ట్రీట్ మెంట్ లేకుంటే…?

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఓటమి నుంచి పార్టీ ఇంకా కోలుకోనేలేదు. అయితే, [more]

Update: 2019-08-16 05:00 GMT

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఓటమి నుంచి పార్టీ ఇంకా కోలుకోనేలేదు. అయితే, ఇంతలోనే అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువు బజారున పడుతోంది. కాపు నాయకులు ఒక వర్గం క‌ట్టగా, క‌మ్మ వ‌ర్గం కూడా పార్టీలో ఉండి ఏం లాభం అనుకునే పరిస్థితి తలెత్తింది. దీంతో అసలు ఓడిపోయినప్పటికీ.. పార్టీలో ఇన్ని క‌ల‌హాల‌కు కారకులు ఎవరు? ఎందుకు? అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి పార్టీలకు గెలుపు, ఓటములు సహజం. ఓడినంత మాత్రాన ఆయా పార్టీలకు ఇక భ‌విత‌వ్యం లేదు అని అనుకుంటే.. నేడు వైసీపీ అధికారంలోకి వచ్చేది కూడా కాదు.

ఆధిపత్యం కోసం….

కానీ, ఈ చిన్న సూత్రాన్ని అర్థం చేసుకోవడంలో టిడిపి నేతలు తడబడుతున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టిడిపి అంతర్గత కలహాలతో అట్టుడుకుతోంది. సీనియర్లను జూనియర్లు బతిమాలే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు, కమ్మలు పార్టీలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. కాపు నేత‌లంతా క‌ట్ట‌క‌ట్టి బాబుపై ఒత్తిడి తెచ్చే ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. కాపుల్లో చాలా మంది లోకేష్ నాయ‌క‌త్వాన్ని త‌ప్పుప‌డుతున్నారు. అధికారంలో ఉండగా.. తమకు ఏమాత్రం విలువ ఇవ్వలేదని కాపు నాయకులు ఉసూరు మంటున్నారు. అయితే, ఆ కోపాన్ని, తాపాన్ని ఆనాడే వారు టీడీపీ అధినేతగా ఉన్న అప్పటి సీఎం చంద్రబాబు ముందు ఆనాడే ప్రదర్శించి ఉంటే ప్రయోజనం ఉండేది.

ఆనాడు మౌనంగా….

అయితే వీరంతా ఆనాడు మౌనం వహించారు. అంతేకాదు, తమ రిజర్వేషన్ విషయంపై ఆనాడు అధినేతకే పూర్తిగా పగ్గాలు అప్పగించిన వారు ఇప్పుడు అంతర్గత చర్చల్లో మాత్రం బాబును తప్పు పడుతున్నారు. ఆనాడే ఆయనతో చర్చించి ఉంటే సమస్య పరిష్కారం మరో రూపంలో ఉండేది. కానీ, నేడు టీడీపీ ఓడిపోయిన దరిమిలా అధినేతకు అందకుండా.. ముభావంగా ఉండడంతో వారు సాధించేది ఏమిటనే ప్రశ్న సశేషంగా మారిపోయింది. ఇక, చంద్రబాబు హయాంలో అన్ని తామై వ్యవహరించిన కమ్మ వర్గానికి చెందిన నాయకులు కూడా మౌనం వహిస్తున్నారు.

ప్రయోజనం పొందిన వారే….

నిజానికి చంద్రబాబు నుంచి పదవులు, కాంట్రాక్టులు సైతం పొందిన నాయకులు ఇప్పుడు ఓట‌మి తర్వాత ముఖం చాటేశారు. అధినేత మీటింగులు పెట్టినా మౌనం వహిస్తున్నారు. కమ్మ వర్గానికే చెందినప్పటికీ.. తమకు కాకుండా వేరే వారికి పదవులు ఇచ్చారని, ఇతర పార్టీల నుంచి కూడా వలసలను ప్రోత్సహించి, తమకు అన్యాయం చేశారనే బాధ, ఆవేదన వీరిలో ఇప్పటికీ పోవడం లేదు. అయితే, అప్పట్లోనే ఈ విషయాన్ని చర్చించి ఉంటే.. బాగుండేది. కానీ, ఆనాడు నోరు మెదిపేందుకు కూడా సహించలేక పోయిన‌ ఈ నాయకులు ఇప్పుడు ఓడిన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించడం మానేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటల‌కు, అధినేతపై విమర్శలకు ప్రయత్నించడం ద్వారా సాధించేది ఏంటో వీరికీ తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఎలాంటి ట్రీట్‌మెంట్‌తో వీళ్లను ఒకే తాటిమీద‌కు తీసుకువ‌చ్చి పార్టీని బలోపేతం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News