చిక్కుకుంటారో? లేదో?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్నటి వ‌ర‌కు తిట్టుకున్నవారు నేడు చేతులు క‌లుపుకొని మిత్రులు అవుతున్న ప‌రిస్థితి ఉంది. ఇక‌, కేంద్రంలోనూ ఇదే ప‌రిస్థితి చాలా రాష్ట్రాల్లోనూ ఈ [more]

Update: 2019-09-03 09:30 GMT

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్నటి వ‌ర‌కు తిట్టుకున్నవారు నేడు చేతులు క‌లుపుకొని మిత్రులు అవుతున్న ప‌రిస్థితి ఉంది. ఇక‌, కేంద్రంలోనూ ఇదే ప‌రిస్థితి చాలా రాష్ట్రాల్లోనూ ఈ త‌ర‌హా రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ‌లో బీజేపీ చ‌క్రం జోరుగా తిప్పుతోంది. ఇక్కడ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అధికారంలోకి వ‌చ్చేందుకు క‌మ‌ల నాథులు జోరుగా ప్రయ‌త్నాలు ప్రారంభించారు. యువ‌త‌కు పెద్దపీట వేయ‌డంతోపాటు పార్టీ స‌భ్యత్వాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కీల‌క‌మ‌ని భావిస్తున్న వారిని స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించే కార్యక్ర‌మానికి కూడా రేపో మాపోశ్రీకారం చుట్టనున్నారు.

కీలక నేత కావడంతో….

ఈ నేప‌థ్యంలోనే తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క నాయ‌కుడు, సాక్షాత్తూ.. సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీష్‌రావుకు కూడా బీజేపీ గేలం వేస్తోంద‌ని అంటున్నారు. తాజాగా హ‌రీష్ రావు ను ఆకాశానికి ఎత్తేస్తూ.. బీజేపీ నేత‌లు ప్రసంగాల‌ను ద‌ట్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లే ఎక్కువ కష్టపడ్డారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థతి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రాత్రింబవళ్ళు పనిచేసిన వారు… ఆ తర్వాత టీఆర్ఎస్‌కు దూరమయ్యారన్నారు.

దూరం చేయాలని….

లక్ష ఓట్లతో ఘోరంగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తారా ? గులాబీ జెండాకు కేసీఆరే యజమాని అంటూ ఎర్రబెల్లి చెప్పడం ఎంతవరకు సబబు ? అని అరవింద్ ప్రశ్నించారు. అంతేకాదు, పార్టీ కోసం ఎంతో శ్రమించిన హ‌రీష్ రావుకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని అన్నారు. ఇలా ఉన్నప‌ళంగా ధ‌ర్మపురి వ్యాఖ్యానించ‌డం వెనుక హ‌రీష్ రావును మెల్లగా కేసీఆర్‌కు దూరం చేయ‌డ‌మ‌నే వ్యూహాన్ని తెలంగాణ బీజేపీ నాయ‌కులు ప్రయ‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.

కొన్ని రోజులుగా ప్రచారం….

వాస్తవానికి చాలా రోజుల నుంచి కూడా ఇదే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కుదిరితే సొంత పార్టీ పెట్టుకుంటార‌ని కూడా హ‌రీష్ రావుపై వ్యాఖ్యలు వినిపించాయి. కేసీఆర్ ఆయ‌న‌ను అన్యాయం చేస్తున్నార‌ని, రాష్ట్రంలో గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా హ‌రీష్ రావు రికార్డు సృష్టించార‌ని, అయినా కూడా ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకోకుండా అవ‌మానించార‌ని బీజేపీ నాయ‌కులు త‌ర‌చుగా వ్యాఖ్యలు సంధించారు. ఇక‌, ఇప్పుడు అర‌వింద్ మ‌రికొంత దూరం వెళ్లి.. హ‌రీష్ రావును మోసేశారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ హ‌రీష్ రావు కు వేస్తున్న గేలం చాలా బ‌లంగానే ఉంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి హ‌రీష్ రావు చిక్కుకుంటారా? లేదా చూడాలి.

Tags:    

Similar News