కేసీఆర్ కి హ్యాట్రిక్ విక్టరీ ఖాయం ?

కేసీఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారని పేరు. అదే విధంగా ఎక్కడ తగ్గాలో మరెక్కడ నెగ్గాలో కేసీఆర్ కి తెలిసిననంతగా ఎవరికీ తెలియదు. [more]

Update: 2021-05-11 09:30 GMT

కేసీఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారని పేరు. అదే విధంగా ఎక్కడ తగ్గాలో మరెక్కడ నెగ్గాలో కేసీఆర్ కి తెలిసిననంతగా ఎవరికీ తెలియదు. ఢిల్లీ రాజకీయాలను బట్టి కేసీఆర్ తెలంగాణా రాజకీయాలను సెట్ చేస్తారని కూడా అంటారు. ఇక కేసీఆర్ ఇప్పటికి రెండు సార్లు గెలిచి మొనగాడు అనిపించుకున్నారు. వరసగా విజయాలు సాధించిన వారి జాబితాలో చేరారు.

వాళ్ళే మిత్రులు …

రాజకీయాల్లో మిత్రులను నిర్వచించడం బహు కష్టం. అలాగే శత్రువులను కూడా కనిపెట్టి ఫలానా అని చెప్పలేం. ఎందుకంటే ప్రత్యర్ధి శిబిరంలో ఉన్న వారు కూడా ఒక్కోసారి సాయం చేస్తూంటారు. స్వపక్షంలో ఉంటూ కూడా కొంపలార్పేవారూ ఉన్నారు. అయితే ఇవన్నీ కేసీఆర్ లాంటి రాజకీయ దిగ్గజానికి బాగా ఎరుకే. ఇక అధికారంలో ఉన్న వారు ఎపుడూ తన ఓటు బ్యాంక్ చల్లగా ఉండాలని చూసుకుంటారు. ప్రత్యర్ధుల ఓట్లే చీలాలని చూస్తారు. ఆ విధంగా కనుక ఆలోచిస్తే కచ్చితంగా కేసీఆర్ కి ఇద్దరు మిత్రులు ఇపుడు దొరికారు అంటున్నారు. వారు ఒకరు పవన్ కళ్యాణ్ అయితే మరొకరు వైఎస్ షర్మిల అంటున్నారు.

సెంటిమెంట్ పంట..

ఇక కేసీఆర్ కి ఆంధ్రా సెంటిమెంట్ ని పండించడం అంటే భలే ఇష్టం. ఆయన రెండు దశాబ్దాల రాజకీయం అంతా దాని చుట్టూనే తిరిగింది. ఇక 2018 ఎన్నికల నాటికి కేసీఆర్ పాలన మీదనే తీర్పు ఇవ్వాలని జనాలు డిసైడ్ అయ్యారు. అయితే మధ్యలో చంద్రబాబు వచ్చి కేసీఆర్ ని ఆదుకున్నారు. ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎంటర్ కాగానే కేసీఆర్ కి వేయి ఏనుగుల బలం వచ్చింది. కష్టపడి సాధించుకున్న తెలంగాణా మీద ఆంధ్రోళ్ల పెత్తనమా అంటూ కేసీఆర్ ఏకంగా సింహ గర్జనే చేశారు. దాంతో టీడీపీతో జట్టు కట్టిన పాపానికి కాంగ్రెస్ కూడా కుదేల్ అయిపోగా కేసీఆర్ బంపర్ విక్టరీ కొట్టారు. ఇదే 2023లో కూడా రిపీట్ కాబోతోంది అంటున్నారు.

వారు చాలుగా ..?

కేసీఆర్ 2023 ఎన్నికల ప్రచారానికి వెళ్తే కచ్చితంగా షర్మిల పవన్ ల మీదనే తన బ్రహ్మాస్త్రాలు తీస్తారని అంటున్నారు. తెలంగాణా మీద ఆంధ్రుల కన్ను మళ్ళీ పడింది అంటూ కేసీఆర్ ఒక్క మాట అంటే చాలు ఈసారి కూడా టీఆర్ఎస్ తోటలో ఓట్ల గులాబీలు పూయడం ఖాయమనే అంటున్నారు. దాంతో పాటు పవన్ తో పొత్తు పెట్టుకుని వస్తున్న బీజేపీకి కూడా భారీ దెబ్బ పడుతుంది అంటున్నారు. మరో వైపు షర్మిల వల్ల కాంగ్రెస్ చతికిల పడడమే కాదు, ఇంకో వైపు ఆంధ్రా సెంటిమెంట్ తో కేసీఆర్ కి కూడా ఓట్లు పడేలా సీన్ ఉంటుందని కూడా లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ని మూడవ సారి గెలిపించడానికా అన్నట్లుగానే ఆంధ్రాకు చెందిన ఇద్దరు నేతలూ తెలంగాణాలో హల్ చల్ చేస్తున్నారు అన్న మాట అయితే ప్రత్యర్ధుల నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News