జగన్ ని బుక్ చేసినట్లేనా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టీడీపీ, [more]

Update: 2019-01-18 03:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టీడీపీ, వైసీపీ నేతలు మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రజలు సైతం జరుగుతున్న రాజకీయాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఇక, జగన్ – కేటీఆర్ భేటీకి ముందు నుంచే టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు ప్రారంభించారు. భేటీ జరిగిన తర్వాత మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, ఇలా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని, జగన్ ఆంధ్రా ద్రోహి అని ముద్ర వేసే ప్రయత్నం టీడీపీ బాగానే చేస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రంగంలోకి దిగి మంత్రులతో ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించారు. కేసీఆర్ కి, కేసీఆర్ తో జగన్ కలుస్తున్నందున ఆయనకు వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్ ను తీసుకురావాలని టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ తో పొత్తు ద్వారా ఆంధ్రాపై పెత్తనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనేది టీడీపీ వాదన. ఇక, ఏపీలో డమ్మీ సీఎం ఉండాలనేది మోదీ, కేసీఆర్ కుట్ర అనేది టీడీపీ మరో ఆరోపణ.

పోత్తు ప్రశ్నే ఉండదుగా…

ఇందుకు తగ్గట్లుగానే టీడీపీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రిక ఏకంగా టీఆర్ఎస్ తో వైసీపీ పొత్తు కుదిరింది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, అసలు పొత్తు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ ఎక్కడ ఉందనేది వైసీపీ నేతల సమాధానం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అయిన పార్టీ. ఏపీలో ఆ పార్టీ లీడర్లు కానీ, క్యాడర్ కానీ లేనే లేరు. కేసీఆర్ కి వ్యక్తిగతంగా కొంతమంది అభిమానులు ఉండవచ్చు. అలాగే ధ్వేషించే వాళ్లు ఉండవచ్చు. కానీ ఏపీలో లేని పార్టీతో వైసీపీ పొత్తు ఎలా పెట్టుకుంటుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ కలిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత ఏమాత్రం రాకపోగా కొంత సానుకూలతే వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అందుకే టీడీపీ నేతలు ఫ్రంట్ కంటే కూడా టీఆర్ఎస్ తో జగన్ కలిసిపోయారు, పొత్తు పెట్టుకున్నారు అనే వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

తెలంగాణలో జరిగిందే వేరు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయని కొందరు భావిస్తున్నారు. కేసీఆర్ ఎలాగైతే చంద్రబాబును బూచిగా చూపి తెలంగాణ ఎన్నికల్లో లాభపడ్డారో ఏపీలోనూ అదే ఫార్ములాను టీడీపీ అమలు చేయాలనుకుంటున్నట్లు ఉంది. అయితే, ఇక్కడ చాలా తేడా కనిపిస్తుంది. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేసే అవకాశమే లేదు. కేవలం జగన్ వద్దకు వెళ్లి చర్చలు మాత్రమే జరపనున్నారు. జగన్ వద్ద కేసీఆర్ వెళ్లడం ద్వారా జగన్ కి ప్రాధాన్యత పెరిగినట్లే కానీ తగ్గినట్లు కాదు. కానీ, తెలంగాణలో జరిగింది వేరు. అక్కడి ఎన్నికలకు ముందే చంద్రబాబు.. రాహుల్ ను కలవడం, కాంగ్రెస్ చంద్రబాబుకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం, టీకాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలనుకోవడం, మీడియా కూడా చంద్రబాబును హైలెట్ చేయడంతో కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా ఎన్నికలు మారిపోయాయి. దీంతో ‘చంద్రబాబు పెత్తనం అవసరమా’ అంటూ టీఆర్ఎస్ వాదనను ప్రజలు నమ్మారు. రాహుల్, చంద్రబాబు వెనకాల టీకాంగ్రెస్ ముఖ్యనాయకులు నిలబడ్డ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

జగన్ ‘డమ్మీ’ అంటే నమ్ముతారా..?

ఇక, ఏపీలో డమ్మీ ముఖ్యమంత్రి ఉండాలనేది కేసీఆర్ కుట్ర అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే, జగన్ ఒక డమ్మీ అంటే ప్రజలు నమ్ముతారా అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే జగన్ కోపిష్ఠి, గర్విష్టి, ఎవరి మాటా వినరు, ఆయనది నియంతృత్వం, మొండి వైఖరి అంటూ టీడీపీనే గతంలో ప్రచారం చేసింది. ఇన్ని గుణాలు ఉన్న జగన్ డమ్మీ అంటే ప్రజలు నమ్ముతారా..? ఇక, కేసీఆర్ కేవలం జగన్ ని మాత్రమే కలుస్తున్నారా..? ఇప్పటికే ఆయన మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కుమారస్వామి, స్టాలిన్ వంటి వారిని కూడా కలిశారు. వారితో పాటు జగన్ ను కలుస్తున్నారు. ఈ విషయాన్ని కూడా వైసీపీ ప్రజల్లోకి తీసుకెళుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు అనే ప్రశ్నే ఉండదని ఆ పార్టీ అంటోంది. ఇక, ఫెడరల్ ఫ్రంట్ లో చేరినట్లు కూడా జగన్ ఇంకా చెప్పలేదు. కేవలం ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, కేసీఆర్ తో చర్చించి, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి జగన్ – కేటీఆర్ భేటీ ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News