డెడ్ లైన్ ముగుస్తున్నా…?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విధించిన డెడ్ లైన్ కు ఇక ఒకరోజు మాత్రమే గడువుంది. ఈలోపు ఆర్టీసీ కార్మికులందరూ విధుల్లో చేరిపోవాలని కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. [more]

Update: 2019-11-04 18:29 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విధించిన డెడ్ లైన్ కు ఇక ఒకరోజు మాత్రమే గడువుంది. ఈలోపు ఆర్టీసీ కార్మికులందరూ విధుల్లో చేరిపోవాలని కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. అయితే కేసీఆర్ ప్రకటించి రెండురోజులు గడుస్తున్నా కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దాదాపు 49 వేల మంది కార్మికులు సమ్మెలో ఉండగా, కేసీఆర్ అల్టిమేటంతో కేవలం 11 మంది మాత్రమే విధుల్లో చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి.

యూనియన్లే టార్గెట్…..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న యోచనలో లేనట్లుంది. చర్చల కన్నా ఆర్టీసీ యూనియన్లను దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకే యూనియన్లను కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. నవంబరు 5వ తేదీ అర్థరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరాలని, అలా చేరితే వారిని తమ బిడ్డలుగా భావించి ఆదరిస్తామని చెప్పారు. అప్పటికే ఐదు వేల రూట్లకు పర్మిట్లు ఇచ్చామని తెలిపిన కేసీఆర్, కార్మికులు చేరకుంటే మిగిలిన రూట్లనుకూడా ప్రయివేటు పరం చేస్తామని హెచ్చరించారు.

వార్నింగ్ లను డోన్ట్ కేర్….

అయితే కేసీఆర్ హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ బెదిరింపులకు తలొగ్గితే భవిష్యత్తు ఆర్టీసీకి ఉండదని కార్మిక నేతలు భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ ప్రకటన తర్వాత వారు డిపోల వారీగా కార్మికులతో సమావేశమై సమస్య తీవ్రతపై చర్చించారు. కీలక సమయంలో వెనక్కు తగ్గితే ఇక కోలుకోలేమని, యాజమాన్యం చేతుల్లో నలిగిపోవాల్సి వస్తుందని అటూ ఇటూ ఊగిసలాటలో ఉన్న కార్మికులకు నచ్చ చెప్పగలిగారు.

కోర్టుపైనే విశ్వాసం…..

సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. అంతేకాకుండా కేసీఆర్ కు యూనియన్లు ఒక అవకాశం కూడా ఇచ్చాయి. చర్చలు జరిపితే కొన్ని డిమాండ్లను వెనక్కు తీసుకుంటామని కూడా చెప్పాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. చర్చలు జరపకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. మొత్తం మీద ఆర్టీసీ సమ్మెకు తెలంగాణలో ఇప్పట్లో తెరపడే అవకాశాలు లేనట్లే కనపడుతుంది.

Tags:    

Similar News