Azad : “గులాం” గిరీకి బహుమానమా?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. తనను పక్కన పెట్టారనుకున్నప్పుడు ఏ రాజకీయ నేత అయినా పక్క చూపులు చూస్తారు. కాంగ్రెస్ లో గులాం నబీ ఆజాద్ పరిస్థితి అదే. [more]

Update: 2021-10-30 16:30 GMT

రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. తనను పక్కన పెట్టారనుకున్నప్పుడు ఏ రాజకీయ నేత అయినా పక్క చూపులు చూస్తారు. కాంగ్రెస్ లో గులాం నబీ ఆజాద్ పరిస్థితి అదే. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అనుబంధం ఆయనది. పక్కా కాంగ్రెస్ వాదిగా గులాం నబీ ఆజాద్ కు పేరుంది. ఆయనకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చింది. అదే సమయంలో కేంద్రంలో ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కేంద్ర మంత్రిని చేసింది.

అసమ్మతి నేతగా….

అయితే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత గులాం నబీ ఆజాద్ పార్టీలో అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తయినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆయన మోదీకి దగ్గరవుతున్నారన్నది కాంగ్రెస్ అనుమానం. అందుకే 23 మంది సీనియర్ నేతలను కలుపుకుని కాంగ్రెస్ అధినాయకత్వంపై అసమ్మతి గళం విప్పారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.

రాజ్యసభకు ఎంపిక చేసి….

దీంతో గులాం నబీ ఆజాద్ కూడా ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేతగా, మైనారిటీ నేతగా తమకు 2024 ఎన్నికలలో ఉపయోగ పడతాడని బీజేపీ వ్యూహం. అందుకే గులాం నబీ ఆజాద్ ను ఉప రాష్ట్రపతిని చేయాలని భావిస్తుంది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు కూడా తెలిసింది. గులాం నబీ ఆజాద్ ను రాజ్యసభకు ఎంపిక చేసి ఉప రాష్ట్రపతిని చేయాలన్నది బీజేపీ ఉద్దేశ్యం.

ఇరుకున పెట్టినట్లే…

తమపై ఉన్న మతముద్రను చెరిపి వేసుకునేందుకు ఈ ఎంపిక ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తుంది. వచ్చే ఏడాది రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేేపథ్యంలో గులాం నబీ ఆజాద్ కూడా బీజేపీ యేతర పార్టీలను కలిసి తనకు మద్దతివ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. గులాం నబీ ఆజాద్ ను పోటీకి దింపితే కాంగ్రెస్ పక్షాలు కూడా మద్దతిచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టినట్లే. అందుకే ఈ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News