టీడీపీలో ఆ ఫ్యామిలీ కెరీర్ ముగిసిందా

రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వతం కాదు. అయితే, ఉన్నన్ని రోజులు తిరుగులేని ప్రజాద‌ర‌ణ‌ను సొంతం చేసు కున్నారా? లేదా? అనే ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు [more]

Update: 2019-10-06 02:00 GMT

రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వతం కాదు. అయితే, ఉన్నన్ని రోజులు తిరుగులేని ప్రజాద‌ర‌ణ‌ను సొంతం చేసు కున్నారా? లేదా? అనే ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు సార్లు వ‌రుస విజ‌యాలు సాధించి త‌న‌కంటూ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్న…. మాజీ దేవాదాయ శాఖ మంత్రి, సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు గుండా అప్పల సూర్యనారాయ‌ణ రాజ‌కీయం ప‌రిపూర్ణ మ‌నే చెప్పాలి. ఆయ‌నకు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ప్రజాద‌ర‌ణ సొంతం చేసుకున్నారు. టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ఎన్టీఆర్ హ‌యాంలో పార్టీలోకి వ‌చ్చిన సూర్యనారాయ‌ణ ప్రజ‌ల దేవుడిగా పేరు తెచ్చుకున్నారు.

వరస విజయాలతో…..

శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస విజ‌యాలు సాధించి తిరుగులేని నాయ‌కుడిగా ఎదిగారు. ఆయ‌న్ను స్థానికంగా దేవుడు మంత్రి అని కూడా పిలిచేవారు. మంత్రిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఉన్నా.. ఒక్కరూపాయి ఆరోప‌ణ‌లు కూడా లేకుండా ప్రజ‌ల‌కు చేరువ‌య్యారు. ప్రతి విష‌యాన్ని నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవ‌డంలోనూ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ ఆయ‌న ముందున్నారు. దీంతో ప్రజ‌లు.. ఆయ‌న‌ను వ‌రుస‌గా ఐదుసార్లు విజ‌యం అందించారు. ఆయ‌న దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన తుఫాన్లు రావ‌డంతో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా అత‌లాకుత‌ల‌మైంది.

అప్పట్లో మంచిపేరున్నా….

అప్పుడు చంద్రబాబు కొన్ని నిధులు కేటాయించి అక్కడ పున‌రావాస, ఇత‌ర‌త్రా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని ఆయ‌న్ను కోరారు. ఆ ప‌నులు చేప‌ట్టగా మిగిలిన నిధుల‌ను వేరే ప‌నుల‌కు కేటాయించుకునే వెసులుబాటు ఉన్నా ఆయ‌న మాత్రం వాటిని రిజెక్ట్ చేసి ఇంకా బాగా న‌ష్టపోయిన జిల్లాల్లో పున‌రావాసాల‌కు ఇవ్వాల‌ని సూచించారు. ఈ సంఘ‌ట‌న అప్పట్లో ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తాజాగా సూర్యనారాయ‌ణ రాజ‌కీయ హ‌వా త‌గ్గిన‌ నేప‌థ్యంలోను, వైఎస్ హ‌వా కార‌ణంగాను 2004, 2009లో ఓట‌మి చెందారు. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ నాయ‌కుడిగా ధ‌ర్మాన ప్రసాద‌రావు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో గుండా స‌తీమ‌ణి ల‌క్ష్మీదేవి పోటీకి దిగారు. భ‌ర్తకు ఉన్న ప‌లుకుబ‌డితో ఆమె కూడా విజ‌యం సాధించారు.

భర్తకున్న మంచిపేరు మొత్తం….

2014 ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీదేవి ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ప‌దేళ్ల త‌ర్వాత శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు గుండ ఫ్యామిలీకి ప‌ట్టం క‌డితే భ‌ర్త 25 ఏళ్లుగా చేసిన రాజ‌కీయంగా చిన్న మ‌చ్చ లేకుండా ఉంటే ల‌క్ష్మీదేవి మాత్రం ఐదేళ్లలోనే కావాల్సినంత వ్యతిరేక‌త కొని తెచ్చుకున్నారు. ఈ ఫ్యామిలీకి ఎప్పుడూ లేనంత అవినీతి మ‌ర‌క కూడా గ‌త ఐదేళ్లలో ప‌డింది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో మాత్రం ఆమె కూడా ఓట‌మిపాల‌య్యారు. ఇక్కడ నుంచి వైసీపీ టికెట్‌పై ధ‌ర్మాన ప్రసాద‌రావు మ‌రోసారి విజ‌యం అందుకున్నారు. ఇక‌, ఇప్పుడు వారికి వ‌య‌సైపోయింది. ఇప్పుడు వార‌సులు కూడా రంగ ప్రవేశం చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. పైగా గుండా ల‌క్ష్మీదేవికి పార్టీ ప‌రంగా ఎలా ఉన్నప్పటికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దగా పేరు రాలేదు. దీంతో ఆమెకు ఓట్లు ప‌డే ఛాన్స్ దాదాపు క‌నిపించ‌డం లేదు. మ‌ళ్లీ ఐదేళ్లకు జ‌రిగే ఎన్నిక‌ల్లో ఈ ఇద్దరు భార్యాభ‌ర్తలు పోటీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇక‌, టీడీపీలో ఈ దంప‌తుల రాజ‌కీయాలు ముగిసిన‌ట్టేన‌ని అంటున్నారు.

Tags:    

Similar News