గంటా ఆ గట్టుకేనట? ముహూర్తం ఫిక్సయిందట

గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో కీలకమైన నేత. ఆయనకు అర్ధబలం, అంగబలం రెండూ దండీగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలితో సాగుతూ అజేయుడిగా [more]

Update: 2020-03-19 14:30 GMT

గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో కీలకమైన నేత. ఆయనకు అర్ధబలం, అంగబలం రెండూ దండీగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలితో సాగుతూ అజేయుడిగా నిలిచారు. ఆయన ఎపుడూ అధికార‌ పార్టీలోనే ఉంటారని పేరు. 2019 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ కి కాస్తా బ్రేక్ పడినా దాన్ని సవరించే పనిలో గంటా శ్రీనివాసరావు ఇపుడు పడ్డారని అంటున్నారు. చంద్రబాబు పని పట్టాలని ఆగ్రహంతో ఉన్న వైసీపీ పెద్దలు ఇపుడు వరసపెట్టి పచ్చ నేతలకు ఎర వేస్తున్నారు. దాంతో గంటా శ్రీనివాసరావు మళ్ళీ ప్రచారంలోకి వచ్చారు.

ఆయన ఉంటే….?

గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే విశాఖలో మేయర్ పదవి తమ పార్టీ ఇంట్లోనే ఉంటుందని వైసీపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. విశాఖ టీడీపీలో గంటా ఒక్కడు చాలు. ఆయన్ని తమ సైడ్ తెచ్చేస్తే ఎటువంటి ఆయాసం లేకుండా మేయర్ కిరీటం తమ నెత్తిన పెట్టుకోవచ్చునని భావిస్తున్నారు. దాంతో గంటా శ్రీనివాసరావు అప్పట్లో పెట్టిన కండిషన్లు అన్నీ కూడా ఒప్పేసుకుని వైసీపీ ఆయన్ని లాగేస్తోంది అంటున్నారు. గంటా శ్రీనివాసరావు కనుక వస్తే ఆయన్ని సమాదరిస్తామని, బాగా చూసుకుంటామని ఇప్పటికే పెద్దలు హామీ ఇచ్చారట. ఇక విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటాకే పెద్ద పీట వేస్తామని అంటున్నారు.

కరణం బాటలోనేనా?

గంటా శ్రీనివాసరావు తాను వైసీపీలోకి వస్తానని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని ఖరాకండీగా ఇంతవరకూ చెబుతూ వచ్చారు. దానికి జగన్ పెట్టిన రూల్స్ అడ్డురావడంతో గంటా చేరిక అప్పట్లో నిలిచిపోయింది. ఇపుడు జగన్ ఆపరేషన్ చంద్రబాబు అంటున్నారు. దాంతో పాటు ఒక మెట్టు దిగారని తెలుస్తోంది. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం బాటలోనే పార్టీ కండువా కప్పుకోకుండా వైసీపీ మద్దతుదారుగా మారిపోవచ్చునని కూడా గంటాకు చెబుతున్నారుట. మొత్తానికి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవి ఉంటుంది. అధికార హోదా దక్కుతుంది. ఇలాంటి హామీలతో ఫ్యాన్ నీడను గంటా వచ్చేస్తారని అంటున్నారు.

భారీ దెబ్బ……

గంటా శ్రీనివాసరావును కనుక వైసీపీలోకి తెస్తే టీడీపీకి అతి పెద్ద దెబ్బ అంటున్నారు. గంటా రాకతో ఒక్క విశాఖతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆయన అనుచరులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతారని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే నానా ఇబ్బందులో ఉన్న టీడీపీ నెత్తిన పిడుగు పడ్డట్టేనని కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్ తాజాగా టీడీపీపై పగపట్టేసారని, ఈ దెబ్బకు పచ్చ శిబిరం కూలిపోవాల్సిందేనని వైసీపీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News