ఇల్లేమో దూరం…!

విజయానికి అందరూ బంధువులే..అపజయం అనాథ. ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేక చతికిలపడిన తర్వాత మళ్లీ జనసేన పార్టీ పునర్నిర్మాణంపై అధినేత దృష్టి సారించారు. రాజకీయంగా పార్టీ పునరుత్థానానికి [more]

Update: 2019-07-27 15:30 GMT

విజయానికి అందరూ బంధువులే..అపజయం అనాథ. ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేక చతికిలపడిన తర్వాత మళ్లీ జనసేన పార్టీ పునర్నిర్మాణంపై అధినేత దృష్టి సారించారు. రాజకీయంగా పార్టీ పునరుత్థానానికి ఎంతవరకూ అవకాశాలున్నాయి? ప్రస్తుత రాజకీయవాతావరణం లో జనసేన పుంజుకోవడం సాధ్యమేనా? అన్న చర్చ మొదలైంది. అందులోనూ కీలకమైన నేతలను దూరంగా పెట్టడంపైనా వివాదం రగులుతోంది. సమీక్షలు, కమిటీల నియామకం పార్టీకి కొత్త వెలుగును తెస్తాయా? లక్షలాది మంది అభిమానుల కల నెరవేరుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎన్నెన్నో ఆశలతో, ఆకాంక్షలతో, ఆదర్శ భావాలతో మొదలుపెట్టిన జనసేన ప్రస్థానం ఆది నుంచి ఆటుపోట్లనే ఎదుర్కొంటోంది. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపికి జై కొట్టాల్సి వచ్చింది. దాంతోనే సగం జనసేన బలం నిర్వీర్యమైపోయింది. ఆ తర్వాత క్రమేపీ కేంద్ర,రాష్ట్ర అధికారపార్టీలకు దూరమైంది. కానీ అనధికార అవగాహన ఉందేమోననే అనుమానం మాత్రం వీడలేదు. ఫలితంగా 2019లో స్వతంత్ర పార్టీగా అన్నివర్గాల మద్దతు కూడగట్టడం జనసేనకు సాధ్యం కాలేదు. పార్టీకి సామాజిక సమీకరణల రీత్యా బలమున్న ఉభయగోదావరి జిల్లాల్లో సైతం ప్రభావం చూపలేకపోయింది. బలమైన పార్టీలున్న సమయంలోనే ప్రజారాజ్యం 18 స్థానాలు గెలుచుకుని 70 లక్షల పైచిలుకు ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకోగలిగింది. టీడీపీ బాగా బలహీనపడినప్పటికీ జనసేన మాత్రం ఆ స్థాయి ప్రభావాన్ని 2019లో చూపలేకపోయింది. పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని కలిగి లేకపోవడం ఇందుకొక కారణం. అధినేత క్షేత్రస్థాయి కార్యాచరణ లోపించడం మరో కారణం.

దారంతా గోతులు…

పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో ఎక్కువగా ప్రస్తావించే ‘అసలే చీకటి…ఇల్లేమో దూరం…దారంతా గోతులు.. చేతిలో దీపం లేదు’అన్న డైలాగునే ప్రతిబింబిస్తోంది జనసేన. చేరుకోవాల్సిన లక్ష్యం చాలా దూరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం చాలా గందరగోళంగా కనిపిస్తోంది. వైసీపీని మినహాయిస్తే మిగిలిన రాజకీయ పార్టీలన్నీ నిరాశానిస్పృహల్లో కూరుకుని ఉన్నాయి. పవన్ పార్టీ జనసేనకి ఇంతటి పరాజయం ఎదురవుతుందని ఎవరూ అంచనా కట్టలేదు. ఆ పార్టీ నాయకులు నలభై సీట్ల వరకూ వస్తాయని అంచనా వేసుకున్నారు. నిష్ఫాక్షికంగా అంచనా వేసే తటస్థ పరిశీలకులు సైతం కనీసం ఏడెనిమిది సీట్ల వరకూ దక్కుతాయని భావించారు. కానీ అధినేత సహా పరాజయం బాట పట్టారు. దాంతో భవిష్యత్తు అంతా చీకటిగా కనిపిస్తోందని కొందరు జనసేన నాయకులు తమ మార్గాలను వెదుక్కుంటున్నారు. రాజకీయ పునరావాసంగా ఇతరపార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఈ స్థితిలో పార్టీపై క్యాడర్ కు అధినేత ఎంతవరకూ నమ్మకం కలిగిస్తారనేది ముఖ్యం. నాయకులతో సంబంధం లేకుండా లక్షలాదిగా ఉన్న అభిమానుల ఆసరాతో జనసేన పార్టీకి ఉత్సాహాన్ని ఊపిరులూదాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్ దే. కేవలం కమిటీలతో సరిపోదు. రాజకీయ కార్యాచరణ గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడంతోనే ఫలితాలనిస్తుంది.

కమలం కన్ను గీటుతోందా…?

బీజేపీ అధికార వైఎస్సార్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని తలపోస్తోంది. ఇందుకుగాను ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి భారీ ఎత్తున చిల్లు పెడుతోంది. నాయకులను, ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తోంది. టీడీపీ శాసనసభ్యులకు సైతం వల వేస్తోంది. టీడీపీనే కాకుండా అధికారపార్టీని సైతం బీజేపీ ఎదుగుదల యత్నాలు కలవరపరుస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే టీడీపీకి వైసీపీ తీసుకున్న నిర్ణయం రక్షాకవచంగా ఉపయోగపడుతోంది. ‘ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేయాల్సిందే. లేకపోతే ఫిరాయింపు కింద అనర్హత వేటు వేయాల్సిందే.’అంటూ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇది నిజానికి స్పీకర్ కు చేసిన సూచన వంటిదే. బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ చేస్తే వారిపై వేటు పడుతుంది. అందువల్ల వారు అంతటి సాహసం చేయకపోవచ్చు. జనసేనకు కూడా బీజేపీ వల వేస్తోంది. గతంలోనే అమిత్ షా పవన్ కు ఆహ్వానం పలికారు. సున్నితంగా దానిని పవన్ తిరస్కరించారు. పరాజయం తర్వాత డీలాపడిన జనసేన నాయకులను భారీ ఎత్తున చేర్చుకునేందుకు అవసరమైన వ్యూహాలను కమలం పార్టీ సిద్ధమవుతోంది. ఎందుకంటే మూడోపక్షంగా జనసేన బలపడితే బీజేపీకి ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల బీజేపీ.. జనసేన ముందరికాళ్లకు బంధం వేసేందుకు చాన్సులున్నాయి.

కులం సంఘబలం…

కులం రాజకీయాల్లో ఒక సాధారణ సమీకరణ సూత్రంగా మారిపోయింది. పవన్ కల్యాణ్ బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ దానిని క్లెయిం చేసుకునేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. అయితే తాజాగా కులాన్ని తోసిపుచ్చలేం. కానీ ఒక్క కులం ఆధారంగానే రాజకీయాలు నడపలేమంటూ చెప్పుకొచ్చారు. పవన్ వైఖరిలో ఇదో పెద్ద మార్పుగానే జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 16 శాతం వరకూ జనాభాలో ప్రాతినిధ్యం వహించే పవన్ సామాజిక వర్గంలో మెజార్టీ ప్రజలు జనసేనను సొంతం చేసుకుంటే ఒక బలమైన పార్టీగా నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు. మిగిలిన సామాజిక వర్గాలను దరి చేర్చుకునేందుకు ఒక సైద్ధాంతిక భూమికను జనసేన నిర్మించుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను వ్యూహాత్మకంగా జనసేన వ్యవహరించాలి. రాష్ట్రస్థాయి కమిటీల నిర్మాణం తో పాటు జిల్లా, నియోజకవర్గాల పైనా శ్రద్ధ పెట్టాలనే డిమాండ్ వినవస్తోంది. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయవేత్తగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పర్యటనలతో జనసేన పార్టీని పటిష్టం చేసేందుకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నాయకులు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి పార్టీ చేరుకోవాలంటే యాక్షన్ ప్లాన్ తో ఇప్పట్నుంచే రంగంలోకి దిగాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News