టీడీపీ గెలిస్తే.. ఆ ఇద్దరు నేత‌లు మంత్రులేనట.. పార్టీలో హాట్ టాపిక్

ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయ స్థితిలో ఉంది. చాలా మంది ఇప్పుడు క‌ష్టప‌డినా ఉప‌యోగం ఉండ‌ద‌ని కాడి కింద ప‌డేస్తే.. మ‌రి కొంద‌రు మాత్రం ఇప్పుడు [more]

Update: 2021-01-15 03:30 GMT

ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయ స్థితిలో ఉంది. చాలా మంది ఇప్పుడు క‌ష్టప‌డినా ఉప‌యోగం ఉండ‌ద‌ని కాడి కింద ప‌డేస్తే.. మ‌రి కొంద‌రు మాత్రం ఇప్పుడు క‌ష్టప‌డితేనే పార్టీ అధికారంలోకి వ‌స్తే తిరుగుఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఈ సంధి కాలంలో ఎవ‌రికి వారు భ‌విష్యత్తును ఊహించుకుంటూ త‌మ‌కు తోచిన‌ట్టు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ చ‌ర్చల్లో రాష్ట్ర టీడీపీలో ఆస‌క్తిక‌ర విష‌యం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏ సీనియ‌ర్ నాయ‌కుడిని క‌దిలించినా.. ఓ చిత్రమైన విష‌యాన్ని చెబుతున్నారు. “మా పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఆ ఇద్దరు మంత్రులు కావ‌డం ఖాయం“ అని స‌ద‌రు సీనియ‌ర్ త‌మ్ముళ్లు చెబుతుండ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. పార్టీ ఏదైనా.. రాజ‌కీయంగా పార్టీ కోసం అంకిత భావంతో ప‌నిచేసే వారికి గుర్తింపు ఎప్పుడూ ద‌క్కుతుంది. అది టీడీపీలో అయితే.. మ‌రింత తొంద‌ర‌గా ల‌భిస్తుంద‌నే విష‌యం తెలిసిందే.

యాక్టివ్ గా ఉండటంతో….

ఈ క్రమంలోనే ఆది నుంచి టీడీపీలో ఉంటూ.. విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో విజ‌యం సాధించిన బొండా ఉమామ‌హేశ్వర‌రావు ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌డంలో ముందున్నారు. గ‌తంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు కూడా ఆయ‌న పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమ‌ర్శించ‌డంలోను బోండా ముందున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో కాపు సామాజిక వ‌ర్గం కోటాలో ఖ‌చ్చితంగా ఈయ‌న‌కు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. జిల్లా కాపు వ‌ర్గంలో మండ‌లి బుద్ధ ప్రసాద్ లాంటి సీనియ‌ర్లు ఉన్నా పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బొండా మాత్రం దూకుడు చూపిస్తూ త‌న‌కున్న ఫైర్ బ్రాండ్ బిరుదు సార్థకం చేసుకుంటున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నకాలంలో….

ఇక‌, మ‌రో కీల‌క నేత‌, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నాయి. పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఎంత‌వ‌ర‌కైనా.. అన్న విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రధానంగా.. అసెంబ్లీలో టీడీపీ వాయిస్ వినిపిస్తున్న వారిలో కీల‌కంగా నిలిచారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయ‌న అసెంబ్లీలో ఉప నేత‌గా అవ‌కాశం క‌ల్పించారు. మ‌రోవైపు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండ‌డంతో నిమ్మల‌ను స‌ర్కారు కూడా టార్గెట్ చేస్తోంది. ఆయ‌న‌ను ఎలాగైనా స‌స్పెండ్ చేయాల‌ని ప్రయ‌త్నిస్తోందంటే.. నిమ్మల ఏవిధంగా దూకుడు ప్రద‌ర్శిస్తున్నారో.. అర్ధమ‌వుతోంది.

నిమ్మలపై సానుకూలంగా….

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రతి సారి ఓ కాపు నేత మంత్రిగా ఉంటారు. ఈ సారి నిమ్మల‌కు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంట‌నే మంత్రి ప‌ద‌వి ఖాయం అంటున్నారు. నిమ్మల త‌న నియోజ‌క‌వ‌ర్గం, జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ దూకుడు చూపిస్తున్నారు. పార్టీ త‌ర‌పున తిరుగులేని వాయిస్ వినిపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. ఈ ఇద్దరు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఖాయం.. కావాలంటే..రాసిపెట్టుకోండి! అని సీనియ‌ర్లు చెబుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, ఈ ఇద్దరు నేత‌ల వ్యవ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. ఇది నిజ‌మే అని కూడా అనిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News