కమల్ ముందుగానే?

తమిళనాట మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టి తొలి ఎన్నికల్లోనే పరాజయాన్ని చవిచూసిన కమల్ హాసన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆషామాషీగా ఎన్నికలను తీసుకోకూడదని కమల్ [more]

Update: 2020-01-05 17:30 GMT

తమిళనాట మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టి తొలి ఎన్నికల్లోనే పరాజయాన్ని చవిచూసిన కమల్ హాసన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆషామాషీగా ఎన్నికలను తీసుకోకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

నిరాశకు లోను కాకుండా…..

ఓటమిని చవిచూసినా కమల్ హాసన్ ఎటువంటి నిరాశకు లోను కాలేదు. ఆయన క్యాడర్ లో భరోసా నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై కమల్ హాసన్ గొంతును పెంచారు. దీనిపై యువతలో అవగాహన పెంచేలా ఆయన కళాశాలలను, యూనివర్సిటీలను సందర్శిస్తున్నారు. విద్యార్థులు, యువతలో మమేకం అవుతున్నారు.

రజనీతో పొత్తుతో…..

కమల్ హాసన్ వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నారు. రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటన త్వరలోనే ఉండనుంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా కమల్ హాసన్ తనకు మిత్రుడని, సినిమా రంగానికే కాకుండా రాజకీయంగా కూడా తమ మిత్రత్వం కొనసాగుతుందని రజనీకాంత్ ప్రకటించారు. రజనీకాంత్ ప్రకటనను కమల్ హాసన్ స్వాగతించారు.

11 నెలల పాటు ప్రచారం…..

దీంతో రజనీకాంత్ పార్టీతో పొత్తు గ్యారంటీ అని భావించిన కమల్ హాసన్ తమ క్యాడర్ ను మరింత పటిష్ట పర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫిబ్రవరిలో కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కు శ్రీకారం చుట్టనున్నారు. ఉప ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కమల్ హాసన్ పార్టీ దూరంగా ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యులను నియమిస్తున్నారు. మొత్తం యాభై వారాల పాటు తమిళనాడులో కమల్ హాసన్ పర్యటించనున్నారు. దాదాపు పదకొండు నెలల పాటు ఈ ప్రచారయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కమల్ హాసన్ ఎన్నికల యుద్ధానికి కావాల్సిన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేశారు.

Tags:    

Similar News