అడ్డుకునే వాడెవ్వడు?

నియంత అన్నారు. ఫాం హౌస్ కే పరిమితమవుతాడన్నారు. ప్రగతి భవన్ ను దాటి రాడన్నారు. బంగారు తెలంగాణను తన కుటుంబానికే పరిమితం చేశాడన్నారు. కానీ కేసీఆర్ కు [more]

Update: 2020-01-25 09:30 GMT

నియంత అన్నారు. ఫాం హౌస్ కే పరిమితమవుతాడన్నారు. ప్రగతి భవన్ ను దాటి రాడన్నారు. బంగారు తెలంగాణను తన కుటుంబానికే పరిమితం చేశాడన్నారు. కానీ కేసీఆర్ కు ఎదురే లేదన్నది మరోసారి రుజువయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆరేళ్ల పాలనలో కేసీఆర్ మీద వ్యతిరేకత పెరగలేదా? లేక వ్యతిరేకత ఉన్నా విపక్ష పార్టీలు వాటిని సొమ్ము చేసుకోవడంలో విఫలమయ్యారా? అన్న చర్చ జరుగుతోంది.

తిరిగి చూసుకోకుండా…?

2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ తిరిగి చూసుకోలేదు. ఏ ఎన్నికల్లోనూ ఎదురేలేకుండా చేసుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాయే తెలంగాణలో ఎగిరింది. జడ్పీ ఎన్నికల్లో మొత్తం 30 జడ్పీ స్థానాలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. పంచాయతీ ఎన్నికలూ టీఆర్ఎస్ వైపే ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా గులాబీ పార్టీ వైపు నిలిచాయి. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. ప్రత్యర్థుల అడ్రస్ ను గల్లంతు చేశారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవాకు ఎవరూ బ్రేకులు వేయలేకపోయారు.

ఎన్నికలకు వచ్చేసరికి….

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఆర్టీసీ సమ్మె సమయంలో నియంతలా వ్యవహరించారని కేసీఆర్ పై ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తి పోశాయి. అయినా ఎన్నికల సమయానికి వచ్చే సరికి కేసీఆర్ దే పై చేయి అవుతుంది. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ అసలు పర్యటించనే లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులకే పూర్తి బాధ్యతలను వదిలేశారు. అయినా దాదాపు కార్పొరేషన్లను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. నిజానికి ఆరేళ్ల పాలనలో ఎంతో కొంత అసంతృప్తి తలెత్తాల్సి ఉంది. కాని ఇసుమంతైనా కన్పించకపోవడం విశేషం.

విపక్ష పార్టీలు….

మరోవైపు విపక్ష పార్టీలు ఇక్కడ దాదాపు చేతులెత్తేసినట్లే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ఇక కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. సరైన నాయకత్వం లేకపోవడం, ఉన్న నాయకులందరూ పదవుల కోసమే వెంపర్లాడటం, పార్టీని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణలో బీజేపీ కొద్దోగొప్పో పుంజుకునే అవకాశాలున్నాయి. కేసీఆర్ మీద తెలంగాణలో వ్యతిరేకత ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే విజయాలు మాత్రం కేసీఆర్ ను వరసగా వరిస్తున్నాయనే చెప్పాలి. ఏ ఎన్నికల్లోనైనా ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో టీఆర్ఎస్ ఉండటం విశేషం.

Tags:    

Similar News