టార్గెట్ జీవీఎల్

జీవీఎల్ ను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. మూడు రాజధానుల అంశం, శాసనమండలి [more]

Update: 2020-02-08 00:30 GMT

జీవీఎల్ ను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. మూడు రాజధానుల అంశం, శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకే నడుచుకుంటుందని, రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని పదే పదే జీవీఎల్ నరసింహారావు చెబుతుండటాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.

కొరకరాని కొయ్యగా…

నిజానికి జీవీఎల్ నరసింహారావు తొలి నుంచి టీడీపీ వ్యతిరేకిగానే ముద్రపడ్డారు. రెండు పార్టీలూ విడిపోయిన తర్వాత నుంచి టీడీపీ ప్రభుత్వంపై అవసరం ఉన్నప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో జీవీఎల్ నరసింహారావు క్యాంపు కార్యాలయానికి వచ్చి కలసి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి పై చర్చించామని చెప్పారు. అయితే వైసీపీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలను జీవీఎల్ చేసింది తక్కువేనని చెప్పాలి.

రాష్ట్ర శాఖ ఒకలా…..

వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మరోవైపు రాష్ట్ర బీజేపీ తప్పుపడుతుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను కూడా బీజేపీ రాష్ట్ర శాఖ వ్యతిరేకించింది. శాసనమండలి రద్దును కూడా బీజేపీ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. అయినా జీవీఎల్ నరసింహారావు మాత్రం వైసీపీ సర్కార్ ను వెనకేసుకు వస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాదు. ఆయన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా. ఆయన చేసే వ్యాఖ్యలకు అధికారిక ముద్ర ఉంటుంది.

రహస్య భేటీ వెనక?

మరోవైపు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి లాంటి వాళ్లు వైసీపీ సర్కార్ ను ఎండగడుతున్నారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా జీవీఎల్ వైసీపీ సర్కార్ నిర్ణయాలను వెనకేసుకు వస్తుండటంతో జీవీఎల్ ను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. జగన్ ను జీవీఎల్ ఏకాంతంగా ఎందుకు కలిశారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కీలక నేతతో ఢిల్లీలోని లోథి హోటల్ లో భేటీ వెనక మర్మమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జీవీఎల్ ను టీడీపీ టార్గెట్ చేస్తూ ఆయనను ఇబ్బంది పెట్టాలన్న యోచనలో ఉంది. మరి జీవీఎల్ తగ్గుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News