Congress : మళ్లీ గాంధీభవన్ కే పరిమితం చేయాలనేనా?

కాస్త పార్టీ ముందుకు వెళితే వెనక్కు లాగడం కాంగ్రెస్ పార్టీలో షరా మామూలే. అధికారాన్ని కోల్పోయి పదేళ్లవుతున్నా నేతలకు మాత్రం కలసి విజయం కోసం ప్రయత్నిద్దామన్న తాపత్రయం [more]

Update: 2021-10-01 09:30 GMT

కాస్త పార్టీ ముందుకు వెళితే వెనక్కు లాగడం కాంగ్రెస్ పార్టీలో షరా మామూలే. అధికారాన్ని కోల్పోయి పదేళ్లవుతున్నా నేతలకు మాత్రం కలసి విజయం కోసం ప్రయత్నిద్దామన్న తాపత్రయం లేదు. తెలంగాణ కాంగ్రెస్ కు అధికారమిచ్చినా ఎక్కువ కాలం ప్రభుత్వం ఉండదన్న సంకేతాలను ప్రజల్లోకి ఆ పార్టీ నేతలే పంపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపునకు వెళ్లడమే ఇందుకు కారణం.

కొంత పుంజుకుంటుందన్న…..

ఇక తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత పార్టీ పరిస్థితి మెరుగుపడిందనే చెప్పాలి. గతంలో లేని విధంగా కాంగ్రెస్ క్యాడర్ రోడ్లమీదకు వస్తుంది. అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటుందని గుర్తించేలా పార్టీ కార్యక్రమాలు ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ట్వీట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార టీఆర్ఎస్ లో కొంత కంగారును పుట్టిస్తున్నాయి.

విభేదాలు తీవ్ర స్థాయిలో….

అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య కూడా విభేధాలు తీవ్రమయ్యాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించేందుకు సీనియర్ నేతలు ఇష్టపడటం లేదు. తమను సంప్రదించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. మధుయాష్కి, గీతారెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు బహిరంగంగానే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. మరికొందరు నేతలు పరోక్షంగా రేవంత్ రెడ్డికి సహకారం అందించడం లేదు.

ఇదే పరిస్థితి కొనసాగితే…?

కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మూడోసారి కూడా ప్రజలు అధికారానికి దూరంగా పెట్టే అవకాశముంది. ఇలా పార్టీలోనే విభేదాలతో సతమతమవుతుంటే ఇక రాష్ట్రాన్ని ఏం ఏలతారన్న సందేశాన్ని వీరు ప్రజల్లోకి పంపేశారు. ఇప్పటికే డ్యామేజీ అయిన పార్టీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే కష్టమే. అలాంటి పరిస్థితుల్లో నేతలు రోడ్లమీద పడి పార్టీ పరువు తీస్తుంటే మరోసారి పార్టీని గాంధీ భవన్ కే పరిమితం చేస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Tags:    

Similar News