మాండ్యానే మంటపెడుతుందా…?

కర్ణాటకలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు సంకీర్ణ సర్కార్ కు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ కలసి పోటీ చేయాలని జనతాదళ్ ఎస్, [more]

Update: 2019-02-25 16:30 GMT

కర్ణాటకలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు సంకీర్ణ సర్కార్ కు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ కలసి పోటీ చేయాలని జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే జనతాదళ్ ఇప్పటికే 12 స్థానాలు కోరుతుండగా, అందులో ఆరు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉంది. అయితే ఇందులో మాండ్య నియోజకవర్గం రెండు పార్టీల మధ్య కాకరేపేలా ఉంది.

పట్టున్న నియోజకవర్గం కావడంతో…..

మాండ్య పార్లమెంటు నియోజకవర్గం జనతాదళ్ ఎస్ కు పట్టున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి తన మనవడు నిఖిల్ ను బరిలోకి దించాలనుకున్నారు దళపతి దేవెగౌడ, తాము ఖచ్చితంగా గెలిచే సీటు కావడంతో ఆయన మాండ్య నియోజకవర్గాన్ని తప్పకుండా పొత్తులో భాగంగా కోరుకుంటారు. మాండ్యతో పాటు హాసన్, బెంగుళూరు ఉత్తర నియోజకవర్గాల నుంచి తన కుటుంబ సభ్యుల చేత పోటీ చేయించాలని దేవెగౌడ భావిస్తున్నారు. భావించడమే కాదు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు.

సుమలత సై అనడంతో…..

అయితే ఇప్పుడు సినీనటుడు దివంగత అంబరీష్ సతీమణి, సినీనటి సుమలత్ ఎంటర్ కావడంతో మాండ్య నియోజకవర్గంపై పీటముడి పడిందనే చెప్పాలి. సుమలత తాను మాండ్య పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నారు. తన భర్త అంబరీష్ కాంగ్రెస్ వాదిగానే ఉండటతో ఆమె కూడా కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.

ఏ పార్టీ నుంచి…..

ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశీస్సులు కూడా సుమలత తీసుకున్నారు. మాండ్యను తమకు వదిలేయాని కాంగ్రెస్ కోరనుంది. అయితే మాండ్య ను వదులుకునేందుకు దేవెగౌడ, కుమారస్వామిలు ఇష్టపడటం లేదు. అలాగని అంబరీష్ కుటుంబానికి అన్యాయం చేసేందుకు కూడా సుముఖంగా లేరు. తమ పార్టీ నుంచి బరిలోకి దిగాలని సుమలతను జేడీఎస్ కోరే అవకాశముంది. అయితే ఇందుకు సుమలత అంగీకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ సమ్మతిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద మాండ్య నియోజకవర్గం రెండు పార్టీల మధ్య మంట రేపుతుందన్న చర్చ ఇరు పార్టీల్లోనూ జరుగుతుంది.

Tags:    

Similar News