చెడితే ఎక్కువ నష్టం ఆయనకేనా ?

ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జల జగడం మీద అందరి చూపూ ఉంది. ప్రాణాధారం అయిన నీటి వివాదం కాబట్టి ఎవరూ తగ్గేట్లు లేరు. దీంతో [more]

Update: 2020-05-14 12:30 GMT

ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జల జగడం మీద అందరి చూపూ ఉంది. ప్రాణాధారం అయిన నీటి వివాదం కాబట్టి ఎవరూ తగ్గేట్లు లేరు. దీంతో ఇద్దరి స్నేహం ఏడాదికే కరిగిపోతుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజానికి కేసీఆర్, జగన్ ఎవరికి వారే నాయకులు. ఇద్దరూ ఎదురులేని నేతలు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయనకు వ్యూహాలు ఎక్కువ. జగన్ కి జనాదరణ పాలు ఆయన కంటే ఒకింత ఎక్కువ. ఇక ఏపీ వరకూ ప్రజల విషయంగా చూసుకుంటే కేసీఆర్ తో చెలిమి జగన్ కి పెద్దగా ఉపయోగం లేదు. పైగా కేసీఆర్ వల్లనే ఏపీ రెండు ముక్కలు అయిందన్న బాధ ఇప్పటికీ ఏపీ జనాల్లో ఉంది. దాంతో కేసీఆర్ తో వైరంగా ఉంటేనే ఏపీలో జగన్ కి ఏపీలో రాజకీయ మైలేజ్ ఎక్కువగా వస్తుంది.

అదీ లాభమే…..?

ఇక కేంద్రంలోని బీజేపీకి కేసీఆర్ మీద నమ్మకం తక్కువ. పైగా అయన్ని చంద్రబాబు టూ గా చూస్తారు. ఇక కేసీఆర్ వయసు రీత్యా, ఆయన ఆశల రీత్యా చూసుకున్నా కేంద్ర స్థాయిలోకి రావాలన్న తాపత్రయం ఉండడాన్ని కూడా బీజేపీ పెద్దలు గమనిస్తున్నారు. మరో వైపు కేసీఆర్ నేరుగా మోదీ మీద పలు మార్లు విమర్శలతో దాడి చేయడాన్ని కూడా ఢిల్లీ పెద్దలు గట్టిగానే పట్టించుకుంటున్నారు. అదే సమయంలో జగన్ కేసీఆర్ తో కలిస్తే దక్షిణాదిన ఎంతో కొంత బలం అవుతారన్న డౌట్లు కాషాయం పెద్దల్లో ఉన్నాయి. అందుకే జగన్ మీద కాస్తా ఉదారత చూపుతూ కేసీఆర్ నుంచి వేరు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇపుడు కేసీఆర్ కి దూరంగా జగన్ జరిగితే ఆయనకు బీజేపీ మద్దతు దక్కి ఆ విధంగా కూడా లాభిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి.

పొత్తు కుదరదే….

కేసీఆర్ పైకి బీజేపీ మీద విమర్శలు చేసినా లోపాయికారి రాజకీయాలు జగన్ ద్వారా కేంద్రంలో చేయిస్తారని అంటారు. కేంద్రం వద్ద అడగాల్సినవి, సాధించి తెచ్చుకోవాల్సినవి జగన్ ముఖంగానే ఎక్కువ డిమాండ్ చేయిస్తారని చెబుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో జగన్ కి కొంత సానుకూలత ఉండడాన్ని కేసీఆర్ అలా ఉపయోగించుకుంటారని చెబుతారు. అంటే ఓ విధంగా కేంద్రం ఆలోచనలు ఎప్పటికపుడు తెలుసుకోవడానికి జగన్ని మధ్యవర్తిగా కేసీఆర్ ఉపయోగించుకుంటారన్న ప్రచారం ఉంది. ఇపుడు ఆ జగన్ తో చెడితే ఆ లింక్ కట్ అవుతుంది. మరో వైపు చూసుకుంటే ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుతో కేసీఆర్ నేరుగా పొత్తు పెట్టుకోలేరు. ఒకవేళ కలిస్తే బాబు మార్క్ రాజకీయాలకు తట్టుకోలేమని కేసీఆర్ కి బాగా తెలుసు. పైగా తెలంగాణా సమాజంలో బాబుని విలన్ గా చూపిస్తేనే కేసీఆర్ రాజకీయ పంట పండుతుంది. దాంతో జగన్ బంధం వీడితే కేసీఆర్ కి ఈ విధంగా గరిష్ట నష్టమనే చెప్పాలి.

ఆ సామాజిక వర్గం….

ఇంకో వైపు చూసుకుటే తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం చాలా ఎక్కువ. వాళ్లే ఏళ్ళకు ఏళ్ళు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన చరిత్ర ఉంది. ఇపుడు విడిపోయిన తరువాత రెడ్లు రాజకీయంగా నలిగిపోతున్నారు. అయితే జగన్ తో దోస్తీ ద్వారా వివిధ జిల్లాల్లో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఓట్లను టీయారెస్ ఒడుపుగా తన వైపు తిప్పుకుంది. ఇపుడు జగన్ మూడవ కన్ను తెరిస్తే రెడ్ల మద్దతు కూడా టీఆర్ఎస్ కి ఒక్కసారిగా పడిపోతుంది. అదే అదనుగా చూస్తున్న కాంగ్రెస్ లోని రెడ్లు మళ్ళీ అధికారం కోసం కాలు దువ్వుతారు. ఈ రకమైన రాజకీయ సమీకరణలు చూసుకున్నపుడు జగన్ తో చెలిమి వల్ల కేసీఆర్ కి అన్ని విధాలుగా లాభాలే ఉన్నాయి. చెడితే ఎక్కువగా నష్టపోయేది మాత్రం కేసీఆర్ మాత్రమేనని చెప్పవచ్చునని విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News