కదిరికి కలసి వచ్చేదెంత? వైసీపీలో చేరినా?

కదిరి బాబూరావు.. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా నందమూరి బాలకృష్ణకు ప్రియమిత్రుడిగా అందరికీ సుపరిచతమే. అలాంటి కదిరి బాబూరావు వైసీపీలో చేరి తప్పు చేశారా? భవిష్యత్తులో [more]

Update: 2020-05-30 11:00 GMT

కదిరి బాబూరావు.. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా నందమూరి బాలకృష్ణకు ప్రియమిత్రుడిగా అందరికీ సుపరిచతమే. అలాంటి కదిరి బాబూరావు వైసీపీలో చేరి తప్పు చేశారా? భవిష్యత్తులో టీడీపీలో ఉన్నంత గౌరవం, మర్యాద కూడా ఇక్కడ దక్కదా? అంటే అవుననే సమాధానం విన్పిస్తుంది. కదిరి బాబూరావు చేరడం వల్ల కొత్తగా వైసీపీకి వచ్చే ప్రయోజనం లేదు. అలాగని టీడీపీకి జరిగే నష్టం లేదన్న వ్యాఖ్యలు కనిగిరి నియోజకవర్గంలో విన్పిస్తున్నాయి.

ఎమ్మెల్యే కావాలని….

కదిరిబాబూరావు అనేక సార్లు ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకసారి టీడీపీ సీటు ఇచ్చినా నామినేషన్ లో ఫెయిలయి ఎన్నికలకు ముందే పక్కకు తప్పుకున్నారు. 2014లో తొలిసారి కదిరి బాబూరావు కనిగిరి నియోజకవర్గంల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నందమూరి బాలకృష్ణ, కదిరి బాబూరావు చదువుకునే సమయంలో మంచి మిత్రులు. బాబూరావు కుటుంబం కూడా కొన్ని దశాబ్దాల కిందటే వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ తరలి వెళ్లింది. దీంతోనే కదిరి బాబూరావుకు రెండుసార్లు టీడీపీ టిక్కెట్ దక్కింది.

గత ఎన్నికల్లో దర్శికి పంపడంతో….

2019 ఎన్నికల్లో కనిగిరి టిక్కెట్ ను ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. దర్శి నియోజకవర్గానికి పంపినా కదిరి బాబూరావు గెలవలేకపోయారు. దీంతో ఆయన ఊహించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైసీపీలో చేరిన కదిరి బాబూరావుకు పెద్దగా భవిష్యత్తు ఉండదన్నది ఆయన సన్నిహితులు కూడా బాహాటంగా చెబుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు.

ఆయననను కాదని….

కనిగిరి నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. బుర్రా మధుసూదన్ యాదవ్ ను కాదని కదిరి బాబూరావుకు టిక్కెట్ ఇస్తే వైసీపీకి నష్టం. అందుకని బుర్రాకో? అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికో టిక్కెట్ ఇస్తారుతప్ప కదిరి బాబూరావుకు వైసీపీ టిక్కెట్ దక్కే ఛాన్స్ లేదు. దీంతో ఆయన వైసీపీలో చేరి కూడా ప్రయోజనం లేదన్నది వాస్తవం. కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువ. వారు చెప్పినట్లే ఎమ్మెల్యే నడుచుకోవాల్సి ఉంటుంది. కదిరి విషయంలో అది జరగదు కాబట్టి రెడ్డి సామాజికవవర్గానికి చెందిన వైసీపీ నేతలు సయితం కదిరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తారు. దీంతో కదిరి బాబూరావు రాజకీయ భవిష్యత్ దుర్భిణీ వేసి చూసినా కన్పించడం లేదు.

Tags:    

Similar News