రాజంపేటలో జగన్ ఫార్ములా ఇదే..?

ఈ ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈ ఎన్నికల్లో చేయొద్దనుకుంటున్నారు. అందుకే [more]

Update: 2019-01-24 03:30 GMT

ఈ ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈ ఎన్నికల్లో చేయొద్దనుకుంటున్నారు. అందుకే ఎటువంటి మొహమాటాలు లేకుండా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పక్కా వ్యూహంతో అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒక్క అభ్యర్థిని ఫైనల్ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలోనూ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బలమైన నాయకులను, ఎటువంటి పేచీ లేకుండా సీట్లు కేటాయించే పరిస్థితి ఉంటేనే పార్టీలో చేర్చుకుంటున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని వైసీపీ గూటిలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అర్థికంగా బలంగా ఉండటంతో పాటు ప్రజల్లోనూ పట్టున్న నేత. అందుకే ఆయనను వైసీపీలో ఆహ్వానించారు. అయితే, ఆయనకు రాజంపేట సీటు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒకరిని ఎంపీగా పంపించాలని…

జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని మల్లికార్జున్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఆయనకు తన సిట్టింగ్ స్థానమైన రాజంపేట అసెంబ్లీ టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి లేదా ఆయన సోదరుడు రఘునాథరెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో అక్కడి నుంచి వైసీపీ తరపున పోటీచేసిన ఆకేపటా అమర్ నాథ్ రెడ్డి మళ్లీ బరిలో ఉండాలనుకుంటున్నారు. ఆయన ఓడినా నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. మొదటి నుంచీ ఆయన జగన్ వెంటే ఉన్నారు. దీంతో అమర్ నాథ్ రెడ్డిని జగన్ కాదనే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో మేడా సోదరుల్లో ఒకరిని లేదా అమర్ నాథ్ రెడ్డిని రాజంపేట లోక్ సభ అభ్యర్థిగా నిలబెడతారంటున్నారు. గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు.

తంబళ్లపల్లి బరిలో మిథున్..?

జగన్ కి సన్నిహితుడైన మిథున్ రెడ్డిని అసెంబ్లీ బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నుంచి ఆయనను పోటీలో నిలిపే అవకాశం ఉందంటున్నారు. అక్కడ కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఓడిపోయాక పార్టీలో క్రియాశీలంగా లేరు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబమే అక్కడి బాధ్యతలూ చూస్తోంది. మిథున్ రెడ్డి బాబాయ్ ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. దీంతో మిథున్ రెడ్డిని తంబళ్లపల్లి నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందంటున్నారు. అలా చేసి అమర్ నాథ్ రెడ్డి, మేడా సోదరుల్లో ఒకరికి రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఇవ్వాలనేది జగన్ వ్యూహమని తెలుస్తోంది. ద్వారకానాథ్ రెడ్డికి చిత్తూరు జిల్లాలోనే మరో స్థానం ఇవ్వడమో లేదా ఇతర హామీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి రాజంపేటలో బలమైన నేతను చేర్చుకోవడం ద్వారా పట్టు పెంచుకోవడంతో పాటు పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టకుండా జగన్ ఈ వ్యూహం రచించారని తెలుస్తోంది.

Tags:    

Similar News