ఆపరేషన్ లోటస్ స్టార్టయింది

మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ లోటస్ ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. ఇక్కడ దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కు అందుబాటులో లేకుండా పోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ [more]

Update: 2019-11-25 17:30 GMT

మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ లోటస్ ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. ఇక్కడ దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కు అందుబాటులో లేకుండా పోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లే కన్పిస్తుంది. మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా సయితం ట్విట్టర్ అకౌంట్ నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడం ఇందుకు అద్దం పడుతోంది.

సింధియాను తొక్కేసేందుకు…..

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో గత కొంతకాలంగా జ్యోతిరాదిత్య సింధియాను తొక్కేసేందుకు తలపండిన నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కమల్ నాధ్, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ లు ఒక వర్గంగా ఏర్పడి జ్యోతిరాదిత్య సింధియాకు ఎక్కడకక్కడ చెక్ పెడుతున్నారు. దాదాపు ఏడాదికి పైగానే అన్నీ భరిస్తూ వస్తున్న జ్యోతిరాదిత్యా సింధియా పీసీసీ చీఫ్ పదవి విషయంలో జరుగుతున్న డ్రామాపై అసంతృప్తిగా ఉన్నారు.

ఎంత శ్రమించినా…..

మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచి కాంగ్రెస్ పవర్ లోకి రాగలిగిందంటే అందులో జ్యోతిరాదిత్య సింధియా పాత్ర కీలకమనే చెప్పాలి. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన నేత. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అయితే సీనియర్ నేత కమల్ నాధ్ సోనియా పైరవీతో పదవి తెచ్చుకున్నారు. అప్పటి వరకూ కేంద్ర రాజకీయాలు చేసిన కమల్ నాధ్ అధికారం రాగానే రాష్ట్రానికి వచ్చారు. జ్యోతిరాదిత్య సింధియాను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టమన్నా తిరస్కరించారు. తనకు ఆ పదవి అవసరం లేదని తెగేసి చెప్పారు.

బీజేపీకి అనుకూలంగా….

మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై గత కొద్ది రోజులుగా జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు చేస్తున్నారు. రైతు రుణమాఫీపై సింధియా చేసిన వ్యాఖ్యలు సంచలనమే అయ్యాయి. తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు. గత కొద్దికాలంగా జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్టికల్ 370పైన కూడా ఆయన బీజేపీని సమర్థించారు. మరి తాజా పరిణామాలు చూస్తుంటే ఆపరేషన్ లోటస్ మధ్యప్రదేశ్ లో స్టార్ట్ అయినట్లే కన్పిస్తుంది. 12 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ నేతలు హైరానా పడుతున్నారట.

Tags:    

Similar News