బాలయ్య ను అందుకే పక్కన పెట్టారటగా?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి వెర్సెస్ బాలకృష్ణ నడుమ ఆధిపత్య పోరు ఈనాటిదేమీ కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ రెండు గ్రూప్ ల నడుమ టీ కప్పులో [more]

Update: 2020-05-29 13:30 GMT

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి వెర్సెస్ బాలకృష్ణ నడుమ ఆధిపత్య పోరు ఈనాటిదేమీ కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ రెండు గ్రూప్ ల నడుమ టీ కప్పులో తుఫాన్ లు వచ్చి పోతుంటాయి. తాజాగా కూడా అదే తీరులో తనను గుర్తించలేదనే అంశాన్ని మనసులో పెట్టుకున్న బాలయ్య తనదైన పంచ్ డైలాగ్ లను కొద్ది రోజుల ముందు విసిరి నిప్పు రాజేశారు. తాజాగా కూడా మరోసారి పరిశ్రమ అంశాలను మరోసారి ప్రస్తావించి పాత గొడవ పైకి లేపారు. మంత్రి తలసాని తో సినీ ప్రముఖుల భేటీ రియల్ ఎస్టేట్ కోసమే అంటూ తొలిగా చేసిన ఆయన వ్యాఖ్యలే ఇప్పుడు మంటలు రేపుతున్నాయి.

పలు సందర్భాల్లో ఇదే తీరు …

బాలకృష్ణ ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఎవరికి తెలియదు. ఇక అభిమానులను ఆయన డీల్ చేసే విధానం రెండు మూడు రోజులు ఛానెల్స్ లో సోషల్ మీడియా లో బాగా ట్రోల్ అవుతూ ఉండటం రివాజు గానే వస్తుంది. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి కడుపైనా చేయాలంటూ ఒక కార్యక్రమంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు టిడిపికి సైతం తలనొప్పిని తెప్పించింది. దాన్ని కవర్ చేసుకునేలోగా ఆయన సినిమా ఫంక్షన్ లలో రాజకీయ కార్యక్రమాల్లో అభిమానుల చెంపలు చెళ్లుమనిపించేవారు. ఇక పాత విషయాలకు వస్తే సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు సైతం చేసి మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యుల రిపోర్ట్ తో కేసు నుంచి గట్టెక్కారు ఆయన. స్వయంగా తన బావ ముఖ్యమంత్రి గా ఉండటం, తండ్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం బాలయ్య హీరో కావడంతో ఆయనకు ఆడింది ఆట పాడింది పాట గానే రోజులు నడుస్తున్నాయి.

చిరంజీవి కి మైలేజ్ వస్తుందనే …

లాక్ డౌన్ కారణంగా అన్నిటిలాగే సినీ పరిశ్రమ కూడా షట్ డౌన్ అయ్యింది. ఈ పరిశ్రమ పై ఆధారపడిన వేలమందిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి తొలిగా నడుం కట్టారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారినుంచి నిధి సేకరించి పేద కళాకారులకు చేయూత అందించారు. వాస్తవానికి నందమూరి తారక రామారావు వారసునిగా బాలకృష్ణ ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవాలి. కానీ ఆయన తన వంతు విరాళం ప్రకటించి మిన్నకుండి పోయారు. చిరంజీవి ఇక్కడితో ఆగలేదు.

ఏదో చేద్దామని …

లాక్ డౌన్ లో ఆంక్షలు సడలిస్తూ వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కూడా జాగ్రత్తలు పాటిస్తూ తమ పని తాము చేసుకుంటూ పోతుందని అనుమతి కోసం ముందుగా కొందరి పెద్దలతో తన ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసి ప్రయత్నం ఆరంభించారు. ఈ సమావేశానికి బాలయ్యను ఆహ్వానించలేదు. నాగార్జున వంటి హీరోలు కొందరు దర్శకులు నిర్మాతలు హాజరు అయ్యారు. ఆ తరువాత ఈ బృందం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో భేటీ అయ్యి అక్కడినుంచి టి సిఎం కెసిఆర్ ను కలిసింది. ఇక్కడికి బాలకృష్ణ కు ఆహ్వానం లేదు.

కావాలనే పక్కన పెట్టారని …

అయితే ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టిన వ్యవహారం అయితే కాదు అన్నది కొందరి నిర్మాతల మాట. పవర్ లో టిడిపి నే ఉంటే బాలకృష్ణ నే ఉపయోగించేవారమని ఎవరిని ఎప్పుడు వాడుకుని అందరికోసం పని పూర్తిచేయాలి తమకు తెలుసునని టాలీవుడ్ పెద్దల మాట. అది నిజం కూడా. కానీ బాలకృష్ణ ఈ ఎపిసోడ్ లో హర్ట్ అయ్యారు. కావాలనే దెబ్బకొట్టారనుకుని నోటికొచ్చిందల్లా వాగేశారు. ఒక పక్క చిరంజీవి రెండోపక్క తలసాని లను టార్గెట్ చేసేసారు. దీనికి జవాబు చెప్పకపోతే ఆయన మరింత చెలరేగే ప్రమాదం ఉందని గుర్తించి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు బయటకు వచ్చి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని క్షమించమని అడగాలని బాలయ్యను డిమాండ్ చేశారు. ఇది విషయాన్ని మరింత సీరియస్ చేసేసింది.

లేపాక్షి ఉత్సవాల సమయంలో …

తన నియోజకవర్గంలోని లేపాక్షి ఉత్సవాల సమయంలో బాలకృష్ణ సినీ పరిశ్రమ పెద్దలనందరిని పిలిచినా చిరంజీవిని కావాలనే పిలవలేదు. ఆయన్ను ఎందుకు పిలవలేదంటే విచిత్రమైన సమాధానం ఇచ్చారు కూడా. కొందరిని పక్కన పెట్టుకుని పెద్దవాడిని కావాలిసిన అవసరం లేదన్నారు. ఈ నిర్ణయం తన సొంతమని డిక్టేటర్ లా తీసుకున్నా నంటూ వ్యాఖ్యానించారు. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా మెగాస్టార్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారు ఆయన.

చిరు మాత్రం అందరివాడుగా …

బాలకృష్ణ ధోరణి అలావుంటే చిరంజీవి మాత్రం భిన్నమైన చర్యలతో అందరివాడుగా ఉండేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. హుద్ హుద్ తుఫాన్ బాధితుల సాయం కోసం ఏర్పాటైన కార్యక్రమంలో బాలకృష్ణ తో పాటు పాల్గొనడం ఆయన భేషజం చూపలేదు. ఇక బాలయ్య శాతకర్ణి చిత్రం ఫంక్షన్ కి ఆహ్వానించినా వెళ్ళి ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. కట్ చేస్తే ఆ తరువాత మళ్ళీ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ల యుద్ధానికి అప్పుడు ఇప్పుడు నాగబాబు ఆజ్యం పోశారు. చాలా కాలం ఇద్దరి హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయారు కూడా.

దాసరి పాత్ర కోసం మెగా తపన …

అయితే మెగాస్టార్ మాత్రం ఇటీవల ఇండస్ట్రీలో దివంగత దాసరి నారాయణ రావు పాత్రను పోషించాలని తపన పడుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం రంగంలోకి దిగి పరిష్కారం కోసం తాపత్రయ పడుతున్నారు. ఇదంతా బాలకృష్ణ కు నచ్చడం లేదని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. తనకు ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ధోరణి తోనే ఆయన వ్యవహారం సాగుతుంది. అయితే పరిశ్రమ కష్టాలపై ఏనాడు బాలకృష్ణ యాక్టివ్ గా స్పందించకపోవడంతో ఆయనను తాజాగా కూడా పరిశ్రమ వర్గాలు పక్కన పెట్టేశాయి. అదే ఇప్పుడు ఇంతటి రాద్ధాంతానికి రీజన్ అయ్యింది.

అనడం అనిపించుకోవడం అలవాటే …

అయితే తాజా వివాదం కూడా కొద్ది రోజులు టివి చర్చలకు పరిమితం అయి చల్లారిపోతుందని అంతా భావిస్తున్నారు. బాలకృష్ణ వైఖరిని మాత్రం మెజారిటీ వర్గాలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. చేసేదేమి లేకపోయినా బురదజల్లడం తిరిగి జల్లించుకోవడం ఆయనకు అలవాటు అయిపోయిందని విమర్శలు ఇప్పుడు బాగా ఆయనపై పెరిగిపోయాయి. అయితే ఆయన దీనితో తనవ్యవహారం మార్చుకుంటారని ఎవరు భావించడం లేదు. ఎందుకంటే ఆయన బాలకృష్ణ కాబట్టి అంటున్నారు అంతా.

Tags:    

Similar News