‘మూడ్’ తాత్కాలికమేనా?

రాజకీయ నాయకులకు లభిస్తున్న ప్రజాదరణ తీరుతెన్నులపై తాజాగా వెలువడిన ఇండియా టుడే సర్వే చేదు నిజాలను బయటపెట్టింది. ప్రధానమంత్రితో పాటు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ ప్రజల్లో పలుకుబడి [more]

Update: 2021-08-19 05:00 GMT

రాజకీయ నాయకులకు లభిస్తున్న ప్రజాదరణ తీరుతెన్నులపై తాజాగా వెలువడిన ఇండియా టుడే సర్వే చేదు నిజాలను బయటపెట్టింది. ప్రధానమంత్రితో పాటు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన సంగతి తేటతెల్లమైంది. కరోనా విపత్తు ఇందుకు ఒక కారణం. కోట్టాది ప్రజలు జీవనోపాధి కోల్పోయి దుర్భరంగా గడుపుతున్నారు. సంక్షోభ సమయంలో తాము చాలా చేశామని పాలకులు చెబుతున్నారు. కానీ సామాన్యులు అలా భావించడం లేదు. అందుకే నేతల రేటింగు దారుణంగా పడిపోయింది. మోడీ, జగన్ వంటి అత్యంత ఆదరణ కలిగిన నాయకులకు ఈసారి సర్వేలో ఎదురుదెబ్బలు తప్పలేదు. నమూనాల సంఖ్య తక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదని సర్దిచెప్పుకోవచ్చు. కానీ సామాన్యుల మూడ్ కు శాంపిల్ కచ్చితంగా అతికినట్లు సరిపోతోంది. గతంలో ఇవే సర్వేలు ఈ నాయకులకు అగ్రపీఠం కట్టబెట్టాయి. ఇప్పుడు అవే సర్వేలు ప్రజలు తిరస్కరిస్తున్నారంటున్నాయి. నాయకులు పబ్లిక్ మూడ్ తెలుసుకుని మసలుకుంటే తమ లోపం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. దానిని సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం మించిపోలేదు.

ఆయినా నెంబర్ వన్…

గడచిన ఏడున్నర సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో తిరుగులేని నాయకుడు. హోదా రీత్యానే కాదు, ప్రజాకర్ణణలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన సర్వేలోనూ 60 శాతంపైగా ప్రజాదరణ అంచనాతో తనదరిదాపుల్లో మరెవరూ లేనంత ఆధిక్యత కనబరిచారు. కానీ ఏడు నెలల్లోనే గ్రాప్ దిగజారిపోయింది. మామూలుగా పడిపోలేదు. కనీసం ప్యాసు మార్కులు కూడా తెచ్చుకోలేని స్థితిలో 30 శాతం లోపునకు మోడీ విశ్వసనీయత ప్రజల్లో పలచనైపోయింది. అయినా బీజేపీ అదృష్టమేమిటంటే ఇంకా మోడీ సమీపంలో పోటీగా ఇతర జాతీయ నేతలెవరూ లేరు. మోడీకి పలానా వ్యక్తి ప్రత్యర్థి అని కూడా ప్రజలు ఎవరినీ గుర్తించడం లేదు. అదొక్కటే ఊరట. ఇతర నాయకులతో పోలిక తేకుండా చూస్తే మాత్రం అన్ని ప్రమాణాల్లోనూ మోడీ విఫలమైనట్లే. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఆయనను ఇమేజ్ ను అథ:పాతాళానికి తొక్కేసింది. గతంలో మాదిరిగా మన్ కీ బాత్ లు, రాజకీయ ఉపన్యాసాల పట్ల చెవి ఒగ్గి వినడం లేదు. అదే దిగజారుతున్న ప్రతిష్టకు పక్కా నిదర్శనం.

ఇంత చేస్తుంటే…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హవా సైతం తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యకరమే. వైసీపీ వర్గాలు దీనిని జీర్ణించుకోలేకపోతున్నాయి. స్థానిక ఎన్నికలు మొదలు అన్నిటా ఇటీవల తిరుగులేని ఆధిక్యం కనబరించింది వైసీపీ. అదంతా ముఖ్యమంత్రి కి ప్రజల్లో ఉన్న ఆదరణ ప్రతిఫలమే. ఇప్పటికీ కొత్త తరహా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నారు. రెండేళ్లక్రితం మొదలు పెట్టిన సంతర్పణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా సీఎం పట్ల ప్రజల్లో క్రమేపీ వైముఖ్యం పెరుగుతోందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు ఆధారాలు లేవని అధికారపార్టీ తిప్పికొడుతోది. కానీ పన్నుల పెరుగుదల, మౌలిక వసతుల్లో లోపాలు ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రభుత్వమంటే ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రే. అందువల్లనే సర్వేరేటింగ్ లో ఆయన బెంచ్ మార్కు దిగజారింది. న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు, వస్తున్న తీర్పులు, మీడియాలో వెల్లువెత్తుతున్న కథనాలు సైతం ప్రజల్లో ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. అది కూడా జగన్ ట్రాక్ రికార్డుకు గండి కొడుతున్నట్లుగానే చెప్పాలి.

లోపాలున్నాయ్…

సర్వే పక్కా ప్రామాణికమా? అంటే కాదనే చెప్పాలి. నమూనాల సంఖ్య అత్యల్పం. కేవలం నాలుగోవంతు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే ఈ అంచనాలు రూపొందించారు. మొత్తం పాల్గొన్నవారి సంఖ్య 14,500 మాత్రమే. ఒక మునిసిపల్ వార్డు స్థాయి ఓటర్ల సంఖ్య తో సరిపోతుంది. ఇంత పెద్ద దేశంలో 100 కోట్ల పైచిలుకు ఓటర్ల మనోభావాన్ని ఇంత స్వల్పమైన నమూనాతో సరిపోల్చి చెప్పేయడం సరైనది కాదనే వాదన ఉంది. అందులోనూ అధ్యయనం చేసేందుకు ఎంచుకున్న మెథడాలజీపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరి నుంచి ఫోన్ ఇంటర్వ్యూల ద్వారా, మరికొందరి నుంచి ఆన్ లైన్ లో అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. పైపెచ్చు ఈ సర్వేను ప్రచురించిన సంస్థ సొంత సిబ్బందితో కాకుండా అవుట్ సోర్సింగ్ నే నమ్ముకుంది. ఆ సర్వే సంస్థ ఆర్థిక వ్యవహరాలపై అనేక రకాల ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జనరల్ గా పబ్లిక్ లో నెలకొని ఉన్న మూడ్ కు భిన్నంగా లేకపోవడంతో రాజకీయ పార్టీలు భుజాలు తడుముకుంటున్నాయి. ఈ ట్రెండ్ తాత్కాలికమా? మళ్లీ నాయకులు జనాదరణలో పుంజుకోగలరా? అంటే సమాధానం దొరకదు. సాధారణ ప్రజలు పాలకుల విజయాలు, వైఫల్యాలను లెక్కించి మరీ తమ అభిప్రాయాలు చెప్పరు. తమ జీవనం సాఫీగా సాగిపోతుంటే అంతా బాగుందని చెబుతారు. తాము జీవన గమనంలో ఎదురీతను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు పాలకుల వైపు చేయి చూపుతారు. ఇప్పుడు అగ్రనాయకులకు అతితక్కువ రేటింగ్ రావడానికి కారణం ప్రజలు నిత్య సంఘర్షణలో ఉండటమే కారణం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News