో ఉంటేనే బెటర్ అన్నది కూడా చివరికి తమ్ముళ్ల భావంగా ఉందని అంటున్నారు. ఈ కారణంగానే గోడ దూకుళ్ళకు అనుకున్న నంబర్ రావడంలేదని కూడా చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే గంటా శ్రీనివాసరావు సైలెంట్ గానే ఉంటున్నారని అంటున్నారు. బీజేపీ నేతలు ఎంత చెప్పినా కూడా ఏపీలో టీడీపీ నేతల ఫస్ట్ ఆప్షన్ వైసీపీగానే ఉంది అని అంటున్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఏపీ వరకూ కమలం కధ ఏంటో తెలిసిన వారు కాబట్టే చిక్కడంలేదు దక్కడంలేదు అంటున్నారు. దీంతోనే గంటా శ్రీనివాసరావు కూడా కూడా పెద్దగా హడావుడి చేయడంలేదని చెబుతున్నారు.

Tags:    

Similar News