జగన్ ఏరి కోరి తెచ్చిపెట్టుకుంటే…?
ప్రవీణ్ ప్రకాష్. 1994 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి వివాదాల్ని చంకలో పెట్టుకుని తిరుగుతుంటారని పేరు. ఎక్కడ ఏ హోదాలో పనిచేసినా ఏదో ఒక వివాదం [more]
ప్రవీణ్ ప్రకాష్. 1994 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి వివాదాల్ని చంకలో పెట్టుకుని తిరుగుతుంటారని పేరు. ఎక్కడ ఏ హోదాలో పనిచేసినా ఏదో ఒక వివాదం [more]
ప్రవీణ్ ప్రకాష్. 1994 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి వివాదాల్ని చంకలో పెట్టుకుని తిరుగుతుంటారని పేరు. ఎక్కడ ఏ హోదాలో పనిచేసినా ఏదో ఒక వివాదం ఆయనను చుట్టు ముడుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి అత్యంత విధేయంగా ఉంటారని పేరు పొందిన ఆయన తన కింద పనిచేసే ఉద్యోగుల్ని మాత్రం ఠారెత్తిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్టులో నియమితులైన ఆయన, రాష్ట్రంలో ఐఏఎస్‌లు అందరికీ బాస్ అయిన చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్యణ్యంతోనే ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వడం సంచలనమైంది. ప్రవీణ్ ప్రకాష్ వైఖరితో చిర్రెత్తిన చీఫ్ సెక్రటరీ ఆయనకు ఏకంగా షోకాజ్ నోటీస్‌నే జారీ చేయడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో హాట్ టాపిక్.
గొడవకు కారణం ఏంటంటే…?
గత ప్రభుత్వహయాంలో ఢిల్లీలోని ఏపీ భన్ రెసిడెంట్ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ ప్రకాష్, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి సన్నిహితంగా మెలిగారు. ఢిల్లీలో చక్కబెట్టాల్సిన కీలక బాధ్యతలన్నీ చంద్రబాబు ప్రవీణ్ ప్రకాష్ కే అప్పగించేవారు. ప్రవీణ్ ప్రకాష్ భార్య, ఐపీఎస్ అధికారిణి భావనా సక్సేనా కోసం ఏపీ భవన్‌లోనే ఒక పోస్టు క్రియేట్ చేసి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాటదీక్ష వంటి కార్యక్రమాలకూ ఆయనే ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లూ చేశారు. రాష్ట్రంలో అధికారం మారాక… గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకి సన్నిహితంగా మెలిగిన అధికారులందరినీ అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చిన జగన్ ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ కు మాత్రం కీలక పోస్ట్‌లు కట్టబెట్టింది. ప్రవీణ్ ప్రకాష్ ను జగన్ ఏకంగా తనకు ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. అంతేనా… కీలకమైన జీఏడీ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) పోస్టుకి ఇన్‌ఛార్జిగాను ప్రవీణ్ ప్రకాష్ నే నియమించారు. విజయసాయిరెడ్డి ఆశీస్సులతోనే ప్రవీణ్ ప్రకాష్ కు అంత ప్రాధాన్యం దక్కినట్టు ఐఏఎస్ వర్గాల్లో వినికిడి. ఇంకేముంది…. రెండు కీలకమైన పోస్టులు దక్కడం, ప్రభుత్వంలోని పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో సార్ చెలరేగిపోయారు. సీఎస్ ఆదేశాల్నీ పట్టించుకోకుండా ఎడా పెడా వివాదాస్పద జీవోలు ఇవ్వడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు. కేబినెట్ అజెండాలో కూడా తన సొంత నిర్ణయం మేరకు సబ్జెక్ట్‌లు పెట్టడం మొదలు పెట్టారు.
కేబినెట్ అంశాలు కూడా…..
వాస్తవానికి కేబినెట్‌కు అజెండాలో పెట్టాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవలసింది చీఫ్ సెక్రటరీ. ఒకటి రెండు సార్లు చెప్పి చూసినా… ప్రవీణ్ ప్రకాష్ లో మార్పు రాకపోవడంతో సీఎస్ ఏకంగా షోకాజ్ నోటీసు ఇచ్చారు. సీఎంకి చెప్పే సీఎస్ షోకాజ్ నోటీసు ఇచ్చారా..? దీనికి ప్రవీణ్ ప్రకాష్ సమాధానం ఇస్తారా? ఈ వివాదం ఎటు దారి తీస్తుంది అన్న చర్చ ఇప్పడు అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ వైఖరిపై ఆయన కింద పని చేస్తున్న అధికారులూ గుర్రుగా ఉన్నారు. ఇటీవలే జీఏడీలో అడిషినల్ సెక్రటరీగా పని చేస్తున్న గురుమూర్తి అనే అధికారి…. ప్రవీణ్ ప్రకాష్ బాధ పడలేకపోతున్నాను నన్ను బదిలీ చేయండి మహా ప్రభో అని సీఎస్‌కి అర్జీ పెట్టు కున్నారు.
మొదటి నుంచీ వివాదాలే…..
ప్రవీణ్ ప్రకాష్ ఎక్కడున్నా వివాదాలు లేకపోతే ఆయనకు పొద్దు గడవదు. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఏకంగా అధికార పార్టీ మేయర్‌నే అరెస్ట్ చేయించారు. విశాఖ కలెక్టర్‌గా ఉన్నప్పడు ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలని గట్టిగా పట్టుబట్టి వారితో గొడవ తెచ్చుకున్నారు. అప్పటి సీఎం వైఎస్ స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఆ వివాదం సద్దుమణగలేదు. విశాఖ కలెక్టర్‌గా ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘంతో గొడవ పడ్డారు. ఇప్పడు ఏకంగా సీఎస్‌తో తలపడ్డారు. కొందరంతే… మంచో చెడ్డో వాళ్లు ఎప్పటికీ మారరు..!