వద్దంటే వద్దంటున్నారట.. ఉలకడంలే.. పలకడంలే

ఉత్తరాంధ్రా జిల్లాల గురించి టీడీపీ తెగ గొప్పలు చెప్పుకునేది. కంచుకోట అని మురిసిపోయేది. ఎక్కడ ఓటమి ఎదురైనా కానీ ఈ మూడు జిల్లాలూ మాత్రం మా సొంతం [more]

Update: 2020-06-26 14:30 GMT

ఉత్తరాంధ్రా జిల్లాల గురించి టీడీపీ తెగ గొప్పలు చెప్పుకునేది. కంచుకోట అని మురిసిపోయేది. ఎక్కడ ఓటమి ఎదురైనా కానీ ఈ మూడు జిల్లాలూ మాత్రం మా సొంతం అని గర్వించేది. అటువంటి చోట గత ఏడాది ఘోర పరాభవం జరిగింది. పార్టీ పుట్టిన తరువాత ఎన్నడూ ఎఏరగని ఓటమిని జనాలు అందించారు. 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అరడజన్ మందే గెలిచారు. ఇక విజయనగరం జిల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపధ్యంలో పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం ఇంకా టీడీపీలో మొదలు కాలేదు. నిరాశతోనే ఏడాది కాలం కాస్తా గడచిపోయింది. పెద్ద నోరు వేసుకుని గర్జించే అచ్చెన్నాయుడు ఇపుడు వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఆయన అరెస్ట్ తో ఉత్తరాంధ్రా నేతల్లో కొత్త భయం కనిపిస్తోంది. ఆ వరసలో మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా అరెస్ట్ కావాల్సిందే. కానీ కోర్టు నుంచి ఊరట దక్కడంతో తప్పించుకున్నారు.

సౌండేది…?

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలో చూసుకుంటే మిగిలిన నేతలు, మహా ఘనాపాటీలు ఉన్నా కూడా ఎవరూ పెద్దగా సౌండ్ చేయడంలేదు. ఓడిన తరువాత రోజునుంచే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇవి మన రోజులు కావంటూ రాజకీయ తెలివిడితో ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక విజయనగరం బొబ్బిలి రాజావారు సుజయ క్రిష్ణ అయిపూ అజా లేకుండా ఉన్నారు. పూసపాటి రాజు అశోక్ గజపతిరాజుకు ఆస్తులు, వారసత్వ వివాదాలు ఎక్కువయ్యాయి. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రులు ఉన్నా వారంతా తమ శక్తిని తామే తగ్గించేసుకుని స్వీయ విరామం ప్రకటించేసుకున్నారు. దీంతో టీడీపీ కాడె మోసేది ఎవరు అన్న పెద్ద ప్రశ్న పార్టీలో వినిపిస్తోంది.

వద్దంట……

ఇక పార్టీ పదవులు పంచుతాం, సమర్ధులకు అవకాశం ఇస్తామనని తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు పిలుస్తున్నా ఒక్క తమ్ముడూ పలకడంలేదు, పైగా మాకెందుకీ పదవులు అంటూ వైరాగ్యం ప్రకటిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండడం అంటేనే ఖర్చుల మారి వ్యవహారం. ఇక పార్టీ పదవిలో కుదురుకుంటే డబ్బు ఖర్చు తప్ప సుఖం ఉండదని పసుపు తమ్ముళ్ళు లెక్కలు వేస్తుకుంటున్నారు. మరో వైపు వైసీపీ రాజకీయంగా దూకుడుగా ఉంది. దాంతో ఎందుకొచ్చిన తంటా అని తగ్గిపోతున్న వారే ఎక్కువగా టీడీపీలో కనిపిస్తున్నారు.

కష్టమేగా….?

తెలుగుదేశంలో చూసుకుంటే మంచి నేతలు ఉన్నా వారంతా ఇపుడు చాలా కామ్ గా ఉన్నారు. నోరున్న అయ్యన్న, అచ్చెన్నల గతి చూశాక తమకెందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు. పార్టీకి ఇపుడు గడ్డు రోజులు నడుస్తున్నాయి, వైసీపీ మీద వ్యామోహం పోలేదు కాబట్టి గమ్మునుండడమే బెటర్ అనుకుంటున్నారు. ఈ సన్నివేశం చూస్తూంటే 1983లో తెలుగుదేశం అధికారంలోకి రావడం, ఎన్టీయార్ ప్రభంజనం చూసిన కాంగ్రెస్ నేతలు ఇళ్ల నుంచి బయటకు ఏడాది రెండేళ్ల పాటు రాలేదు, సరిగ్గా టీడీపీలో అదే సీన్ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కూడా అవశాన దశలోకి వచ్చిందా అన్న డౌట్లు వస్తున్నాయి.

Tags:    

Similar News