పాపం.. పూర్ ఫెలో.. పడిగాపులేనా?

మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలు ముగిశాయి. ఉప ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. ఉప ఎన్నికల్లో గెలవడానికి జ్యోతిరాదిత్య సింధియా కారణమని చెప్పక [more]

Update: 2021-01-12 17:30 GMT

మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలు ముగిశాయి. ఉప ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. ఉప ఎన్నికల్లో గెలవడానికి జ్యోతిరాదిత్య సింధియా కారణమని చెప్పక తప్పదు. అయినా ఉప ఎన్నికలు పూర్తయి నెలరోజులు గడుస్తున్నా జ్యోతిరాదిత్య సింధియా కు ఏ పదవి దక్కలేదు. ఆయన సాధారణ రాజ్యసభ సభ్యుడిగానే ఉండిపోయారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాథ్యతలు అప్పగిస్తారని ఉప ఎన్నికలకు ముందు ప్రచారం జరిగినా అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు.

గ్రిప్ ఉన్న లీడర్….

జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో గ్రిప్ ఉన్న లీడర్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువనేత. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ లతో విభేదాలున్నా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉండేది. యువనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడంతో జ్యోతిరాదిత్య సింధియా హవా కాంగ్రెస్ లో నడిచేది. కానీ బీజేపీలో చేరి ఏడాది దాటుతున్నా ఆయన పరిధి నామమాత్రమే అయింది.

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి…..

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో గ్రూపు విబేధాలతో విసిగిపోయి బయటకు వచ్చారు. తన వెంట 22 మంది ఎమ్మెల్యేలను తెచ్చి బీజేపీలో చేర్చేశారు. ఫలితంగా మధ్యప్రదేశ్ లో ఉన్న కమల్ నాధ్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. వెంటనే బీజేపీ జ్యోతిరాదిత్య సింధియాకు రాజ్యసభ పదవి ఇచ్చింది. ఆయనను రాజ్యసభకు మాత్రమే పరిమితం చేయబోమని, ఉప ఎన్నికల తర్వాత ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటామని అప్పట్లో బీజేపీ కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఆ ఎన్నికల తర్వాతేనా?

కానీ ఉప ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులవుతున్నా ఆయనను పట్టించుకునే వారు లేదు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ పైనే బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు కన్పంచడం లేదు. దీంతో ఉప ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించి పెట్టిన జ్యోతిరాదిత్య సింధియా పదవి కోసం మరికొంతకాలం పడిగాపులు పడక తప్పదు.

Tags:    

Similar News